Vikram:‘విక్రమ్‌’కు, ఆ రెండు సినిమాలకూ ఉన్న కనెక్షన్‌ ఏంటి?

కమల్‌హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలకపాత్రల్లో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘విక్రమ్‌’.

Updated : 01 Jun 2022 16:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కమల్‌హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలకపాత్రల్లో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘విక్రమ్‌’. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా గురించే అటు కోలీవుడ్‌లోనూ, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘విక్రమ్‌’కు సంబంధించి  ఇప్పటివరకూ విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, ప్రచార చిత్రాలను చూస్తే గతంలో వచ్చిన రెండు సినిమాలకు తాజా చిత్రానికీ సంబంధం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.  అవే కమల్‌ కమల్‌ ‘విక్రమ్‌’(1986). కార్తీ ‘ఖైదీ’(2019).

ముందుగా కమల్‌ 1986లో వచ్చిన‘విక్రమ్‌’ గురించి చూద్దాం! 

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా రాజశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన  యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. అప్పట్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. సత్యరాజ్‌, అంబిక, డింపుల్ కపాడియా, లిస్సా, అంజాద్‌ఖాన్‌ వంటి నటులు ఇందులో ఉన్నారు. ఇందులో కమల్‌  ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ అరుణ్‌కుమార్‌ విక్రమ్‌గా కనిపిస్తారు. మిసైల్‌ అటాక్‌ నుంచి భారతదేశాన్ని ఏజెంట్‌ విక్రమ్‌ ఎలా కాపాడాడన్నది ఈ చిత్రం కథ. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇటీవల ఇంటర్వ్యూలో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ నాటి విక్రమ్‌కు నేటి లోకేశ్‌ కనకరాజ్‌ చిత్రానికి కనెక్షన్‌ ఉన్నట్లు చెప్పారు. ‘‘నాటి విక్రమ్‌ చిత్రానికి కొనసాగింపుగా నేను ఒక కథను అనుకున్నా. అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పాటలకు అస్సలు స్కోప్‌లేదు. ఈ క్రమంలోనే లోకేశ్‌ వచ్చి నాకొక కథ చెప్పాడు. తను చెప్పిన కథకు ‘విక్రమ్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నానని అన్నాడు. దీంతో నా మదిలో ఉన్న కథను అతనితో పంచుకున్నా. లోకేశ్‌కు నేను చెప్పిన కథ నచ్చింది. తను అనుకున్న పాయింట్‌ను పక్కన పెట్టి, ఈ కథపై దృష్టి పెట్టాడు. తన శైలిలో కథలో మార్పులు, చేర్పులు చేసుకుంటూ వెళ్లాడు’’ అని కమల్‌ చెప్పుకొచ్చారు.

అంటే ఆ ‘విక్రమ్‌’(1986) నుంచి లీడ్‌ తీసుకుని కమల్‌ పాత్రతో సహా ఒకట్రెండు పాత్రలు ఈ ‘విక్రమ్‌’లో కొనసాగవచ్చు. లోకేశ్‌ కనకరాజ్‌ చిత్రంలోనూ కమల్‌ కమాండర్‌ అరుణ్‌ కుమార్‌ విక్రమ్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. మరి ఆయన పోరాటం ఎవరి మీద? సంతానం (విజయ్‌ సేతుపతి), అమర్‌ (ఫహద్‌ ఫాజిల్‌) పాత్రలేంటి?  సినిమాలో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. అతడు ఎవరి కొడుకు? తదితర విషయాలు తెలియాల్సి ఉంది. ట్రైలర్‌ చివరిలో కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌.. విక్రమ్‌’ అని అరుస్తాడు. కమల్‌హాసనే విక్రమ్‌ అయితే మరి ఆ విక్రమ్‌ ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలకు జూన్‌ 3న సమాధానం లభించనుంది. ఇక ‘విక్రమ్‌’లో సూర్య అతిథి పాత్రలో మెరవనున్నారు. అయితే, ఆయన పాత్ర ఏంటి? లుక్‌ ఎలా ఉంటుంది? ఇప్పటివరకూ చూపించలేదు. దీని గురించి కమల్‌ మాట్లాడుతూ.. ‘అతని (సూర్య) పాత్ర పార్ట్‌-3కు కొనసాగే అవకాశం ఉంది’ అని అన్నారు. అంటే లోకేశ్‌ గతంలో కార్తీతో తెరకెక్కించిన ‘ఖైదీ’, ఇప్పుడు రాబోతున్న ‘విక్రమ్‌’, తర్వాత చేస్తారని చెబుతున్న ‘విక్రమ్‌3’ అన్నింటికీ లింక్‌ ఉండబోతోందని అర్థమవుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ఇదొక మల్టీవర్స్‌లా కనిపిస్తోంది. ఎందుకంటే ‘ఖైదీ’లో ఉన్న ఒకట్రెండు పాత్రలు ‘విక్రమ్‌’లో ఉన్నాయి. మరి ఇంతకీ ‘ఖైదీ’ కథేంటో మీకు తెలుసు కదా!

‘ఖైదీ’కథ ఇదీ..

ఢిల్లీ బాబు (కార్తి) ఒక కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ ఖైదీ. పదేళ్ల శిక్ష పూర్తయ్యాక సత్ప్రవర్తన కారణంగా మిగతా నాలుగేళ్ల శిక్ష తగ్గించి అతణ్ని విడుదల చేస్తారు. అప్పటిదాకా ఒక్కసారీ చూడని తన కూతురిని చూడాలని బయలుదేరుతుండగా ఒక పెద్ద ప్రమాదం నుంచి దాదాపు 40 మంది పోలీసు అధికారుల్ని కాపాడాల్సిన బాధ్యత అతడిపై పడుతుంది. అతను ఈ పనిని ఎలా నిర్వర్తించాడు? ఈ క్రమంలో తను ప్రాణాల మీదికి ఎలా తెచ్చుకున్నాడు? చివరకు కూతుర్ని అతను కలిశాడు లేదా?  అన్నది ‘ఖైదీ’ కథ.  పోలీసులు అరెస్టు చేసిన ఆది శంకరుడు(హరీశ్‌ ఉత్తమన్‌)కూ ఢిల్లీకి ఉన్న సంబంధం ఉందంటూ దర్శకుడు క్లూ ఇచ్చి వదిలేశాడు. వారి మధ్య ఏం జరిగిందన్నది తెలియదు. అయితే, ‘ఖైదీ’లో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌(నరేన్‌), విలన్‌ గ్యాంగ్‌లో ఉండే అమర్‌ (అర్జున్‌ దాస్‌)లు ‘విక్రమ్‌’లోనూ ఉన్నారు. అంటే ‘ఖైదీ’ కథకు ముందు ఏం జరిగిందన్నది ఇందులో చూపిస్తారేమో చూడాలి.

విక్రమ్‌ పార్ట్‌-3 ఏంటి?

‘విక్రమ్‌’ప్రమోషన్స్‌లో భాగంగా లోకేశ్‌తో మరో సినిమా ఉంటుందని కమల్‌హాసన్‌ స్పష్టం చేశారు. బహుశా అది ‘విక్రమ్‌3’ కావచ్చు. ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం బట్టి ‘విక్రమ్‌’ చివరిలో సూర్య వచ్చే అవకాశం ఉంది. ఆయన పాత్ర తర్వాతి కథకు లీడ్‌ చేయవచ్చు. ఆ చిత్రంలో కమల్‌-సూర్య కలిసి నటించవచ్చు. మరి వీళ్ల కాంబోకు ఢిల్లీ (కార్తి) జత అవుతారా? లేదా ‘విక్రమ్‌-3’ పూర్తిగా కమల్‌-సూర్య కాంబినేషన్‌లో నడిచి చివరిలో ఢిల్లీని ప్రవేశపెడతారా? చూడాలి? వీటన్నింటికీ సమాధానం కాలమే చెప్పాలి.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని