Bandla Ganesh: అలా చేసిన ఏకైక హీరో రవితేజ.. బండ్ల గణేశ్‌ స్పీచ్‌

‘ధమాకా’ సినిమా ప్రెస్‌మీట్‌లో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ మాట్లాడారు. హీరో రవితేజను కొనియాడారు.

Published : 30 Dec 2022 01:04 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమకు 12 మంది దర్శకులను పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ అని నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) అన్నారు. ‘ధమాకా’ (Dhamaka)  విజయోత్సవ వేడుకలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. రవితేజ (Ravi Teja), శ్రీలీల జంటగా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీట్‌కు చిత్ర బృందంతోపాటు దర్శకుడు హరీశ్‌ శంకర్‌, బండ్ల గణేశ్‌ పాల్గొన్నారు.

రవితేజనుద్దేశించి గణేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ వేడుకకు నేను వస్తానని చిత్ర బృందానికి ఫోన్‌ చేసి చెప్పా. అస్తమించిన రవిని చూశాం. ఎప్పటికీ అస్తమించని రవితేజ గురించి మాట్లాడేందుకు వచ్చా. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు. రవితేజ అంటే నిజాయతీ, బాధ్యత, నిబద్ధత. రవితేజ ఫ్యాన్‌ అని చెప్పేందుకు గర్వపడాలి. తాను నటించిన 70 చిత్రాల్లో.. 12 మంది దర్శకులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ. కష్టం తెలిసినవాడు రవితేజ. చాలామంది సంవత్సరం, రెండు సంవత్సరాలు లేదా మూడేళ్లు ప్రయత్నిస్తారు. అదృష్టం కలిసొచ్చి సూపర్‌స్టార్లు, మెగాస్టార్లు అవుతారు. పదేళ్లయినా ఇక్కడే ఉండి రవితేజ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఎప్పటికప్పుడు.. ‘రవితేజ పని అయిపోంది’ అని చాలామంది అనుకుంటుంటారు. కానీ, ఆయన ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడికీ ఆయన మళ్లీ అవకాశం ఇస్తాడు. దటీజ్‌ రవితేజ. ఎప్పుడేం చేయాలో, ఎవరిని ఎప్పుడు పైకి తేవాలో తెలిసిన వ్యక్తి రవితేజ. ‘ధమాకా’లోని ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన అద్భుతంగా కనిపించాడు’’ అని గణేశ్‌ అనర్గళంగా ప్రసంగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు