MAA Election: వాళ్ల పనుల్ని వేలెత్తి చూపించం

27 ఏళ్ల తర్వాత ‘మా’కు సొంత భవనం ఏర్పాటు కానుందని ప్రముఖ నటుడు బండ్ల గణేష్‌ అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ అధ్యక్షత వహిస్తున్న ‘సినిమా బిడ్డల ప్యానల్‌’లో....

Updated : 25 Jun 2021 15:13 IST

27 ఏళ్ల తర్వాత ‘మా’కు సొంత భవనం

హైదరాబాద్‌: 27 ఏళ్ల తర్వాత ‘మా’కు సొంత భవనం ఏర్పాటు కానుందని ప్రముఖ నటుడు బండ్ల గణేష్‌ అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ నేతృత్వంలోని సిని‘మా’ బిడ్డల ప్యానల్‌ లో బండ్ల గణేష్‌ ఓ సభ్యుడిగా ఉన్నారు. మరికొన్ని నెలల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఉదయం ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. లోకల్‌, నాన్‌లోకల్‌ అంటూ వస్తున్న కామెంట్లపై స్పందించారు. అనంతరం బండ్ల గణేష్‌ మాట్లాడుతూ..

‘‘ప్రకాశ్‌రాజ్‌ నాకు 23 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయనంటే నాకెంతో ఇష్టం. ఆయనొక అద్భుతమైన వ్యక్తి. ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లకే ఆ విషయం తెలుస్తుంది. కొన్నేళ్ల క్రితం షాద్‌నగర్‌లో వ్యవసాయం చేయడానికి భూమి కావాలంటూ ఆయన నన్ను సంప్రదించారు. నేనే ఆయనకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చాను. తన సేవాభావంతో ఇప్పుడు ఆయన మా షాద్‌నగర్‌కే గుర్తింపు తెచ్చిపెట్టారు. షాద్‌నగర్‌కు సమీపంలో ఉన్న కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా సమయంలో ఎంతోమంది వలస కార్మికులకు తన ఫామ్‌హౌస్‌లో మూడు నెలలు ఆశ్రయం కల్పించి.. అన్నిరకాల వసతులు ఏర్పాటు చేసి.. బస్సుల ద్వారా వాళ్లని స్వగ్రామాలకు పంపించారు. ఆయనలో ఉన్న గొప్ప వ్యక్తిత్వానికి అది కూడా ఒక నిదర్శనం. ప్రకాశ్‌రాజ్‌ లోకల్‌, నాన్‌లోకల్‌ కాదు. ఇది ‘మా’. మాకు కులాలు లేవు. వర్గాలు లేవు. మేమంతా మా మనుషులం. మాదంతా ఒకటే కుటుంబం. 27 సంవత్సరాల క్రితం చిరంజీవి అధ్యక్షుడిగా ‘మా’ను స్థాపించారు. అప్పటి నుంచి ప్రతి అధ్యక్షుడు కష్టపడి పనిచేశారు. గతంలో అధ్యక్షులు చేసిన పనుల్ని మేము వేలెత్తి చూపించం. ప్రకాశ్‌రాజ్‌ చేయాలనుకున్న ప్రతి పనిని 100శాతం పూర్తి చేస్తారని భావిస్తున్నాను. అందుకే ఆయన టీమ్‌లో చేరాను. షాద్‌నగర్‌లో ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. 27 సంవత్సరాల తర్వాత ‘మా’కంటూ ఓ సొంతం భవనం రాబోతుంది’’ అని బండ్లగణేష్‌ వివరించారు.

సినిమా షూటింగ్స్‌, ఇతర కారణాలతో తన ప్యానల్‌లోని పలువురు సభ్యులు నేడు మీడియా సమావేశానికి హాజరు కాలేకపోయారని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. ఈ క్రమంలో నటుడు సాయికుమార్‌, నటి జయసుధ తమ సపోర్ట్‌ని తెలియజేస్తూ వీడియోలు పంచుకున్నారు.

‘‘సినిమా బిడ్డలం.. మన కోసం మనం.. మాకోసం మనం.. అనే నినాదంతో ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తోన్న ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో నేను కూడా ఉండడం ఆనందంగా ఉంది. మేమంతా ఆయన్ని సపోర్ట్‌ చేస్తున్నాం. అలాగే మాకు కూడా మీ సపోర్ట్‌ కావాలి. మీ ఆదరాభిమానాలు, ఆశీర్వాదం ‘మా’కు, మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నా’’  అని సాయికుమార్‌ వివరించారు.

‘రాబోయే ‘మా’ ఎలక్షన్స్‌లో ప్రకాశ్‌రాజ్‌ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారు. ఆయన టీమ్‌లో మేమంతా ఉన్నాం. నేను కూడా ఆయనకు సపోర్ట్‌ చేస్తున్నా. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. మా జంటకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ‘మా’ ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్నట్లు 2018లో ప్రకాశ్‌రాజ్‌ నాతో చెప్పారు. ఆయన ఆలోచనలను నాతో పంచుకున్నారు. ఆయన విజన్‌ ఇప్పుడు ‘మా’కెంతో అవసరం. పరిశ్రమలోని పెద్దలందరి దీవెనలతో మా టీమ్‌ విజయం సాధిస్తుందని భావిస్తున్నా’ అని జయసుధ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని