Bedurulanka 2012: బెదురులంక ప్రత్యేకత అదే!

‘‘ఇంతకుముందు జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చేసిన సినిమా ఇది’’ అన్నారు కార్తికేయ (Kartikeya).

Updated : 11 Feb 2023 06:49 IST

‘‘ఇంతకుముందు జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చేసిన సినిమా ఇది’’ అన్నారు కార్తికేయ (Kartikeya). ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బెదరులంక 2012’ (Bedurulanka 2012). నేహాశెట్టి (Neha Shetty) కథానాయిక. క్లాక్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మాత. సి.యువరాజ్‌ సమర్పకులు. ఈ సినిమా టీజర్‌ని కథానాయకుడు విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. అనంతరం చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులందరినీ థియేటర్లకి రప్పించే సినిమా అవుతుంది. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంది. హాస్యం, భావోద్వేగాలు, పోరాటాలు, నృత్యాలు... ఇలా అన్నీ కథలో నుంచే వస్తాయి. మనమంతా జీవితాన్ని ఒక కోణంలో చూస్తే క్లాక్స్‌ మరో కోణంలో చూస్తాడు. ఆ ప్రత్యేకత ఈ సినిమాలో కనిపిస్తుంది. మంచి అభిరుచి ఉన్న నిర్మాత బెన్నీ. ఇలాంటి నిర్మాతలు వస్తే విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం మాకు లభిస్తుంది. ఈ దర్శకనిర్మాతలతో పనిచేయడం నా అదృష్టం. పల్లెటూరి అమ్మాయి చిత్ర పాత్రలో ఒదిగిపోయింది నేహా. మణిశర్మ పాటలకి డాన్స్‌ చేయడంతో ఓ గొప్ప లక్ష్యం నెరవేరిన అనుభూతి కలిగింది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నిజాయతీగా చేసిన ప్రయత్నమిది. ఈ సినిమాని తరచూ చూస్తున్నా, నవ్వుకుంటూనే ఉన్నా. అకిరా కురసోవా ‘సెవెన్‌ సమురాయ్‌’లోని ఓ సంభాషణ స్ఫూర్తితో ఈ కథ రాశా’’ అన్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో బి.వి.ఎస్‌.రవి, దుర్గారావు, రాజేశ్వరి, అనితానాగ్‌, దివ్య నార్ని, కిట్టయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని