Balakrishna: నేను సంపాదించిన విలువైన ఆస్తి... అభిమానులే: బాలకృష్ణ

‘‘నేను సంపాదించిన విలువైన ఆస్తి అభిమానులు. వారు నాపై చూపించే ప్రేమే’’ అని అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన ద్విపాత్రాభినయంలో నటించిన..

Updated : 29 May 2022 15:23 IST

చిలకలూరిపేట: ‘‘నేను సంపాదించిన విలువైన ఆస్తి అభిమానులు. వారు నాపై చూపించే ప్రేమే’’ అని అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన ద్విపాత్రాభినయంలో నటించిన ‘అఖండ’ విడుదలై 175 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్‌లో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో బోయపాటి శ్రీను, బాలయ్య పాల్గొన్నారు. తమ చిత్రాన్ని నందమూరి తారకరామారావుకి అంకితం చేస్తున్నట్లు చెప్పారు.

‘‘నాకు జన్మనిచ్చిన తండ్రి, నా గురువు, దైవం, విశ్వానికే నట విశ్వరూపం ఏమిటో చూపించిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ.. ఇక్కడ చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్‌లో ‘అఖండ’ సినిమా సిల్వర్‌ జూబ్లీ వేడుకలు జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఎన్టీఆర్‌ నట వారసుడిగా ఆయన ఆశయాలు, కలలను నిలబెట్టగలిగానన్న ఆత్మ తృప్తి, గర్వం గుండెల నిండా నిండి ఉంది. ఈ ‘అఖండ’ సినిమాని ఆ కారణజన్ముడికి అంకితం చేస్తున్నా. రామారావు చేయని సినిమాలు లేవు. ప్రపంచంలో ఏ నటుడు చేయనన్ని పాత్రలు ఆయన పోషించారు. ఆ పుణ్య దంపతుల బిడ్డగా పుట్టడం, కళామతల్లి ఆశీస్సులు ఉండటం వల్ల ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించే అవకాశం నాకూ లభించింది. బోయపాటి శ్రీనుపై నాకెంతో నమ్మకం. ఒక సినిమా చేసేటప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తాం. పార్టీలు, కులాలు, వర్గాలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి ఆనందించారు. మీరు చూపించిన అభిమానమే నాకు శ్రీరామ రక్ష. ఇన్నాళ్లు నేను సంపాదించుకున్న ఆస్తి మీ అభిమానమే’’ అని బాలయ్య అన్నారు.

అనంతరం బోయపాటి మాట్లాడుతూ.. ‘‘సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. బాలయ్య, నేను కలిసి తెరకెక్కించిన ‘సింహా’, ‘లెజెండ్‌’ ఇటీవల విడుదలైన ‘అఖండ’.. థియేటర్లలో 175 రోజులు ఆడాయి. ఒకే కాంబినేషన్‌లో ఇలా మూడు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయంటే దానికి ప్రధాన కారణం బాలయ్య నాపై పెట్టుకున్న నమ్మకం. మీరు మాపై చూపిస్తున్న అభిమానం. మీ అభిమానానికి కృతజ్ఞత చెప్పాలనే ఉద్దేశంతోనే ఎన్నో పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం. కేవలం పది నిమిషాలు మాత్రమే నేను చెప్పిన కథ విని.. నాపై నమ్మకం ఉంచి మూడు సినిమాలు చేసిన బాలయ్యకు కృతజ్ఞతలు. ఆయన నమ్మకాన్ని నిజం చేసినందుకు ఆనందంగా ఉంది. ఈ మూడు చిత్రాల విజయాన్ని ఎన్టీఆర్‌కు అంకితం చేస్తున్నా. ఇకపై నేను చేయబోయే చిత్రాలను మీరు ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని