Balakrishna: అభిమానుల‌కు బాల‌య్య‌ విజ్ఞ‌ప్తి

క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుండటంతో త‌న పుట్టిన రోజున‌ అభిమానుల్ని రావొద్ద‌ని కోరారు ప్ర‌ముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌.  జూన్ 10న బాల‌కృష్ణ పుట్టిన రోజు.

Published : 07 Jun 2021 16:55 IST

హైద‌రాబాద్‌: క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుండటంతో త‌న పుట్టిన రోజున‌ అభిమానుల్ని రావొద్ద‌ని కోరారు ప్ర‌ముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. జూన్ 10.. బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈ వేడుక‌ని జ‌రిపేందుకు ప్ర‌తి ఏడాది అభిమానులు బాల‌కృష్ణ ఇంటికి త‌ర‌లి వచ్చేవారు. కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర‌త దృష్ట్యా ఈసారి అలాంటి కార్య‌క్ర‌మాలు వ‌ద్ద‌ని, అంద‌రూ త‌మ త‌మ కుటుంబ స‌భ్యుల‌తోనే గ‌డ‌పాల‌న్నారాయ‌న‌.

‘‘నా ప్రాణ సమానులైన అభిమానులకు విజ్ఞ‌ప్తి. జూన్ 10న నా పుట్టినరోజు సంద‌ర్భంగా ప్ర‌తి సంవ‌త్సరం నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుంచి తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ, కరోనా విలయతాండవం చేస్తోన్న‌ ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానమే. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు.. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. దయచేసి ఎవ‌రూ రావ‌ద్ద‌ని తెలియ‌జేస్తున్నాను. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానుల‌కు, కార్యకర్తలకు, అభాగ్యులందరికీ నివాళులర్పిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. సినిమా విష‌యానికొస్తే..  ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ‘అఖండ’  చిత్రంలో న‌టిస్తున్నారు. మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని