Chiranjeevi: ఎద్దుతో చిరు ఫైట్‌.. ఆరు వేల కుండలు తెచ్చారట!

Chiranjeevi: చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘ఆపద్బాంధవుడు’లో ఎద్దు ఫైట్‌ కోసం ఆరు వేల కుండలను చిత్ర బృందం తెప్పించిందట.

Published : 04 Jun 2023 01:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చిరంజీవి (Chiranjeevi) సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు పండగే. 60ఏళ్లు దాటినా ఆయనకున్న క్రేజ్‌, గ్రేస్‌ ఏమాత్రం తగ్గలేదు. అభిమానులను అలరించేలా కమర్షియల్‌ చిత్రాలు చేస్తూనే తనలోని నటుడిని తృప్తి పరిచేలా నటనా ప్రాధాన్యమున్న సినిమాలను కూడా చిరు చేశారు. అయితే, కొన్ని బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించగా, మరికొన్ని పెద్దగా మెప్పించలేదు. అలాంటి వాటిలో ‘ఆపద్బాంధవుడు’ (Aapadbandhavudu) ఒకటి.  కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మీనాక్షి శేషాద్రి కథానాయిక.

ఆర్ట్‌ సినిమానే అయినా, చిరంజీవి అభిమానుల కోసం ఎద్దుతో ఫైట్‌ చేసే సీన్‌ను పెట్టారు. ఇందుకోసం చిత్ర నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ రూ.50వేలు ఖర్చు పెట్టి ఆరు వేల కుండలను తెప్పించింది. ఫైట్‌ సీన్‌ చేయడానికి నాలుగు రోజులు పైనే పట్టగా, పగిలిపోయిన కుండల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త కుండలను పెట్టేవారు. అలా ఫైట్‌ సీన్‌ చివరికి వచ్చేసరికి  కుండల కటకట ఏర్పడింది. అప్పటికే మద్రాస్‌లో తయారయ్యే కుండలన్నీ ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ తీసుకుంది. అదనంగా కుండలు కావాల్సి వస్తాయేమోనని, నాలుగు రోజుల పాటు ఆర్ట్‌ అసిస్టెంట్‌లు కుండల కోసం మద్రాసు చుట్టు పక్కల గ్రామాలన్నీ తిరుగుతూనే ఉన్నారట.

ఇక ఆపద్బాంధవుడు సినిమా విషయానికొస్తే, 1992 అక్టోబరు 9న విడుదలైన ఈ సినిమా విమర్శకులను మెప్పించింది. చిరంజీవి నటనకు గానూ ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఉత్తమ సంభాషణ రచయితగా జంధ్యాల, ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌గా బి.చలం, అరుణ్‌ బి.గోడ్వంకర్‌, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా భూషణ్‌ లకంద్రికి నంది అవార్డులు దక్కాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని