Avatar 3: ‘అవతార్‌3’ అదిరిపోయే కాన్సెప్ట్‌.. రివీల్‌ చేసిన జేమ్స్‌ కామెరూన్‌

Avatar 3: ‘అవతార్‌2’ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ‘అవతార్3’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని జేమ్స్‌కామెరూన్‌ వెల్లడించారు.

Updated : 17 Jan 2023 16:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్ల సునామీని సృష్టిస్తున్న విజువల్‌ వండర్‌ మూవీ ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ (Avatar the way of water). ‘అవతార్‌’కు కొనసాగింపుగా జేమ్స్‌ కామెరూన్‌ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో ‘అవతార్‌3’ (Avatar3) ఎలా ఉంటుంది? ఏ నేపథ్యంలో సాగుతుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ప్రేక్షకుల ఉత్సుకత మరింత పెంచేలా ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ (james cameron) వెల్లడించారు.

ఇటీవల క్రిటిక్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌ మూవీ కేటగిరిలో ‘అవతార్‌2’ అవార్డు సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కామెరూన్‌ ‘అవతార్3’ గురించి మాట్లాడారు. అగ్ని ప్రధానంగా మూడో భాగం సాగుతుందని చెప్పారు. ‘‘అగ్ని ఒక చిహ్నం.. ప్రయోజనకారి. మూడో భాగంలో ఇదే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. సంస్కృతి మిళతమై కాన్సెప్ట్‌ సాగుతుంది. ఇంతకు మించి చెప్పకూడదేమో. దీంతో పాటు మరో రెండు సంస్కృతులు కూడా మీకు పరిచయం అవుతాయి. ఒమక్టయా, మెట్కైనా తెగలను మీరు కలుస్తారు. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం’’ అని అన్నారు. ఇదే విషయమై కామెరూన్‌ సతీమణి ఆసక్తికర కామెంట్‌ చేశారు. ‘మీ సీట్‌బెల్ట్‌ మరింత భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం’ ఉంది అన్నారు. ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మూడో భాగం పాండోరాలోని ఎడారిలాంటి ప్రదేశంలో సాగుతుందని హాలీవుడ్‌ టాక్‌. అక్కడ ఉండే సంపదను సొంతం చేసుకునేందుకు మనుషులు ఏం చేశారు? జేక్‌, అతడి కుటుంబ వారిని ఎలా అడ్డుకుంది? ఈ క్రమంలో జేక్‌ కుటుంబానికి ఎలాంటి ఆపద కలిగింది? వంటి అంశాలను కామెరూన్‌ మిళితం చేశారని అంటున్నారు. ఏదైమైనా దీని గురించి మరికొన్ని వివరాలు తెలియాలంటే చాలా కాలం ఆగాల్సిందే!

‘అవతార్‌2’తో పాటే ‘అవతార్‌3’ చిత్రీకరణ కూడా జేమ్స్‌కామెరూన్‌ దాదాపు పూర్తి చేశారు. కొంత ప్యాచ్‌ వర్క్‌తో పాటు, కీలకమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌ పని మిగిలి ఉంది. ఈ సినిమాను 2024 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర బృందం చెప్పింది. అంటే మూడో భాగం చూడాలంటే దాదాపు రెండేళ్ల పాటు వేచి చూడాల్సిందే! మరోవైపు ‘అవతార్‌: ది వే ఆఫ్ వాటర్‌’ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది. మొత్తంగా 1.9బిలియన్‌ డాలర్ల (గ్రాస్‌) వసూళ్లు సాధించింది. త్వరలోనే 2 బిలియన్‌ డాలర్ల మార్కును దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు