Ayali Review: రివ్యూ: అయలీ.. దేవత దర్శనం ఆ అమ్మాయిలకేనా?

ముత్తు కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌ సిరీస్‌ ‘అయలీ’. ఈవారం విడుదలైన ఈ సిరీస్‌ ఎలా ఉందంటే?

Updated : 28 Jan 2023 11:01 IST

Ayali review వెబ్‌ సిరీస్‌: అయలీ; నటీనటులు: అభి నక్షత్ర, అనుమోల్‌, మదన్‌, సింగంపులి, టీఎస్‌ ధర్మరాజు, లింగా తదితరులు; కూర్పు: గణేశ్‌ శివ; ఛాయాగ్రహణం: రామ్‌జీ; సంగీతం: రెవా; స్క్రీన్‌ప్లే, సంభాషణలు: వీణై మైంధాన్‌, సచిన్‌, ముత్తు కుమార్‌; నిర్మాణ సంస్థ: ఎస్ట్రెల్లా స్టోరీస్‌; దర్శకత్వం: ముత్తు కుమార్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: జీ 5.

థియేటర్లలోకి ప్రతివారం కొత్త సినిమాలు వచ్చినట్టే ఓటీటీల్లోకి వెబ్‌సిరీస్‌లు వస్తున్నాయి. అలా ఈవారం విడుదలైన సిరీస్‌ల్లో ‘అయలీ’ ఒకటి. తమిళంలో రూపొందిన ఈ సిరీస్‌ తెలుగు భాషలోనూ ‘జీ 5’ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి అయలీ అంటే ఎవరు? ఆ కథేంటి? తెలుసుకోవాలనుంటే ఇది చదివేయండి (Ayali review)..

ఇదీ కాన్సెప్ట్‌: తమిళనాడులోని వీరపన్నై గ్రామ దేవత అయలీ. రజస్వలకాని అమ్మాయిలు తప్ప మరెవరూ ఆ దైవాన్ని దర్శించుకోకూడదు, పుష్పవతి అయిన వెంటనే వారికి పెళ్లి చేసేయాలి, పెద్దగా చదువుకోకూడదు.. అనేవి ఆ ఊరి కట్టుబాట్లు. ఈ సంప్రదాయాన్ని అగౌరవపరిచి ఓ అమ్మాయి ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని, అందుకే అమ్మవారు ఆగ్రహించి ఊరిని నాశనం చేసిందని భావించిన వీరపన్నై గ్రామస్థులంతా వేరే ప్రాంతానికి తరలివెళ్తారు. కొత్తగా నిర్మించుకున్న ఊరిలోనూ అయలీ మందిరాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడా తమ ఆచారాల్ని కొనసాగిస్తారు. మరి, అదే ఊరికి చెందిన యళిల్‌ (అభి నక్షత్ర) పదో తరగతి వరకూ ఎలా చదువుకోగలిగింది? డాక్టర్‌కావాలనే తన కల నెరవేరిందా? గ్రామ ప్రజల్లో ఏ విధంగా మార్పు తీసుకొచ్చింది? ఆమె తల్లిదండ్రులు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు? అన్నది మిగతా కథ (Ayali review).

ఎలా సాగిందంటే: స్టోరీ సంగతి కాసేపు పక్కన పెడితే ఈ సిరీస్‌ టైటిలే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉంది. తమిళ్‌ పేరు కాబట్టి అయలీ అంటే ప్రాంతమా? మనిషా? ఇలా ఎన్నో సందేహాలు. వాటికి సమాధానం కోసం సిరీస్‌ ప్లే చేస్తే ప్రారంభంలోనే అది గ్రామ దేవత పేరని తెలుస్తుంది. ‘ఆన్సర్‌ తెలిసిపోయింది కదా. ఇక ఆపేద్దాం’ అని అనుకునేలోపు కథే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. 1990లో సాగే, 8 ఎపిసోడ్ల కథ ఇది. గ్రామస్థులంతా ఒకే మాటపై నిలబడడం, కాదన్నవారిని వెలివేయడం.. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌ ఉన్న సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. ఇక్కడా థీమ్ అదేకావొచ్చుకాని దర్శకుడు ఎంపిక చేసుకున్న సెన్సిటివ్‌ పాయింట్‌ హృదయాల్ని కదిలిస్తుంది. సినిమాల్లో హీరోలు చేసినట్టు ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉండవు. మానసిక స్థైర్యంతోనే ప్రధాన పాత్ర అయిన యళిల్‌ లక్ష్యం దిశగా అడుగులేస్తుంది.

పరిచయం నుంచే ఆ పాత్రపై ఆసక్తి మొదలవుతుంది. దాన్ని అలానే కొనసాగిస్తూ దర్శకుడు యళిల్‌ పోరాటాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. తన లక్ష్యం ముందు.. తండ్రిని, గ్రామాన్ని మోసం చేస్తున్నాననే విషయం చాలా చిన్నదిగా భావించిన యళిల్‌ తీసుకునే ప్రతి నిర్ణయం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. అలా అని సిరీస్‌ పూర్తిగా సీరియస్‌ కోణంలో సాగుతుందనుకుంటే పొరపాటే. తల్లీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, వారి మధ్య చోటుచేసుకునే చిన్న చిన్న గొడవలు.. వాటిల్లోంచి పుట్టే నవ్వులు.. రిలీఫ్‌ ఇచ్చే ఇలాంటి అంశాలూ ఉన్నాయి. అబ్బాయిలకే కాదు అమ్మాయిలకూ చదువు ముఖ్యమని ప్రోత్సహించే ప్రధానోపాధ్యాయురాలి పాత్ర, కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుని చోరీలు చేసే పాత్ర, విలనిజం ప్రదర్శించే పాత్రలూ మెప్పిస్తాయి. వీటితో ఎంగేజ్‌ చేసిన దర్శకుడు మరికొన్ని పాత్రలతో ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షించారు. దొంగను అరెస్ట్‌ చేసేందుకు గ్రామానికి వచ్చిన పోలీసు అధికారిణిని చూసి ఎందరో ఆడవాళ్లు స్ఫూర్తిపొందుతారు. ఆ పాత్రను హైలైట్‌ చేస్తూ మరికొన్ని సన్నివేశాలు తీసుంటే ఇంకా బాగుండేది. ఎవరి వల్ల అయితే దేవత ఆగ్రహించిందని వీరపన్నై గ్రామస్థులు అనుకున్నారో.. ఆ పాత్రలనూ దర్శకుడు రివీల్‌ చేసి ఉండాల్సింది (Ayali review). 

ఎవరెలా చేశారంటే: యళిల్‌ పాత్రలో నక్షత్ర జీవించింది. కథను తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపించింది. అనుమోల్‌, మదన్‌, సింగంపులి, టీఎస్‌ ధర్మరాజు, లింగా తదితరులు తమ పాత్రకు న్యాయం చేశారు. రెవా అందించిన నేపథ్య సంగీతం హత్తుకుంటుంది. పల్లెటూరి వాతావరణాన్ని రామ్‌జీ తన కెమెరాలో చక్కగా బంధించారు. కథ ఆసక్తిగా సాగుతున్నప్పుడు అడ్డుపడే కొన్ని పాత్రలను ఎడిటర్‌ గణేశ్‌ శివ ‘కట్‌’ చేసి ఉండి ఉంటే సిరీస్‌ మరోస్థాయిలో ఉండేది. ‘ఇది గుడి కాదు అమ్మాయిలు మనసు విప్పి మాట్లాడుకునే చోటు’ వంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. ముత్తు కుమార్‌ దర్శకత్వం బాగుంది (Ayali review).

బలాలు: + అభి నక్షత్ర నటన; + కథ; + సంభాషణలు

బలహీనతలు: - అసందర్భంగా వచ్చే కొన్ని పాత్రలు 

చివరగా: యళిల్‌ ప్రయాణం స్ఫూర్తిదాయకం.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు