Updated : 28 Jun 2022 13:58 IST

avika gor: నా ప్రతి అడుగులో తనున్నాడు!

‘‘నా కథల ఎంపిక తెలుగు ప్రేక్షకులకు నచ్చుతోంది. ఇంతకుముందు చేసిన సినిమాలకి భిన్నమైన మరొక కథ కావడంతో ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ ఒప్పుకున్నా. ఇదీ అందరినీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంద’’న్నారు అవికాగోర్‌. తను, శ్రీరామ్‌ ప్రధాన పాత్రధారులుగా... అంజి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అచ్యుత రామారావు, పి.రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్‌ మైసూర్‌ సమర్పకులు. చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అవికాగోర్‌ విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘అందమైన అనుభూతిని పంచే చిత్రమిది. పదో తరగతి చదివిన సహాధ్యాయిలంతా చాలారోజుల తర్వాత మరోసారి కలిస్తే ఆ అనుభవం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. దాంతోపాటు ఇందులో మంచి డ్రామా, వినోదం ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు చాందిని. ఆ పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. ఆమె ఎవరు? ఏం చేస్తుంటుందనేది ఆసక్తికరం. అడుగడుగునా ఆసక్తిని రేకెత్తించే చిత్రమిది’’.
* ‘‘నా టెన్త్‌ క్లాస్‌ రోజులన్నీ సెట్లోనే ఎక్కువగా గడిచాయి. అప్పటికే నేను నటిని కావడంతో స్కూల్‌కి వెళ్లింది తక్కువ, చిత్రీకరణల కోసం సెట్లో గడిపిందే ఎక్కువ. కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మదిలో పదిలంగా ఉన్నాయి. అందరినీ ఆ రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా ఇది. శ్రీరామ్‌తో కలిసి నటిస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయనతో నాకున్నది తక్కువ సన్నివేశాలే. కానీ ఆ ప్రయాణంలో తన అనుభవాలన్నీ నాతో పంచుకున్నారు. అంజి స్వతహాగా ఛాయాగ్రాహకుడు కావడంతో విజువల్‌గా సినిమా బాగుంటుంది. నటీనటుల నుంచి చక్కటి పనితీరుని రాబట్టుకున్నారు. శ్రీలంక, రాజమండ్రి, చిక్‌మగళూరు... ఇలా చాలా ప్రదేశాల్లో చిత్రీకరణ చేశాం’’.
*  ‘‘హిందీలో ధారావాహికలు చేస్తుండటంతో తెలుగులో ఎక్కువ చిత్రాలు చేయలేకపోయా. ప్రస్తుతం ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’, ‘థ్యాంక్‌ యూ’... వరుసగా రాబోతున్నాయి. త్వరలోనే తెలుగులో చేసే కొత్త చిత్రాల వివరాలు ప్రకటిస్తా. వ్యక్తిగత జీవితం సంతృప్తిగా ఉంది. మిలింద్‌తో ప్రేమ ప్రయాణం బాగుంది. నేను బరువు తగ్గడం నుంచి, నిర్మాతగా మారడం వరకూ తను ప్రతి అడుగులోనూ ఉన్నాడు. నా శక్తి సామర్థ్యాలు ఏమిటో, నేనేం చేయగలనో తెలుసుకునేలా చేశాడు. తన పరిచయం తర్వాత నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది’’.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts