Raashii Khanna: బాహుబలిలో ఆ పాత్ర కోసం ఆడిషన్‌కు వెళ్లా.. అందుకే ఇవ్వలేదు!

Raashii Khanna: విజువల్‌ వండర్‌ ‘బాహుబలి’లో తాను అవకాశం ఎందుకు దక్కించుకోలేకపోయానోనన్న విషయాన్ని రాశీఖన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

Updated : 08 Mar 2023 18:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు సినీ ఖ్యాతిని పెంచుతూ అగ్ర దర్శకుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమైన విజువల్‌ వండర్‌ ‘బాహుబలి’ (Baahubali). రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాన్‌ ఇండియా మూవీ రూపురేఖలనే మార్చేసింది. ఈ సినిమాలో నటించిన ప్రతినటుడికీ ఎంతో గుర్తింపు వచ్చింది. అయితే, కొందరు నటీనటులు ఈ సినిమాలో చేసే అవకాశాన్ని వివిధ కారణాల వల్ల కోల్పోయారు. అలాంటి వారిలో అందాల కథానాయిక రాశీఖన్నా (Raashii Khanna) కూడా ఒకరు. తాను ‘బాహుబలి’లో ఎందుకు నటించలేకపోయిందోనన్న విషయాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

‘‘బాహుబలి’ (Baahubali) ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి, నేనూ వచ్చాను. అందులో తమన్నా పోషించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్‌ ఇచ్చాను. అయితే, సుకుమారమైన ముఖం, చేతిలో కత్తి ఉండటాన్ని రాజమౌళి సర్‌ అస్సలు చూడలేకపోయారు. ఆ పాత్రకు అందంతో పాటు, రఫ్‌లుక్‌ కూడా కావాలి. నేను ప్రేమ కథలకు చక్కగా సరిపోతానని భావించి, ‘నా స్నేహితుడు ఒకరు లవ్‌స్టోరీ చేస్తున్నారు. అక్కడకు వెళ్లు. ఆ కథ కూడా నీకు బాగా నచ్చుతుంది’ అన్నారు. అలా నేను ఆ నిర్మాత దగ్గరకు వెళ్లి కథ విన్నా. దక్షిణాది సినిమాలంటే పాటలు, డ్యాన్స్‌ అనే భావన ఉండేది. కానీ, ‘ఊహలు గుసగుసలాడే’ (oohalu gusagusalade) చేసిన తర్వాత నాకు మంచి పేరు వచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించారు. తమిళ్‌, మలయాళ అవకాశాలు వచ్చాయి’’ అని రాశీఖన్నా (Raashii Khanna) చెప్పుకొచ్చింది.

ఆ సినిమా తర్వాత వివిధ భాషల్లో మంచి పాత్రలు దక్కించుకున్నారు రాశీఖన్నా. ఇటీవల వెబ్‌సిరిస్‌ల్లోనూ ఆమె నటిస్తున్నారు. గతేడాది ‘రుద్ర’లో అలరించగా, తాజాగా ‘ఫర్జీ’ (Farzi) లో మంచి పాత్రను చేశారు. నటిగానే కాదు, గాయనిగా కూడా తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘యోధ’ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం ‘థ్యాంక్యూ’. తమిళంలో ‘తిరుచిత్రాంబళం’లో నటించి అలరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని