Beast: ఒకే లొకేషన్‌, ఒకే కాస్ట్యూమ్.. ‘బీస్ట్‌’ ఓ సవాలు: నెల్సన్‌

‘డాక్టర్‌’తో కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందిన దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌.  ఇప్పుడాయన ‘బీస్ట్‌’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. విజయ్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది.

Updated : 10 Apr 2022 12:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘డాక్టర్‌’తో కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందిన దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌. ఇప్పుడాయన ‘బీస్ట్‌’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. విజయ్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. అనిరుధ్‌ స్వరాలందించిన ఈ సినిమా ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు.. నెల్సన్‌, పూజాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలివీ..

దిల్‌ రాజు: ‘బీస్ట్‌’ ఎలా ఉంటుంది? విజయ్‌ని ఎలా ఒప్పించారు?

నెల్సన్‌: విజయ్‌ని దృష్టిలో పెట్టుకొనే ఈ కథ రాశా. చెప్పిన వెంటనే ఆయనకు బాగా నచ్చింది. అందుకే ఆయన్ను ఒప్పించేందుకు పెద్ద కష్టపడలేదు. ఈ సినిమాలో 70 శాతం యాక్షన్‌, 30 శాతం కామెడీ ఉంటుంది. మునుపటి నా సినిమాలతో పోలిస్తే ‘బీస్ట్‌’ ప్రత్యేకమైంది. కథ దృష్ట్యా ఇందులో రెండు పాటలకే స్కోప్‌ ఉంది. ఆ రెండింటికీ శ్రోతల నుంచి విశేష స్పందన లభించింది. ఒక్క లొకేషన్‌లోనే ఈ చిత్రాన్ని తీశా. పాటలు మినహా నటీనటులంతా ఒకే కాస్ట్యూమ్‌లో కనిపిస్తారు. ట్రైలర్‌కు వచ్చిన ఆదరణ చూశాక చెప్పలేనంత ఆనందం కలిగింది.

దిల్‌ రాజు: విజయ్‌ సినిమాలకు భారీ అంచనాలు ఉంటాయి. అలాంటిది మీరు ఒకే లోకేషన్‌, ఒకే కాస్టూమ్‌ అంటున్నారు. మీ నమ్మకమేంటి?

నెల్సన్‌: నేను విజయ్‌తో విభిన్నంగా సినిమా తీయాలనుకున్నా. తను ఇప్పటి వరకూ కనిపించని లుక్‌లో ఉండాలనుకున్నా. కథ డిమాండ్‌ చేయడం వల్లే లొకేషన్‌, కాస్ట్యూమ్ విషయంలో ఆ నిర్ణయం తీసుకొన్నా. దీన్ని ఓ సవాలుగా స్వీకరించా.

దిల్‌ రాజు: విజయ్‌తో నటించడం ఎలా అనిపించింది?

పూజాహెగ్డే: నటిగా నా కెరీర్‌ తమిళ సినిమాతోనే ప్రారంభమైంది. ఇప్పుడు ‘బీస్ట్‌’తో కోలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టుంది. సుమారు పదేళ్ల తర్వాత స్ట్రైయిట్‌ ఫిల్మ్‌తో తమిళ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నా. సినిమా విడుదలైన రోజు తొలి ఆటను ప్రేక్షకులతో కలిసి చూడాలని నిర్ణయించుకున్నా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం విజయ్‌ది. తన మొదటి సినిమాకి ఎంత కష్టపడ్డారో ఇప్పటికీ అలానే కష్టపడుతున్నారు. ఈ విషయంలో ఆయన నాకు స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి ఆయనతో తెరను పంచుకోవడం మాటల్లో చెప్పలేనంత ఆనందానిచ్చింది. అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్‌ ఏంటంటే.. సినిమా అంతా ఒకే లొకషన్‌లో జరగరడంతో 20 రోజుల షెడ్యూల్‌ ఒకే రోజులో పూర్తయినట్టు అనిపించింది. 

పూజాహెగ్డే : నా గురించి విజయ్ మీకేం చెప్పారు?

దిల్‌ రాజు: తన తర్వాత సినిమాలో కూడా నిన్నే హీరోయిన్‌గా తీసుకుందామని అనుకున్నారట (నవ్వుతూ..). సెట్స్‌లో నువ్వెలా ఉంటావో తెలిపారు. నీ చలాకీతనం, సమయపాలన గురించి వివరించారు.

దిల్‌ రాజు : సంచలనం సృష్టించిన ‘అరబిక్‌ కుతు’ పాట గురించి వివరిస్తారా?

నెల్సన్‌: నేను అనిరుధ్‌ని ఒక మంచి హిట్‌ సాంగ్‌ కావాలని, అది అన్ని భాషల వారికీ నచ్చాలని చెప్పా. ఈ క్రమంలో వచ్చిందే ‘అరబిక్‌ కుతు’ ట్యూన్‌. ఇది సూపర్‌హిట్‌ అవుతుందని ముందే ఊహించాం.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని