Veera Simha Reddy: నేను నమ్మేది ఆ ముగ్గురినే: బాలకృష్ణ

బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతోన్న సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది.

Published : 12 Jan 2023 21:48 IST

హైదరాబాద్‌: సినిమాల విషయంలో తాను ముగ్గురి (దర్శకుడు, సంగీత దర్శకుడు, ఎడిటర్‌)ని నమ్ముతానని అన్నారు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఈయన హీరోగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). సంక్రాంతి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపేందుకు చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది.

బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాను ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు. ‘ఓ మంచి సినిమా చేశారు. ఇటువంటివి మాకు ఇంకా ఇవ్వండి’ అని మీరు మా భుజం తట్టినట్టుగా భావిస్తున్నాం. ఓ హిట్‌ సినిమా తర్వాత మరొకటి వస్తుందంటే అంచనాలు పెరుగుతాయి. ‘అఖండ’ తర్వాత తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ విషయంలో అదే జరిగింది. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో చిత్రం చేయాలని నేనూ దర్శకుడు గోపీచంద్‌ మలినేని చర్చించుకున్నాం. అనుకున్న విధంగా దర్శకుడు కథ, సాయిమాధవ్‌ బుర్రా అద్భుతమైన సంభాషణలు రాశారు. ప్రతి విభాగంవారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. నేపథ్య సంగీతంతో సన్నివేశాలను తమన్‌ మరో స్థాయికి తీసుకెళ్లారు. పాటలకు మంచి స్వరాలు సమకూర్చారు. హీరో- విలన్‌ పాత్రల తీరుకు తగ్గట్టు ఫైట్‌ మాస్టర్లు రామ్‌- లక్ష్మణ్‌ కంపోజ్‌ చేశారు’’

‘‘సినిమా విషయంలో నేను.. దర్శకుడు, సంగీత దర్శకుడు, ఎడిటర్‌ను నమ్ముతా. ఏ సన్నివేశాన్నైనా రక్తి కట్టించగల సమర్థత ఈ మూడు విభాగాల్లోనే  ఉంటుంది. థియేటర్లలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పోషించిన పాత్రను చూసిన ప్రేక్షకులు సర్‌ప్రైజ్‌ ఫీలవ్వాలనే ఉద్దేశంతోనే ప్రచార చిత్రాల్లో ఆ క్యారెక్టర్‌ను ఎక్కువగా రివీల్‌ చేయొద్దని చెప్పా. కథానాయిక శ్రుతిహాసన్‌ చక్కగా నటించింది. నటులు, టెక్నిషియన్ల నుంచి అనుకున్న ఔట్‌పుట్‌ రాబట్టగలిగే సత్తా ఉన్న దర్శకుడు గోపీచంద్‌. ఈ చిత్రానికి పనిచేసిన కారు డ్రైవర్‌, ప్రొడక్షన్‌ బాయ్‌ నుంచి మేనేజరు వరకు అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా’’ అని బాలకృష్ణ అన్నారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌, దర్శకుడు గోపీచంద్‌, సంగీత దర్శకుడు తమన్‌, ఫైట్‌ మాస్టర్లు రామ్‌-లక్ష్మణ్‌, నిర్మాతలు రవి యలమంచిలి, నవీన్‌ యెర్నేని తదితరులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని