Avatar-2: ఆశ్చర్యపరుస్తోన్న ‘అవతార్‌2’ కలెక్షన్స్‌.. ఆల్‌టైం టాప్‌5లో చేరిన విజువల్‌ వండర్‌

ఇటీవల విడుదలైన అవతార్‌2(Avatar2: The Way Of Water) సినిమా సూపర్‌ హిట్‌ అందుకొని వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. పదిరోజుల్లోనే ఆల్‌టైమ్‌ టాప్‌5 సినిమాల సరసన చేరిపోయింది. 

Published : 26 Dec 2022 18:17 IST

హైదరాబాద్‌: జేమ్స్‌ కామెరూన్‌(James Cameron) అద్భుత సృష్టి ‘అవతార్‌2’(Avatar2: The Way Of Water) విడుదలకు ముందు నుంచే అద్భుతాలు సృష్టిస్తూ వచ్చింది. ఇక 10 రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ విజువల్‌ వండర్‌ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన ప్రతిచోటా హౌస్‌ఫుల్‌తో సందడి చేస్తోంది.  దాదాపు రెండు వారాల్లోనే వందలకోట్లు కొల్లగొడుతూ రికార్డులను సొంతం చేసుకుంటుంది. ఇక వసూళ్ల విషయంలో ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా టాప్‌5 రికార్డుల సరసన చేరింది. టాప్‌ 5లో ఒకటైన అవెంజర్స్‌ ఎండ్‌గేమ్ Avengers: Endgame కలెక్షన్‌ను ‘అవతార్‌2’ అవలీలగా అధిగమించేసేలా ఉంది. ఇక భారత్‌లో రూ.200 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.7000 కోట్లు రాబట్టి అత్యధిక వసూలు సాధించిన సినిమాల్లో ఐదో స్థానంలో నిలిచింది.   
ఇక ‘అవతార్‌2’ సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఆనందంలో ఉన్న దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌(James Cameron) ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఈ సినిమా కోసం తానెంత కష్టపడ్డారో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘‘2009లో ‘అవతార్’ సినిమా చూశాక చాలామంది దానికి సీక్వెల్‌ వస్తే బాగుంటుందనుకున్నారు. నేను ఎన్నో సంవత్సరాలు ఆలోచించి ఈ సినిమాకు సీక్వెల్‌ తీయాలని నిర్ణయించుకున్నా. దాని కోసం ఎంతో పరిశోధన చేశాను. అవతార్‌ రెండో భాగం తీయడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే నా జీవితాన్నే త్యాగం చేశాను. ప్రస్తుతం అవతార్‌ సినిమా మిగిలిన భాగాలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి’ అని చెప్పారు. ఇక 2009లో వచ్చిన అవతార్‌ మొదటిభాగంలో చిన్నాపెద్దా అందరికీ పండారా గ్రహం చూపించిన  ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ తాజాగా రెండో భాగంలో సముద్రంలోకి తీసుకెళ్లారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని