Bappi Lahiri: ఆ ఘనత బప్పి లహిరిదే.. బయోపిక్‌లో రణ్‌వీర్‌ని చూడాలనుకున్నారు!

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో బప్పి లహిరి తనదైన ముద్ర వేశారు. ఫాస్ట్‌బీట్‌లతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. మెలొడీస్‌తో మనసుల్ని హత్తుకున్నారు. ముఖ్యంగా డిస్కో పాటలతో విశేష ఖ్యాతి గడించారు.

Updated : 07 Dec 2022 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో బప్పి లహిరి తనదైన ముద్ర వేశారు. ఫాస్ట్‌బీట్‌లతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. మెలొడీస్‌తో మనసుల్ని హత్తుకున్నారు. ముఖ్యంగా డిస్కో పాటలతో విశేష ఖ్యాతి గడించారు. ‘డిస్కో కింగ్‌’ ఇకలేరన్న వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. బప్పి లహిరి పాటలను గుర్తుచేసుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. గతంలో బప్పి లహిరి పెట్టిన కొన్ని పోస్ట్‌లు, పంచుకున్న విశేషాలు, సాధించిన అరుదైన ఘనతను ఓసారి చూద్దాం..

 ఆ ఘనత సాధించిన తొలి భారతీయ సంగీత దర్శకుడిగా..

బప్పి లహిరి సంగీతం భారతీయుల్ని మాత్రమే కాదు విదేశీయుల్ని విశేషంగా అలరించింది. ఆయన గాన మాధుర్యాన్ని ఆస్వాందించేందుకు లండన్‌ ఉవ్విళ్లూరింది. ఈ మేరకు 1989లో లైవ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చేందుకు లండన్‌కు చెందిన ‘ఐటీవీ’ బప్పి లహిరిని ఆహ్వానించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సంగీత దర్శకుడు బప్పినే. 33 చిత్రాలకుగానూ 180కిపైగా పాటలను అందించినందుకు 1986లో ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు’ పొందారు. సంగీత ప్రపంచంలోని పోటీ గురించి బప్పి లహిరికి ప్రశ్న ఎదురవగా తనదైన శైలిలో స్పందించారు. ‘‘పోటీ అంటూ ఏం లేదు. కానీ, కొంతమంది గాయకుల ఆహార్యం నాలానే ఉంటుంది. బియోన్స్‌, షకీరా, ఎమినెమ్‌, అకాన్‌.. వీరంతా నా స్టైల్‌లోనే కనిపిస్తారు’’ అని తెలిపారు. బప్పి లహిరికి బంగారం అంటే ఎంతిష్టమో తెలిసిన విషయమే. పలు రకాల గొలుసులు, వాచ్‌లు, బ్రేస్‌లెట్‌లతో ఆయన కనిపించేవారు. ‘గోల్డ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా గుర్తింపు పొందారు.

బయోపిక్‌ రావాల్సింది..

తన జీవిత కథను తెరపైకి తీసుకొచ్చేందుకు చాలామంది సంప్రదించారని, దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బప్పి లహిరి 2019లో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ ఏడాదే తన బయోపిక్‌ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అన్నారు. తన యంగర్‌ వెర్షన్‌ (యుక్త వయసు)కు సంబంధించిన పాత్రను బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ పోషిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎందుకోగానీ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. వ్యక్తిగతంగా రణ్‌వీర్‌ సింగ్‌.. బప్పి లహిరికి పెద్ద అభిమాని.

అమ్మా అంటూ..

ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గానకోకిల లత మంగేష్కర్‌తో బప్పి లహిరికి ప్రత్యేక అనుబంధం ఉంది. వారిద్దరూ తల్లీకొడుకుల్లా మెలిగేవారు. ఇద్దరూ కలిసి ఎన్నో సూపర్‌ హిట్‌ గీతాలను ఆలపించారు. లతా మరణించిన రోజు (ఫిబ్రవరి 6) బప్పీ తీవ్ర వేదనకు గురయ్యారు. చిన్నప్పుడు తనను ఎత్తుకున్న లతా మంగేష్కర్‌ ఫొటోని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ కన్నీటి నివాళులర్పించారు. ‘అమ్మా!’ అంటూ గత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. సంగీత ప్రపంచానికి చెందిన లతా మరణించిన కొన్ని రోజుల్లోనే ఆమెను ఎంతో ఆరాధించే బప్పి లహరి చనిపోవటం అందరినీ విషాదంలోకి నెట్టింది.

ఖాళీగా ఉండాలనుకొనేవారు కాదు..
బప్పి లహిరికి ఖాళీగా ఉండడమంటే అస్సలు ఇష్టం ఉండదు. అనారోగ్యం దరిచేరినా తానెంతగానో ప్రేమించే సంగీతాన్ని దూరం పెట్టలేదు. తన మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఎన్నో చిత్రాలను సూపర్‌హిట్‌గా నిలిపిన ఆయన వెబ్‌ షోస్‌కు సంగీతం అందించేందుకు సిద్ధమయ్యారు. ‘‘బప్పి లహిరికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నుంచి చాలా అవకాశాలు వచ్చాయి. అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆయన సంగీతం అందించేందుకు ఆసక్తి చూపారు. అలనాటి తన సూపర్‌హిట్‌ గీతాలకు కాస్త మెరుగులు దిద్ది ఈతరం వారికి వినిపించాలని ఆయన ఆకాంక్షించారు’’ అని బాలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. బప్పీ లహిరి సోషల్ మీడియాలో చాలా చురుక్కుగా ఉండేవారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన ఎన్నో విశేషాల్ని అభిమానులతో పంచుకునేవారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని