Beast: ఆ దేశంలో విజయ్‌ అభిమానులకు షాక్‌.. ‘బీస్ట్‌’పై నిషేధం

విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘బీస్ట్’ చిత్రంపై కువైట్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. కారణం ఏంటంటే?

Published : 06 Apr 2022 02:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బీస్ట్’. పూజాహెగ్డే కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులోని ‘అరబిక్‌ కుతు’ పాట ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌, అందులో విజయ్‌ యాక్షన్‌ సినిమాపై అంచనాలను పెంచింది.  ఈ క్రమంలో కువైట్‌లోని విజయ్‌ అభిమానులకు ఒక చేదు వార్త. ఆ దేశంలో ‘బీస్ట్‌’ చిత్రాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సినిమాను ఇస్లామిక్‌ ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కించడమే ఇందుకు కారణమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల దుల్కర్‌ సల్మాన్‌ ‘కురుప్‌’, విష్ణు విశాల్‌ ‘ఎఫ్‌.ఐ.ఆర్‌.’ చిత్రాలు ఇదే జోనర్‌లో తెరకెక్కడంతో కువైట్‌లో ఆ చిత్రాలను కూడా నిషేధించారు. ఇప్పుడు ‘బీస్ట్‌’ ఆ జాబితాలో నిలిచింది.

ఇంతకీ ‘బీస్ట్‌ కథేంటంటే... తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కొందరు ఉగ్రవాదులు చెన్నైలోని ఒక షాపింగ్‌ మాల్‌ను ముట్టడిస్తారు. అక్కడికి వచ్చిన వారిని బందీలుగా చేసుకుంటారు. విషయం తెలిసిన ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు ఉగ్రవాదులతో చర్చలకు దిగుతుంది. ఈ చర్చలకు ప్రభుత్వం తరపున నేతృత్వం వహిస్తున్న అధికారికి ఒక ఆసక్తికర విషయం తెలుస్తుంది. భారత మాజీ ‘రా’ ఏజెంట్‌ వీర రాఘవన్‌ అదే షాపింగ్‌ మాల్‌లో ఉన్నాడన్న సమాచారం అందుతుంది. ప్రజలను బందీలుగా చేసుకున్న ఉగ్రవాదుల నుంచి వీర రాఘవన్‌ ప్రజలను ఎలా కాపాడాడు? ఉగ్రవాదులను ఎలా మట్టుబెట్టాడు? అసలు ఇంతకీ ‘రా’ ఏజెంట్‌గా వీర రాఘవన్‌ చేసిన ఆపరేషన్స్‌ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్‌ నిర్మించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు