Updated : 23 Sep 2022 17:57 IST

Babli Bouncer Review: రివ్యూ: బబ్లీ బౌన్సర్‌

Babli Bouncer Review చిత్రం: బబ్లీ బౌన్సర్‌; నటీనటులు: తమన్నా, సౌరభ్‌ శుక్లా, అభిషేక్‌ బజాజ్‌, సాహిల్‌ వైద్‌, ప్రియం సాహా తదితరులు; సంగీతం: తనిష్క్‌ బాగ్చీ, కరణ్‌ మల్హోత్ర ; సినిమాటోగ్రఫీ: హిమాన్‌ ధమీజా; ఎడిటింగ్‌: మనీశ్‌ ప్రధాన్‌; నిర్మాణ సంస్థలు: ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌, జంగ్లీ పిక్చర్స్‌; దర్శకత్వం: మధుర్‌ భండార్కర్‌; విడుదల: డిస్నీ+ హాట్‌స్టార్‌.

ఓ వైపు గ్లామర్‌ పాత్రల్లో కనిపిస్తూనే మరోవైపు నటనకు అధిక ప్రాధాన్యమున్న చిత్రాల్లోనూ నటిస్తోంది అగ్ర కథానాయిక తమన్నా (Tamannaah). అలా ఆమె నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘బబ్లీ బౌన్సర్‌’ (Babli Bouncer). భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మహిళా బౌన్సర్‌ కథతో తెరకెక్కిన తొలి సినిమా ఇదేనని, టైటిల్‌ పాత్రను సవాలుగా స్వీకరించానని ప్రచారంలో తమన్నా చెప్పుకొచ్చింది. మరి, ఈ బౌన్సర్‌ కథేంటి? తమన్నా మెప్పించిందా?

కథేంటంటే?: ‘బాక్సర్‌ టౌన్‌’గా పేరొందిన ఫతేపూర్‌ బేరి (దిల్లీ సమీపంలో) గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. కండలు పెరిగేందుకు తగిన వ్యాయామం చేయటం, బౌన్సర్లుగా దేశ రాజధాని దిల్లీలో ఉద్యోగం సంపాదించటం ఆ ఊరిలోని చాలామంది పురుషుల లక్ష్యం. ‘మగవాళ్లేనా.. మేమూ ఆ పని చేయగలం’ అనే ధోరణి బబ్లీ (తమన్నా)ది. ఈ విషయంలో.. పహిల్వాన్‌ అయిన బబ్లీ తండ్రి (సౌరభ్‌ శుక్లా) ఆమెను ప్రోత్సహించినా తల్లి మాత్రం ఒప్పుకోదు. బబ్లీకి త్వరగా పెళ్లి చేసేసి, బాధ్యత తీర్చుకోలానుకుంటుందామె. ఈ క్రమంలో పెళ్లి సంబంధాలను తీసుకురాగా బబ్లీ వాటిని తిరస్కరిస్తుంది. చివరకు.. తనను ఇష్టపడే కుక్కు (సాహిల్‌ వైద్‌)తో ఓ షరతు మేరకు పెళ్లికి అంగీకరిస్తుంది. మరోవైపు, తన స్కూల్‌ టీచర్ తనయుడు విరాజ్‌ (అభిషేక్‌ బజాజ్‌)పై మనసు పారేసుకుంటుంది. మరి, బబ్లీ పెట్టిన ఆ కండీషన్‌ ఏంటి? విరాజ్‌.. బబ్లీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడు? అన్నది మిగతా కథ.

ఎలా ఉందంటే?: ప్రసిద్ధి చెందిన ప్రాంతం గురించి తెరకెక్కిన సినిమా అని తెలియగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. బౌన్సర్లను తీర్చిదిద్దటంలో ప్రఖ్యాతిగాంచిన ఫతేఫూర్‌ బేరికి సంబంధించిన కథ కావటంతో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇందులో ఆ ఊరి పేరు వినిపించటం మినహా అక్కడ నివసించే వారంతా ఎందుకు బౌన్సర్లుగా మారారు? కథానాయికను ప్రేరేపించిన సంఘటనేంటి? తదితర విషయాలేవీ ఈ చిత్రంలో కనిపించవు. దర్శకుడు ఈ చిత్రాన్ని ప్రేమకథగానే తెరపైకి తీసుకొచ్చారు. ప్రేమించిన వ్యక్తుల కోసమే కాదు తన చుట్టూ ఉన్న వారినీ బబ్లీ ప్రాణాలు తెగించి కాపాడుతుందనే పాయింట్‌ను ప్రధానంగా తీసుకున్నారు. ప్రేమ కోణంలోనూ ఈ కథను దర్శకుడు బలంగా చెప్పలేదనిపిస్తుంది. ‘ఐ యామ్‌ వెరీ వెరీ ఫన్నీ’.. ఈ సినిమాలో ఎక్కువగా వినిపించే డైలాగ్‌ ఇది. బౌన్సర్లంటే సాధారణంగా అందరూ సీరియస్‌గానే కనిపిస్తారు. దాన్ని బ్రేక్‌ చేసేందుకే ఈ మహిళా బౌన్సర్‌ను యాక్టివ్‌గా చూపించినట్టు ఉన్నారు.

తన స్నేహితురాలితో కలిసి బబ్లీ చేసే అల్లరి, పెళ్లి సంబంధాలను చెడగొట్టడం తదితర సన్నివేశాలతో ప్రథమార్ధం రొటీన్‌గా సాగింది. ఒకటి రెండు చోట్ల తప్ప ఆసక్తిని పెంచే సీన్లు లేవు. ద్వితీయార్ధం కొంత ఊరటనిస్తుంది. విరాజ్‌-బబ్లీ, తన తండ్రి- బబ్లీకి మధ్య సాగే కొన్ని సీన్లు భావోద్వేగాన్ని పండిస్తాయి. పదో తరగతి ఐదు సార్లు ఫెయిల్‌ అయిందంటూ బబ్లీని చూసి నవ్వుకునే గ్రామస్తులే ఆమె చేసిన మంచి పనిని ప్రశంసిస్తారు. అలాంటి సన్నివేశాలపైనే దర్శక- రచయితలు శ్రద్ధపెట్టి ఉంటే ఈ సినిమా స్ఫూర్తిమంతగా నిలిచేది.

ఎవరెలా చేశారంటే?: ఈ చిత్రం తమన్నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఎంతో హుషారైన పాత్రలో ఒదిగిపోయింది. కానీ, కొన్ని సన్నివేశాల్లోనే ఆమెను బౌన్సర్‌గా చూస్తాం. కథానాయిక తండ్రిగా సౌరభ్‌ శుక్లా, అభిషేక్‌ బజాజ్‌, సాహిల్‌ వైద్‌లు ఫర్వాలేదనిపిస్తారు. కొన్ని సన్నివేశాల్లోని నేపథ్య సంగీతం తప్ప ఏ ఒక్క పాటా ఆకట్టుకునేలా లేదు. మనీశ్‌ ప్రధాన్‌ ఇంకా ఎడిట్‌ చేయాలి. హిమాన్‌ ధమీజా సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ‘ఫ్యాషన్‌’, ‘హీరోయిన్‌’ వంటి పలు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు తీసిన మధర్‌ భండార్కర్‌ ‘బబ్లీ’ని బలంగా చూపిస్తే బాగుండేది.

బలాలు

+ తమన్నా నటన

+ ద్వితీయార్ధంలోని కొన్ని సన్నివేశాలు

బలహీనతలు

- కథ

- సంగీతం

చివరిగా: ఈ ‘బబ్లీ’.. సీరియస్‌ కాదు ఫన్నీ ‘బౌన్సర్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts