Balakrishna: కారణమేంటో చెబితే ఇప్పుడు ఆయనపై కేసు బుక్ చేస్తారు: బాలకృష్ణ

‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. దర్శకుడు గోపీచంద్‌ను ఉద్దేశిస్తూ కేసుల ప్రస్తావన తెచ్చారు.

Updated : 23 Jan 2023 11:27 IST

హైదరాబాద్‌: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ఒకటి. బాలకృష్ణ (Balakrishna) హీరోగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన సినిమా ఇది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కడంతో చిత్ర బృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ‘వీరసింహారెడ్డి’ టీమ్‌తోపాటు దర్శకులు హరీశ్‌ శంకర్‌, శివ నిర్వాణ, అనిల్‌ రావిపూడి, యువ హీరోలు విశ్వక్‌ సేన్‌, సిద్ధు జొన్నలగడ్డ తదితరులు అతిథులుగా హాజరై సందడి చేశారు.

వేడుకనుద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నాకు జన్మనిచ్చి, మీ అందరి హృదయాల్లో ఉండేలా చేసిన నా తండ్రి, గురువు, దైవం నందమూరి తారక రామారావుగారికి ధన్యవాదాలు. ఆయన శత జయంతి వందనాలు. నేను ఫ్యాక్షన్‌ చిత్రాల్లో నటించి చాలాకాలమైంది. అందుకే నేనూ దర్శకుడు గోపీచంద్‌ చర్చించుకుని ఆ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేశాం. ఓ డైలాగ్‌ నుంచి కథ పుడుతుంది. మ్యానరిజం నుంచి కథ వస్తుంది. అలాంటి వాటికి ఆద్యుడు దర్శకుడు బోయపాటి శ్రీను. మేమిద్దరం స్టోరీల గురించి ఎక్కువగా చర్చించుకోం. సరదాగా మాట్లాడుకుంటాం. సినిమా చేసేస్తాం. గోపీచంద్‌ మలినేని నా అభిమాని. నా సినిమా ‘సమరసింహారెడ్డి’ చూసేందుకు వెళ్లి ఆయన దెబ్బలు తిన్నారు. కారణమేంటో చెబితే ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేస్తారు. కేసులు బుక్‌ చేయడం ఇప్పుడు చాలా తేలిక కదా. ఎలా నడుచుకోవాలో రామాయణం చెబుతుంది. మహాభారతం మనం ఎలా నడుచుకుంటున్నామో చెబుతుంది. అలాంటి థీమ్‌తోనే ఈ సినిమాను చేశాం. మంచి ప్రయాణమది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని బాలకృష్ణ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని