రాగం.. తానం.. పల్లవి.. పురస్కారం

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటల్లో మేలిమి గీతాలు ఏరాలంటే... కష్టమే. ఎందుకంటే దేనికదే ఆణిముత్యం. ఏ పాట విన్నా... 

Updated : 29 Oct 2023 11:54 IST

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటల్లో మేలిమి గీతాలు ఏరాలంటే... కష్టమే. ఎందుకంటే దేనికదే ఆణిముత్యం. ఏ పాట విన్నా... మనసు మురిసిపోతుంది. ఆయన గొంతు అలాంటిది మరి. ఆయన పాటల జడివానలో తడిసి ముద్దయిన హృదయాలు ఇచ్చిన పురస్కారాలు లెక్కకుమిక్కిలి. వీటితోపాటు ప్రభుత్వాలు, సంస్థలు కూడా ఆయన్ను పురస్కారాలతో గౌరవించాయి. ఆ వివరాలు ఇవీ...

 

‘శంకరాభరణం’తో మొదలు...

భారతీయ చలనచిత్ర పరిశ్రమ మార్పులు, ఘనతలు గురించి మాట్లాడుకుంటే... తొలుత ప్రస్తావనకు వచ్చే సినిమా ‘శంకరాభరణం’ (1980). మొత్తం చలనచిత్ర పరిశ్రమ గమనాన్ని మార్చిన చిత్రమిది. బాలసుబ్రహ్మణ్యం జీవితంలోనూ ఈ సినిమాకు ప్రత్యేక స్థానముంది. ఆయన గాయకుడిగా తొలి జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నది ఆ సినిమాకే. అందులో ఆయన ఆలపించిన ‘ఓంకార నాథాను..’ అనే పాట ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. దానికిగానూ రజత నంది పురస్కారం అందుకున్నారు. అక్కడికి రెండేళ్లకే మరోమారు జాతీయ పురస్కారం అందుకున్నారు. ఈసారి హిందీ సినిమాకు. ‘ఏక్‌ దుజే కేలియే’ (1982) సినిమాలోని ‘తేరా మేరా బీచ్‌ మే...’ అంటూ బాలు హుషారుగా ఆలపించిన గీతం పురస్కారం తెచ్చిపెట్టింది. 

ఆ జోరు కొనసాగించిన బాలు మళ్లీ రెండేళ్లకు ‘సాగరసంగమం’ (1984) తో పురస్కారం కైవసం చేసకున్నారు. సినిమాలో అన్ని పాటలూ బాగున్నా... ఇప్పటికీ మారుమోగే పాట ‘వేదం.. అణువణువున నాదం..’. దానికే బాలుకు పురస్కారం వచ్చింది.  ఇక ‘రుద్రవీణ’ (1989)లోని ‘చెప్పాలని ఉంది... గొంతు విప్పాలని ఉంది..’ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో కీలక సమయంలో వచ్చే పాట... సినిమాలో చిరంజీవి పాత్రనే కాదు.. థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుల్ని కూడా ఆలోచనలో పడేస్తుంది. అంతటి గొప్ప పాట పాడిన బాలు గొంతుకు మరోసారి జాతీయ పురస్కారం వశమైంది. ఈ వరుసలో ‘సంగీత సాగర గణయోగి పంచాక్షర గవాయి’ (కన్నడ)లోని ‘ఉమందు ఘుమందు ఘన గర్‌...’ పాటకు, ‘తంగ తమరాయి...’ అనే తమిళ పాట (తమిళ సినిమా-  ‘మినసారా కనవు’) పాడినందుకు ఆయన జాతీయ పురస్కారాలు దక్కాయి.

ప్రేమకొకటి.. భక్తికొకటి

‘మైనే ప్యార్‌ కియా’ (1990) సినిమా పేరు చెప్పగానే ‘దిల్‌ దీవానా...’ అంటూ పాటందుకుంటారు. ఆ పాటకున్న క్రేజ్‌ అలాంటిది. ఆ పాట పాడింది కూడా మన బాలసుబ్రహ్మణ్యమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటకుగానూ ఆయనకు ఫిలింఫేర్‌ పురస్కారం దక్కింది. ఇక దక్షిణాది ఫిలింఫేర్‌ పురస్కారాల విషయానికొస్తే... ‘శ్రీరామదాసు’ (2006)కి ఆయన ఫిలింఫేర్‌ సౌత్‌ పురస్కారం అందుకున్నారు.  అందులో ఆయన పాడిన ‘అదిగదిగో భద్రగిరి..’కి పురస్కారం దక్కింది. రాముని స్తుతిస్తూ భద్రుడు పాడిన ఆ పాట ఇంకా మన చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఇవి కాకుండా... తమిళ సినిమా ‘మోళి’లో ఆలపించిన ‘కన్నల్‌ పేసుమ్‌ పెన్నే’, ‘ఆప్తరక్షక’ అనే కన్నడ చిత్రంలో పాడిన ‘ఘర్నే ఘర ఘరణే..’ అనే గీతానికి బాలు ఫిలింఫేర్ (సౌత్‌) పురస్కారం అందుకున్నారు. 

నందుల బాలు

గానగంధర్వునికి వచ్చిన నందుల గురించి చెప్పాలంటే... పెద్ద లిస్టే రాసుకోవాలి. ఎప్పుడో 1978లో తొలి నంది అందుకున్న బాలు... 2009 వరకు కైవసం చేసుకుంటూనే ఉన్నారు. ప్రేమ పాటలు, విరహ గీతాలు, దేశభక్తి పాటలు... ఇలా ఒక్కటేంటి అన్నింటిలోనూ తనదైన ముద్రవేసిన బాలు ఆఖరిగా... ‘మహాత్మ’ (2009) సినిమాలోని ‘కొంతమంది ఇంటిపేరు కాదు రా గాంధీ...’ అంటూ బాలు ఆలపించిన పాటకు నంది కైవసం చేసుకున్నారు. దానికి ముందు ‘పెళ్లాం పిచ్చోడు’ (2005) సినిమాలో ‘రూపాయివే..’ అంటూ బాలు పాడిన పాట ఎంతోమందిని ఆలోచింపజేసింది. అందుకే నంది కూడా వచ్చేసింది. ‘ఇదిగో రాయలసీమ గడ్డ...’ అంటూ ‘సీతయ్య’లో సీమ పౌరుషాన్ని ఓ రేంజ్‌లో వినిపించినందుకుగా 2003లో  నంది అందుకున్నారు. ‘పాడనా తీయనా కమ్మని ఒక పాట..’ అంటూ ‘వాసు’ క్లైమాక్స్‌లో వెంకటేశ్‌ అదరగొట్టిన పాట గుర్తుందిగా... ఆ పాటకు తన గొంతుతో ప్రాణం  పోసింది మన బాలునే. దానికీ 2002లో నంది గౌరవం పొందారు. పాటలో భావం... బాలు గొంతులో ఎలా పలికిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఆ సినిమాకంటే ముందు ‘రాఘవయ్య గారి అబ్బాయి’(2000) లో ఓ పాటకు, ‘ప్రియరాగాలు’ (1997) సినిమాలోని ‘చిన్న చిరు చిరు నవ్వుల చిన్నా’ పాటకు నంది దక్కింది. కొడుకును అనునయిస్తూ జగపతి బాబు పాడే ఆ పాటకు ఆ రోజుల్లో మంచి ఆదరణ దక్కింది. దానికి బాలు గొంతు ఎంతగానో తోడ్పడిందనే చెప్పాలి. అంతకుముందు బాలు నంది అందుకున్న చిత్రం ‘భైరవ ద్వీపం’ (1994). అందులో ‘శ్రీ తుంబుర నారద నాదామృతం...’ అంటూ బాలు ఆలపించిన గీతానికి సినిమాలో దివ్యాశ్వాన్ని ప్రసన్నం చేసుకుంటాడు బాలకృష్ణ. ఆ పాట పాడి పురస్కారం అందుకున్నారు మన బాలు. ఆ సినిమాకు ముందు ఎస్పీబీ నందులు గెలుచుకున్న చిత్రాలు ‘మిస్టర్‌ పెళ్లాం’ (1993), ‘బంగారు మామ’ (1992), ‘చంటి’ (1991), ‘నీరాజనం’ (1989). వీటిలో బాలు పాడిన పాటలు వీనులవిందు చేయడంతోపాటు.. నందులనూ అందుకున్నాయి. 

ప్రేమ కథల్లో ముందు వరుసలో ఉండే సినిమా ‘అభినందన’ (1987). ఆ సినిమాలో పాటలన్నీ అద్భుతమే. ఆ అద్భుతాల్లో బాలు గొంతు నుంచి జాలువారిన మహాద్భుత గీతం ‘రంగులలో కలవో...’. దీనికి నంది అందుకున్నారు ఎస్పీబీ. ఇక ‘సిరివెన్నెల’ (1986)లోని ‘విధాత తలపున...’ పాట గురించి వేరేగా చెప్పాలా.  ఈ రోజుకూ మేటి పాటల్లో ఒకటిగా ఉంటూ వస్తోన్న ఈ గీతం వింటే బాలు గాన విశ్వరూపం కనిపిస్తుంది. అందుకే ఆ రోజుల్లో ప్రభుత్వం నందితో గౌరవించింది. ఆయనే స్వరపరిచిన ‘మయూరి’  (1985) సినిమాకు ఉత్తమ గాయకుడితోపాటు, సంగీత దర్శకుడిగా కూడా ఎస్పీ బాలు నంది పురస్కారం కైవసం చేసుకున్నారు. ‘సువర్ణ సుందరి’ (1984)లోని ‘ఇది నా జీవితాలాపన...’, ‘బహుదూరపు బాటసారి’ (1983) సినిమాలోని ‘ఎక్కడ తలుపులు అక్కడే మూసేయ్‌...’ గీతాలకు నంది పురస్కారం అందుకున్నారు. 

‘ఆగదూ.. ఆగదు ఈ నిమిషము...’ అంటూ ‘ప్రేమాభిషేకం’ (1981)లో అక్కినేని నాగేశ్వరరావు చేసిన నటన ఎంతగా గుర్తుండిపోయిందో... ఆ వాయిస్‌ కూడా అంతే గుర్తుంటుంది. కారణం ఆ గొంతు ఎస్పీబీది కావడం. ఆ పాట సృష్టించిన ప్రభంజనం బాలుకు నంది తెచ్చిపెట్టింది. గానగంధర్వునికి జాతీయ పురస్కారం తెచ్చిపెట్టిన ‘శంకరాభరణం’ (1979)... నందిని కూడా అందించింది. ఆ సినిమాలోని అన్ని పాటలకుగాను ఆయన నందితో సత్కరించారు. ఇక మనం చెప్పుకోవాల్సింది ఆయనకు ఉత్తమ గాయకుడిగా నంది తీసుకొచ్చిన తొలి చిత్రం గురించింది. అదే ‘నాలాగా ఎందరో’ (1978). ఈ సినిమాతోనే బాలు నంది ప్రస్థానం మొదలైంది. 

దక్షిణాది పురస్కారాలివీ...

బాలు గాత్రంతో పులకరించిన ప్రేక్షకులు దేశం మొత్తం ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఆయన పురస్కారాలు కూడా దేశం నలుమూలల నుంచి వచ్చాయి. దక్షిణాది నుంచి పురస్కారాలు కూడా వచ్చాయి. ‘అదిమాయిప్పెన్‌’, ‘శాంతి నిలయం’,  ‘నిళహగళ్‌’, ‘కెలాడి కణ్మణి’, ‘జైహింద్‌’ చిత్రాల్లో పాడినపాటకు తమిళనాడు రాష్ట్రప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. అలాగే  కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఓ మల్లిగే’, ‘సృష్టి’, ‘సావి సావి నేనపు’ సినిమాల్లో పాటలకు ఉత్తమ నేపథ్య గాయకుడి పురస్కారం అందుకున్నారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని