Balakrishna: బాక్సాఫీస్‌ బంగారు కొండ 

తండ్రికి తగ్గ తనయుడుగా  4 దశాబ్దాలుగా నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం

Updated : 10 Jun 2021 10:26 IST

కంటి చూపుతో బాక్సాఫీసు చరిత్రలు తిరగరాయగలడు. నైజాం, సీడెడ్‌, ఆంధ్ర ఇలా ఏ సెంటరైనా ఆయన దిగనంతవరకే, వన్స్‌ హి స్టెప్‌ ఇన్‌ హిస్టరీ రిపీట్స్‌. ఈ చరిత్రను ఆయన సినిమా రికార్డులే చెబుతాయి. సాంఘికం, జానపదం, పౌరాణికం, చారిత్రకం ఇలా అన్ని రకాల చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌ నటరత్నంలా వెలిగిపోతున్నారు. ఓ క్రమంలో వరుసగా పరాజయాలు పలకరించినా, వెనక్కి తగ్గకుండా సింహంలా ముందుకు దూకారు.  బాక్సాఫీస్‌ పేలిపోయేలా మళ్లీ కలెక్షన్ల వర్షం కురిపించారు.  తండ్రికి తగ్గ తనయుడిగా 4 దశాబ్దాలుగా నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు నేడు(గురువారం). ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

బాక్సాఫీస్‌కు బాస్‌

‘సాహసమే జీవితం’తో హీరోగా అరంగేట్రం చేశాడు బాలకృష్ణ.  ‘మంగమ్మగారి మనవడు’ నుంచి బాలయ్య బాక్సాఫీసు దాడి మొదలైంది. ఆ తర్వాత రికార్డుల మీద రికార్డులు తిరగ రాస్తూ దూసుకెళ్తున్నారాయన. వరుస హిట్లతో టాలీవుడ్‌లో చక్రం తిప్పారు. ‘ముద్దుల మామయ్య’, ‘ఆదిత్య 369’, ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’, ‘సింహా’, ‘లెజెండ్‌’ ఇలా ఇండస్ట్రీ హిట్లతో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాడీ నటసింహం. యువ హీరోల సినిమాలే వంద రోజులు ఆడలేని సమయంలో ‘లెజెండ్‌’ సినిమా ఓ థియేటర్లో 400కు పైగా రోజులాడి రికార్డు సృష్టించింది. అలాగే ఒకే ఏడాది(1986) ఆరు బాక్సాఫీస్‌ హిట్లు కొట్టిన రికార్డు కూడా ఆయన పేరు మీదే ఉంది. అంతే కాదు ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’‌ చిత్రం తెలుగులో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అదే చిత్రాన్ని హిందీ, తమిళంలో డబ్‌ చేస్తే అక్కడా వందరోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో రికార్డులు.

పౌరాణికం అంటే బాలయ్యే

జగదానంద కారకుడు..రాముడిగా ‘శ్రీరామరాజ్యం’లో పలికించిన రాజసానికి తెలుగు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. పౌరాణిక పాత్రల్లో నటించాలంటే సీనియర్‌ ఎన్టీఆర్‌ తర్వాత బాలకృష్ణనే అనేంతలా ప్రశంసలు కురిశాయి. శ్లోకాలను, పద్యాలను అవలీలగా వల్లించే అరుదైన తెలుగు నటుల్లో  బాలకృష్ణ ముందుంటాడు. ‘తాతమ్మ కల’  తర్వాత ‘దానవీర శూర కర్ణ’ , ‘శ్రీ మద్విరాట పర్వం’, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’ చిత్రాల్లో  నటించి మెప్పించాడు.  ఇవన్ని ఆయన హీరోగా అడుగుపెట్టకుముందు ఎన్టీఆర్‌తో చేసిన సినిమాలు. హీరో అయ్యాక ‘శ్రీ కృష్ణార్జున యుద్ధం’, ‘శ్రీ రామరాజ్యం’, ‘పాండురంగడు’ లాంటి సినిమాల్లో నటించి పౌరాణిక చిత్రాలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఇవే కాకుండా ఫాంటసీ, చారిత్రాత్మక చిత్రాల ద్వారా తెలుగు వారికి మరింత దగ్గరాయ్యాడు. తన కలల ప్రాజెక్ట్‌ ‘నర్తనశాల’ను భారీ ఎత్తున తీయాలని సంకల్పించారు. కానీ నటి సౌందర్య దుర్మరణంతో అది కలగానే మిగిలిపోయింది. చిత్రీకరణ జరుపుకున్న ఆ కొంత భాగాన్ని గతేడాది  అభిమానుల కోసం విడుదల చేశారు. 

ప్రయోగాల్లో ఒక్క మగాడు

ఏ నటుడికైనా 50వ చిత్రం మరుపురానిదిగా మిగిలిపోవాలనే ఉంటుంది. సినీ జీవితంలో అదో మైలురాయి.  అంతకముందు వచ్చిన చిత్రాల ద్వారా బాలకృష్ణకు విపరీతమైన మాస్‌ ఫాలోయింగ్‌ ఉంది. మాస్ మసాలా సినిమాల్ని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ఆయన రూటు మార్చుకుని  ‘నారీ నారీ నడుమ మూరారీ’ లాంటి క్లాస్‌ సినిమాను అందించారు. కళ్లు చెదిరే యాక్షన్‌ సన్నివేశాలు, భారీ  డైలాగ్స్ ఏమీ ఉండవు. ఆ సినిమాలో ఉన్నదంతా బాలకృష్ణ మాయజాలమే.  ఇద్దరు భామల మధ్య నలిగిపోయే అచ్చతెలుగు ఫ్యామిలీమ్యాన్‌లా అదరగొట్టాడు బాలకృష్ణ. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌. వందో చిత్రమూ అంతే చారిత్రక నేపథ్యంతో ‘గౌతమ పుత్ర శాతకర్ణ’తో శాతావహన చక్రవర్తిగా రాజసాన్ని పలికించి ముగ్ధుల్ని చేశాడు. ఇలాంటి ప్రయోగాలెన్నో ఆయన సినీ జీవితంలో చేశారు.   టైం మిషన్‌ కథాంశంతో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం ‘ఆదిత్య 369’ను అందించారు. అప్పట్లో అదో సంచలనం. సింగీతం శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభినవ ఆంధ్రభోజుడిగా నటించి అదరహో అనిపించారు. అలాగే  భైరవ ద్వీపంలో కురూపిగా నటించి కన్నీళ్లు పెట్టించారు. త్వరలో రాబోయే బోయపాటి చిత్రం ‘అఖండ’లోనూ మరో విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు బాలకృష్ణ. 

ఫ్యాక్షన్‌కి గ్లామరద్దిన హీరో

తెలుగు సినిమాల్లో ఫ్యాక్షన్‌ కథలకు గ్లామరద్దిన కథానాయకుడు బాలకృష్ణ. ఆయన నటించిన ‘సమరసింహారెడ్డి’ టాలీవుడ్‌లో సూపర్‌ డూపర్‌ హిట్‌. అప్పటికే నాలుగు చిత్రాల ఫ్లాప్‌లతో వెనకబడిన బి. గోపాల్‌కు అవకాశమిచ్చి  పెద్ద సాహసమే  చేశారు. అన్నాచెల్లెల్ల సెంటిమెంట్‌కు తోడు.. ఫ్యాక్షన్‌ డ్రామా పండటంతో కలెక్షన్ల వరద పారింది.  ఆ తర్వాత కూడా ‘నరసింహనాయుడు’, ‘ సీమసింహం’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘సింహా’ లాంటి సినిమాలతో ఫ్యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయారు. ‘సమరసింహా రెడ్డి’ స్ఫూర్తితో ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెలుగులో చాలానే సినిమాలొచ్చాయి. అయినా ఆ‌ సినిమాల్లో బాలయ్య బ్రాండ్‌ మాత్రం చెక్కుచెదరలేదు.

 తన జోరు ఏమాత్రం తగ్గలేదని ‘సింహా’(2010) సినిమాతో జూలు విదిల్చి మరీ చెప్పాడు బాలకృష్ణ. బోయపాటి సినిమా తెరకెక్కించిన ఈ సినిమా అభిమానులకు మళ్లీ పండగను తెచ్చింది.  లెజెండ్‌తోనూ బాక్సాఫీస్‌ను షేక్‌ చేశారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు