30 years of Rowdy Inspector: ఆ జీపు పంపిస్తేనే షూటింగ్‌కి వస్తానన్న బాలకృష్ణ!

నందమూరి బాలకృష్ణ - బి.గోపాల్‌ది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. వారిద్దరి కలయికలో వచ్చిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’(Rowdy Inspector) బంపర్‌ హిట్‌ సినిమా.

Published : 08 May 2022 02:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నందమూరి బాలకృష్ణ - బి.గోపాల్‌ది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. వారిద్దరి కలయికలో వచ్చిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’(Rowdy Inspector) బంపర్‌ హిట్‌ సినిమా. ఆ రోజుల్లోనే మాస్‌ను ఓ ఊపు ఊపేసిన ఆ సినిమా బద్దలు కొట్టిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. మే 7, 1992న విడుదలైన ఈ సినిమా శనివారంతో 30ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ షూటింగ్‌లో సమయంలో జరిగిన ఓ ఆసక్తికర విశేషం మీకోసం..

పోలీసు కథా నేపథ్య సినిమాల్లో ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ ఓ ట్రెండ్‌ సెట్టర్‌. బాలకృష్ణను పోలీసు దుస్తుల్లో చూసి అభిమానులు మురిసిపోతే...  ఖాకీ డ్రెస్సులో బాలయ్య పెర్‌ఫార్మెన్స్‌ చూసి ప్రేక్షకులు అదుర్స్‌ అన్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా హోం వర్క్‌ చేశారు. పోలీసులు ఎలా నడుస్తారు.. ఎలా లాఠీ పట్టుకుంటారు... జీపులో ఎలా కూర్చుంటారు లాంటి విషయాలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ బాలయ్య ఆ పాత్రలో లీనమైపోతారు. అలానే ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ చిత్రీకరణ సమయంలో పోలీసులానే ఫీలయ్యారు. అలా రోజూ సినిమాలో వాడిన జీపులో చిత్రీకరణకు వచ్చేవారట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు బి.గోపాల్‌ ఓ సందర్భంలో చెప్పారు.

‘‘ఓ రోజు ఉదయం బాలయ్య బాబు ఫోన్‌ చేసి ఈ రోజు నేను చిత్రీకరణకు రావడం లేదు’ అన్నారు. ‘ఏమైంది బాబూ’ అనడిగితే.. ‘సినిమాలో నేను వాడుతున్న జీపు పంపిస్తే అందులోనే షూటింగ్‌కి వస్తా.. అప్పుడే ఆ పాత్రలో లీనమవ్వగలను’ అని చెప్పారు. మేం అలానే జీపు పంపించాం. ఎప్పుడూ ఏసీ కారులో వచ్చే బాలయ్య బాబు ఆ రోజు పోలీసు జీపులో పోలీసులా కాలు బయట పెట్టి.. లాఠీ తిప్పుతూ వచ్చారు. సినిమా అంటే అంత ప్యాషన్‌ ఆయనకి. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ అలానే వచ్చారు’’ - బి.గోపాల్‌, ప్రముఖ దర్శకుడు

రౌడీ ఇన్‌స్పెక్టర్‌ గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు..

  1. ‘లారీ డ్రైవర్‌’ తర్వాత బాలయ్య, బి.గోపాల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమాకి ప్లాన్‌ చేశారు నిర్మాత టి.త్రివిక్రమరావు
  2. ముందుగా ‘బొబ్బిలి సింహం’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసి, ఆ టైటిల్‌కి కథని ప్లాన్‌ చేశారు. ఆ సమయంలో దర్శకుడు బి.గోపాల్‌ తమిళ్‌ చిత్రం చిన్నతంబి చూసి దానిని రీమేక్‌ చేద్దామనుకున్నారు. బాలయ్య కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కానీ అప్పటికే కె.ఎస్‌.రామారావు ఆ సినిమా హక్కులు కొని, వెంకటేశ్‌ కథానాయకుడిగా ‘చంటి’పేరిట తీస్తున్నారని తెలిసింది.
  3. ఆ తర్వాత రకరకాల కథలు అనుకున్నారు. కానీ ఏది ఫైనల్‌ కాలేదు. చివరికి రచయిత పుష్పానంద్‌ ఓ కథతో ముందుకు వచ్చారు అదే రౌడీ ఇన్‌స్పెక్టర్‌
  4. హీరోయిన్‌గా విజయశాంతిని, సంగీత దర్శకుడిగా బప్పీలహరిని తీసుకున్నారు. బాలయ్య పుట్టిన రోజున దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి క్లాప్‌తో ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ మొదలైంది.
  5. ముందుగా సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనీ అనుకున్నారు. కానీ ఫైనల్‌గా మేలో రిలీజ్‌ అయింది. దాదాపు రెండున్నర కోట్లతో తెరకెక్కిన ఈ మూవీకి ఫస్ట్‌ డే నుంచి మంచి టాక్‌ వచ్చింది.
  6. రెండు వారాల్లోనే రెండు కోట్లు వసూళ్లు చేయడం విశేషం. మొత్తం మీద రూ.9 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
  7. అప్పట్లో 60 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం. 22 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకొంది.
  8. ఈ సినిమా తర్వాత డైలాగ్స్‌ అంటే బాలయ్య.. బాలయ్య అంటేనే డైలాగ్స్‌ అన్నట్టుగా మారిపోయింది.
  9. ఈ చిత్రాన్ని హిందీలో ఇదే పేరుతో డబ్‌చేయగా, తమిళంలో విజయశాంతికి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ‘ఆటో రాణి’గా అనువదించారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడం విశేషం.
  10. ‘లారీ డ్రైవర్‌’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ ఈ  రెండు చిత్రాల్లోనూ విజయశాంతి హీరోయిన్‌ కావడం మరో విశేషం.
  11. ఈ సినిమాకు ముందుగా అనుకున్న ‘బొబ్బలి సింహం’ టైటిల్‌తోనే బాలయ్యతో మరో సినిమాను తెరకెక్కించారు నిర్మాత త్రివిక్రమరావు. మరో విశేషం ఏంటంటే ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’కు క్లాప్‌ కొట్టిన కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని