మీరు చాలా బాగున్నారు సినిమాల్లోకి రావచ్చుగా.. అమితాబ్‌ మనవరాలు ఏమన్నదంటే?

అందగత్తెలు కేవలం సినిమాల్లోనే కాదు వ్యాపార రంగంలోనూ రాణించగలరని అంటోంది బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్‌ ముద్దుల మనవరాలు నవ్య నవేలి. ఆకట్టుకునే అందంతో పాటు కుటుంబంలో సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న నవ్యకు సినిమాల్లోకి రావడం పెద్ద విషయం కాదు.

Published : 30 Jul 2021 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అందగత్తెలు కేవలం సినిమాల్లోనే కాదు వ్యాపార రంగంలోనూ రాణించగలరని అంటోంది బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్‌ ముద్దుల మనవరాలు నవ్య నవేలి. ఆకట్టుకునే అందంతో పాటు కుటుంబంలో సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న నవ్యకు సినిమాల్లోకి రావడం పెద్ద విషయం కాదు. ఇదే ప్రశ్న ఓ నెటిజన్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఎదురైంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే నవ్య తాజాగా గులాబీ వర్ణపు దుస్తుల్లో ఒక ఫొటోను పంచుకుంది. అయితే.. ఆ పోస్టుపై కామెంట్‌ చేస్తూ.. ఓ అభిమాని ‘మీరు చాలా అందంగా ఉన్నారు. బాలీవుడ్‌లో ప్రయత్నించండి’ అంటూ అడిగాడు. దానికి నవ్య చాలా పద్ధతిగా బదులిచ్చింది. ‘‘మీ అభిమానానికి కృతజ్ఞతలు. కానీ, అందమైన మహిళలు వ్యాపారాల్లోనూ రాణించగలరు’’ అని సమాధానం ఇచ్చింది. ఆమె ఎంతో హుందాగా ఆమె ఇచ్చిన స్పందనపై పలువురు బాలీవుడ్‌ స్టార్‌లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా నవ్య మాట్లాడుతూ.. ‘‘మా వంశంలో నాలుగో తరాన్ని మొదటి మహిళగా నేనే ముందుండి నడిపించాలని అనుకుంటున్నాను. ఒక గొప్ప వంశాన్ని నడిపించే అవకాశం రావడం నాకు నిజంగా గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె ఇప్పటికే ‘ఆరా హెల్త్‌’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. దాని ద్వారా ఆరోగ్యం, పరిశుభ్రత విషయాల్లో మహిళలకు తోడ్పాటు అందిస్తోంది. అయితే.. సినిమా వారసత్వం ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమలోకి రావడం తనకు ఆసక్తి లేదని నవ్య పలుమార్లు స్పష్టం చేసింది.

సినిమా రంగంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని.. అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోతే తన తండ్రి అమితాబ్‌, తన సోదరుడు అభిషేక్‌ ఎంతలా కుంగిపోయేవారో తాను స్వయంగా చూశానని అందుకే తన కూతురు సినిమాల్లోకి రాకపోవడమే మంచిదని తాను భావిస్తున్నానని నవ్య తల్లి శ్వేతాబచ్చన్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ‘సినిమాలు సరిగ్గా ఆడనప్పుడు తన తండ్రిని, సోదరుడిని జనం ఎంతలా ట్రోల్‌ చేస్తూ విమర్శిస్తారో నేను స్వయంగా చూశా. నేను వాటిని జీర్ణించుకోలేక పోయేదాన్ని. వాటి వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. మా కుంటుంబం నుంచి మరో వ్యక్తిని ఇలాంటి రంగంలోకి దించాలని అనుకోవట్లేదు. నా స్వార్థమే అనుకోండి’’ అని ఆమె పేర్కొంది. శ్వేతాబచ్చన్‌ కూడా సినిమాల్లోకి రాలేదు. మోడలింగ్‌ రంగంలో రాణించిన ఆమె తర్వాత రచయితగా స్థిరపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని