NTR30: నా టైటిల్‌ కొట్టేశారు.. ‘దేవర’పై బండ్ల గణేష్‌ ట్వీట్‌

ఎన్టీఆర్‌ 30వ సినిమాకు ‘దేవర’ (devara) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారనే టాక్‌ జోరుగా వినిపిస్తోంది. తన టైటిల్‌ కొట్టేశారంటూ దీనిపై బండ్ల గణేష్‌ (Bandla ganesh) చేసిన ట్వీట్‌ హైలెట్‌ అవుతోంది.

Updated : 19 May 2023 18:22 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ (NTR) - కొరటాల శివ (Koratala siva) కాంబోలో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. #NTR30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం ప్రచారంలో ఉంది. మే 20న ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చిన దగ్గర నుంచి టైటిల్‌కు సంబంధించి ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాకు ‘దేవర’ (devara) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారనే టాక్‌ జోరుగా వినిపిస్తోంది. మూవీ యూనిట్‌ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ పేరు మాత్రం తెగ ప్రచారమవుతోంది. టైటిల్‌ ఆసక్తికరంగా ఉండడంతో తారక్‌ అభిమానులు ఈ పేరుతో ఇమేజ్‌లు తయారు చేసి షేర్‌ చేసేస్తున్నారు. ఇక మరోవైపు దీనిపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ (Bandla ganesh) తాజాగా చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ‘‘దేవర.. నేను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న నా టైటిల్‌. నేను మర్చిపోవడం వల్ల.. నా టైటిల్‌ను కొట్టేశారు’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ‘నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్‌. ఇది మన యంగ్‌ టైగర్‌ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే’ అని మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు పంచ్‌ డైలాగులతో స్పందిస్తున్నారు. అసలు టైటిల్‌ ఏదో తెలియాలంటే మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

శరవేగంగా షూటింగ్‌ జరుగుతోన్న ఈ మూవీపై తారక్‌ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తాజాగా ‘రక్తంతో రాసిన అతని కథలతో సముద్రం నిండి ఉంది’ అంటూ విడుదలైన పోస్టర్‌తో వారి అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సముద్ర నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్ హీరో సైఫ్‌ అలిఖాన్‌ కనిపించనున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు