Balakrishna: ‘వెన్నుపోటు’ వ్యాఖ్యలపై బాలకృష్ణ భావోద్వేగం!

తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావుకు తాను కేవలం కొడుకును మాత్రమే కాదని, అంతకుమించిన అభిమానిని

Published : 11 Dec 2021 15:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావుకు తాను కేవలం కొడుకును మాత్రమే కాదని, అంతకుమించిన అభిమానిని అని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. తాజా ఎపిసోడ్‌కు ‘అఖండ’ చిత్ర బృందం వచ్చి సందడి చేసింది. ఈ సందర్భంగా నటుడు శ్రీకాంత్‌ తన తండ్రి గురించి చెబుతున్న సందర్భంలో బాలకృష్ణ కలగజేసుకుని ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

‘‘మా నాన్నగారికి ఏమైనా ఇద్దామంటే ఒప్పుకునేవారు కాదు. ప్రతిపక్షంలో ఉండగా, ఆయనకు 800సీసీ మారుతీకారు ఉండేది. అందరూ దానిలోనే ఇరుక్కుని వెళ్లేవారు. అప్పుడు నేను 1000సీసీ కారు వాడేవాడిని. ఒకరోజు నాన్నగారి దగ్గరకు వెళ్లి ‘నాన్న నాది 1000సీసీ కారు. మీరు దీన్ని...’ అని ఏదో చెప్పబోయేసరికి ‘మీరు మాకు ఇచ్చేది ఏంటి? ఇలాంటివి వందలు కొనగలం’ అన్నారు. కొడుకు ఇచ్చే స్థాయికి వచ్చాడనే ఆనందం ఆయనది. ఆ తర్వాత చాలా మంది తప్పుడు ఆరోపణలు చేశారు. ‘ఎన్టీఆర్‌ను పిల్లలు సరిగా చూసుకోలేదు. వెన్నుపోటు పొడిచారు’ అంటూ విమర్శలు చేశారు. ‘ఒకరు ఏదైనా విషయం పదిసార్లు చెబితే అదే నిజమనుకుంటారు. పార్టీని కాపాడుకోవటం కోసం..’ సరే అది పక్కన పెట్టండి. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు. తండ్రి గురించి మాట్లాడేసరికి నేను ఎంత పోగొట్టుకున్నానే విషయాన్ని చెప్పాలనుకున్నా. పుట్టినప్పటి నుంచి ఆయనకు దూరంగా పెరిగా. ఆయన మద్రాసులో ఉంటే నేను హైదరాబాద్‌లో ఉండేవాడిని. ఆయన రాజకీయాల్లో వచ్చిన తర్వాత నేను సినిమాల కోసం మద్రాసులో ఉండాల్సి వచ్చింది. చివరి వరకూ ఎవరి మీదా ఆధారపడకుండా బతికిన వ్యక్తి ఆయన. నేను ఆయనకు కొడుకుని మాత్రమే కాదు.. అభిమానిని కూడా. కుటుంబం, రాష్ట్రం, రాజకీయం వేరు. అన్నీ కలిపి కలగాపులగం చేసేశారు’’ అని బాలయ్య కాస్త భావోద్వేగానికి గురయ్యారు.

‘అఖండ’ బాలకృష్ణ 100వ సినిమాగా చేయాల్సింది!

ఈ షోలో పాల్గొన్న దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘అఖండ’సినిమా బాలకృష్ణ 100వ సినిమా చేయాల్సిందని చెప్పారు. ‘‘సింహా’ చేశాం. బొబ్బిలి సంస్థానానికి చెందిన గ్రేట్‌ పర్సన్‌. ‘లెజెండ్‌’ చేశాం. ఒక ప్రాంతంలో సమస్య వస్తే నిలబడే పెద్ద మనిషి. మూడోది ఈ రెండింటికీ మించి ఉండాలి. అదే మూస పద్ధతిలో సోషల్‌ అవేర్‌నెస్‌తో వెళ్తే, నాకు ఛేంజ్‌ ఓవర్‌ ఉండదు. హ్యాట్రిక్‌ చూసి అందరూ ‘అమ్మా’ అనాలి. ఎవరూ ఊహించేది అయి ఉండకూడదు. బాలయ్య 100వ సినిమా కోసమే ఈ కథ చెప్పా. ‘అఘోర’ అంటే ఎవరైనా భయపడతారు. కానీ ‘మీరేదో స్పెషల్‌గా చేస్తారుగా’ అని నాపై నమ్మకం ఉంచారు. గెటప్‌ బయటకు రాకముందు చాలా వేరియేషన్స్‌ అనుకున్నాం.(మధ్యలో బాలకృష్ణ అందుకుని, నా వంతు ప్రయత్నం చేశా. తెల్లవారు జామున 3గంటలకు లేచి అఘోరలా ఎలా కనిపించాలా? అని వివిధ గెటప్‌లు వేసుకునేవాడిని. బోయపాటి అఘోరను స్టైల్‌గా చూపించారు. నేను పూర్తిగా వాస్తవానికి దగ్గరగా ఉండేలా ఎలా ఉంటుందో ప్రయత్నించా. ) ప్రకృతి, పరమాత్మ, పసిబిడ్డ ఈ మూడింటి జోలికి వస్తే, ఎక్కడో ఉండేవాడు కూడా తిరగబడతాడు. అదే ‘అఖండ’’ అని దర్శకుడు బోయపాటి చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్‌ విలన్‌ పాత్ర తనకు బాగా నచ్చడంతో ‘నేనూ విలన్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని ప్రకటించారు బాలకృష్ణ. అయితే ఆ సినిమాలో హీరో కూడా తానే అవ్వాలనే షరతు పెట్టడంతో అందరూ చిరు నవ్వులు చిందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని