Super star krishna: విప్లవ శంఖం అల్లూరి సీతారామరాజు.. ఇదీ కృష్ణ డేరింగ్
జేమ్స్‌బాండ్‌గా, కౌబాయ్‌గా అలరించడమే కాదు, కృష్ణ అంటే గుర్తొచ్చే మరో అద్భుతమైన పాత్ర అల్లూరి సీతారామరాజు. ఇప్పటికీ ఎప్పటికీ అదొక అద్భుత చిత్రం. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా కోసం కృష్ణ చేసిన సాహసం ఇది.
అల్లూరి సీతారామరాజు భరతమాత ముద్దుబిడ్డ. విప్లవాగ్ని రగిలించిన అఖండ వీరుడు. తెల్లదొరల గుండెల్లో నిద్రపోతూ స్వాతంత్ర్య సమరాన్ని సాగించిన విప్లవ సింహం. అటువంటి తెలుగువీరుడి చరిత్రను రంగుల్లో అల్లూరి సీతారామరాజుగా తొలి సినిమా స్కోప్ చిత్రంగా సమర్పించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ (Super star krishna)కు దక్కింది. అఖిలాంధ్ర ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ చిత్రం కృష్ణ చలనచిత్ర జీవితంలో 100వ సినిమా. తెలుగువారికి అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణే గుర్తొస్తారు. అంతలా ఆ పాత్ర మనపై చెరగని ముద్రవేసింది. చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపుతూ కృష్ణ ఈలోకాన్ని విడిచి వెళ్లారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు మూవీ జ్ఞాపకాలు మీకోసం..
ఎన్నో ప్రయత్నాలు!
తేనె మనసులు(1965) చిత్రంతో చలనచిత్ర రంగప్రవేశం చేసి, అడ్వెంచర్ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించిన కృష్ణ 12వ చిత్రం అసాధ్యుడు (1968). ఈ సినిమాలోని ఒక అంతర్నాటకంలో కృష్ణ అల్లూరి సీతారామరాజుగా నటించినప్పుడు, ఆ విప్లవ వీరుని ఇతివృత్తాన్ని ఒక చక్కని సినిమాగా సొంతంగా మలచాలన్న ఆకాంక్షకు తొలిబీజం పడింది. అంతకు ముందు జగ్గయ్య కూడా ఆలు-మగలు (1958) సినిమాలోని ఒక అంతర్నాటకంలో సీతారామరాజుగా నటించారు. అది కూడా కృష్ణకు స్ఫూర్తే! అక్కినేని నాగేశ్వరరావుతో ఈ సినిమా తీయాలని తాతినేని ప్రకాశరావు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకో తీయాలేకపోయారు. ఇదే ఆలోచన నటరత్న ఎన్టీఆర్‌కి కూడా వచ్చింది. ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్టు కూడా తయారుచేయించారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. తర్వాతి వంతు శోభన్‌బాబుది. దేవదాసు నిర్మాత డి.ఎల్. శోభన్‌బాబుతో ఈ సినిమా తీయాలని చూసినా, అది కూడా ఫలవంతం కాలేదు. ఇక కృష్ణ విషయానికి వస్తే, అప్పుడప్పుడే సినిమాల్లో హీరోగా నిలదొక్కుకుంటూ ఉండటంతో తన పథకాన్ని మనసులోనే పదిలపరుచుకొని, సమయం కోసం వేచి ఉండి, చివరకు త్రిపురనేని మహారథితో స్క్రిప్టు రూపొందించి చిత్రనిర్మాణానికి నడుం బిగించారు. మహారథి అప్పట్లో చాలా బిజీ రచయిత. కేవలం ఈ చిత్రం కోసం ఆయన అంతకు ముందు అంగీకరించిన సినిమాలను రద్దు చేసుకుని, ఆ ఆదర్శ యోధుడి వీర చరిత్ర గురించి అనేక పరిశోధనలు చేసి పకడ్బందీగా స్క్రిప్టును తయారుచేశారు.
మన్నెంలో మహా యజ్ఞం
ఈ చిత్ర ముహూర్తం 1973 డిసెంబరు 12న జరిగింది. పద్మాలయా సంస్థకు ఆస్థాన ఛాయాగ్రాహకుడైన వి.ఎస్.ఆర్. స్వామి, మన్య ప్రాంతంలో సినిమా షూటింగు జరిపే పక్షంలో సినిమాస్కోప్‌లో చిత్రాన్ని నిర్మిస్తే అద్భుతంగా ఉంటుందని సలహా ఇవ్వడంతో, సాహసానికి మారుపేరైన కృష్ణ వెంటనే బొంబాయి నుంచి లెన్సులు తెప్పించారు. విశాఖపట్నం సమీప అడవుల్లో రెండు నెలలపాటు షూటింగు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో కళా దర్శకుడు రామలింగేశ్వరరావు కృషి ఎంతైనా ఉంది. నాగరిక ప్రపంచానికి నలభై మైళ్ళ దూరంలో కొండలు, కోనల మద్య చింతపల్లిలో గృహవసతితో సహా యూనిట్ మొత్తానికి ఆధునిక సౌకర్యాలను కల్పించే కృషి చేశారు. చింతపల్లికి దగ్గరలో ఉన్న లోతుగడ్డ, సప్పర్ల, లంబసింగి, పోశనపాడు, అన్నవరం, కృష్ణదేవిపేట, బలిమెల మన్యప్రాంతాల్లో శీతకాలంలో నిర్విరామంగా దాదాపు రెండు నెలల షూటింగు జరిపారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో మంచి నీళ్లకు కూడా దూరం వెళ్లాల్సి వచ్చేది. బస్సులు, మినీ ట్రక్కులు, కార్లు, క్రేన్లు ఒకటేమిటి.. అన్నీ మన్యంలోకే వచ్చేశాయి. నటీనటులతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా ఒక అనిర్వచనీయమైన భావావేశంతో కృషిచేసి చిత్ర నిర్మాణాన్ని జయప్రదం చేశారు. తొలిప్రయత్నంలోనే షాట్ ఒకే అయ్యేది. ఇది ఒక చిత్రమైన అనుభూతిగా ఉండేదని గంటందొరగా నటించిన గుమ్మడి ఒకానొక సందర్భంలో మీడియాకు తెలిపారు. మహారథి సంభాషణలను ఏరోజుకారోజే రాసేవారు. అందరికన్నా ముందే లేచి, చన్నీటి స్నానం చేసి, ధ్యానం పూర్తి కావించి సంభాషణలు రాసేందుకు ఉపక్రమించేవారు. మన్యంలో షూటింగు జరిగినన్ని రోజులు మహారథికి ఒకపూట మాత్రమే భోజనం చేసేవారు. పతాక సన్నివేశానికి అవసరమైన సంభాషణలు రాసేందుకు ఒకరోజు మహారథి యూనిట్ సభ్యులకి దూరంగా వెళ్లి సాయంకాలం దాకా రాలేదు. సీతారామరాజే తనని ఆవహించి అద్భుతమైన డైలాగులు రాయించాడని మహారథి అనేవారు. అంతవరకూ కృష్ణ నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, అల్లూరి సీతారామరాజు మరో ఎత్తు. సంభాషణలు పలికే తీరు, హావభావాలు ప్రదర్శించే విధానం, ఆహార్యం వంటి విషయాల్లో కృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏకబిగిన 30 కాల్షీట్ల పాటు పనిచేశారు.
సినిమా ప్రత్యేకతలు
చిత్ర దర్శకుడు వి. రామచంద్రరావు కృష్ణ నటించిన మూడో చిత్రం గూఢచారి 116 చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్. కృష్ణ నటించిన అసాధ్యుడు సినిమా రామచంద్రరావుకు దర్శకునిగా మొదటి చిత్రం. తర్వాతి చిత్రం మరపురాని కథలో కూడా హీరో కృష్ణే. నేనంటే నేనే, అఖండుడు, కర్పూరహారతి, ఆస్తులు -అంతస్తులు వంటి 13 విజయవంతమైన కృష్ణ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామచంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించక ముందు.. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాన్ని సూపర్‌హిట్ చేశారు. అందుకే వీరిద్దరి బంధం విడదీయరానిది. విధి ఎంత బలీయమైనదో కాని.. చిత్రం చివరిదశ నిర్మాణం జరుగుతుండగా.. తన 47వ యేట ఫిబ్రవరి 14న రాయవేలూరు ఆసుపత్రిలో రామచంద్రరావు హృద్రోగంతో మృతిచెందారు. తర్వాత కృష్ణనే దర్శకత్వ బాధ్యతలు నిర్వహించమని మహారథి కోరినా.. దర్శకుడు కె.ఎస్.ఆర్ దాసుకు ఆ పనులు అప్పగించిన సంస్కారవంతులు కృష్ణ. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దర్శకత్వం వహించి.. తన సినిమా విజయాన్ని కళ్లారా చూడకుండానే రామచంద్రరావు మరణించడం దురదృష్టకరం. ఈ సినిమా 17 కేంద్రాల్లో శతదినోత్సవంతో భారీ విజయాన్ని నమోదు చేసింది. రిపీట్ రన్లో కూడా వందరోజులు ఆడిన మాయాబజార్, దేవదాసు వంటి అతి తక్కువ సినిమాల సరసన అల్లూరి సీతారామరాజు చోటు సంపాదించింది.
విజయవాడ నగరంలో ఏకంగా నాలుగు థియేటర్లలో ఒకేరోజు విడుదలై ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్ ఈ సినిమా తీద్దామని కృత నిశ్చయంతో ఉన్నా.. తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రదర్శన చూసి, కృష్ణను అభినందించి, తను సినిమా నిర్మించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సినిమా మొత్తం కాషాయ వస్త్రాలతో కనిపించిన కృష్ణను ప్రేక్షకులు మరిచిపోలేరని, రాబోయే కృష్ణ సినిమాలపై కనీసం ఒక సంవత్సర కాలమైనా ఈ సినిమా ప్రభావం ఉంటుందని చక్రపాణి చమత్కరించాడు. చిత్రంలో రూథర్‌ఫర్డ్‌గా నటించిన జగ్గయ్య వేషధారణ కోసం మేకప్ మ్యాన్ మాధవరావు చాలా శ్రమించారు. నీలిరంగు కాంటాక్ట్ లెన్సులను అమర్చి బ్రిటిషు దొర రూపాన్ని తీర్చిదిద్దారు. అగ్గిరాజు పాత్రకు తొలుత ఎస్వీఆర్‌ని అనుకున్నా.. ఆ పాత్ర బాలయ్యను వరించింది. గంటందొర వేషం పల్నాటి యుద్దంలో బ్రహ్మనాయుడు పాత్రవంటింది. తమ్ముడు మల్లుదొర (ప్రభాకర రెడ్డి) ఎంతటి దూకుడు స్వభావుడో, గంటందొర అందుకు పూర్తి భిన్నం. సర్వసేనానిగా గంటందొర తీసుకునే నిర్ణయాలను చివరకు సీతారామరాజు కూడా ఆచరించిన సందర్భాలు ఉన్నాయి.
ఈ సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా పాటకు జాతీయస్థాయిలో ఉత్తమ గీత రచన బహుమతి లభించింది. తెలుగు సినిమాకు ఇలాంటి బహుమతి రావడం అదే ప్రథమం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి స్వర్ణ నందిని బహూకరించింది. ఆఫ్రో-ఏషియన్ చలన చిత్రోత్సవంలో కూడా ఈ సినిమా ప్రదర్శితమై బహుమతి అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో ఇంక్విలాబ్ జిందాబాద్ పేరిట డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా స్వర్ణోత్సవం సందర్భంగా సీతారామరాజు తమ్ముడు సత్యనారాయణరాజును కృష్ణ సత్కరించారు.
ఆదినారాయణరావు ఆణిముత్యాలు
కృష్ణ సొంత సినిమా అగ్నిపరీక్ష (1970) తర్వాత ఆదినారాయణ రావు సంగీత దర్శకత్వం వహించిన కృష్ణ చిత్రం అల్లూరి సీతారామరాజు. శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజులు ఈ చిత్రానికి పాటలు రాశారు. ‘రగిలింది విప్లవాగ్ని ఈరోజు.. ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు’ అనే ఆరుద్ర గీతాన్ని బాలు ఆలపించారు. ఈ పాటను బెర్లిన్‌లోని హంబోల్డ్ విశ్వవిద్యాలయ ఆర్కైవ్స్‌లో భద్రపరిచారు. సినిమా టైటిల్స్ పడేటప్పుడు ఈ పాట నేపథ్యంలో వినిపిస్తుంది. కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకు... కత్తిగట్టి సాగమంది కడవిజయం వరకు వంటి ఉత్తేజపూర్వకమైన సమాసాలే కాకుండా, బెంగాల్, మరాఠీ ఉద్యమాలు, జలియన్ వాలాబాగ్ హింసాకాండల ప్రసక్తితో ప్రేక్షకుడు ఉద్రేక స్ఫూర్తితో ఈ సినిమా చూసేందుకు ఉపక్రమిస్తాడు. సుశీల పాడిన సినారె గీతం.. ‘వస్తాడు నారాజు ఈరోజు..’ శ్రీ రాగంలో రూపుదిద్దుకుంటే, విజయనిర్మలపై ఆ పాట చిత్రీకరణ ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ పాట చిత్రీకరణ కేవలం మూడు గంటల్లో పూర్తయింది. ఇప్పుడు కొచ్చెడియాన్‌లో ఉపయోగించిన మోషన క్యాప్చరింగ్ టెక్నిక్ వచ్చేలా, ఆరోజుల్లో సాధారణ కెమెరాలతో వి.ఎస్.ఆర్. స్వామి చిత్రీకరణ జరపడం మేధావుల్ని విస్మయపరిచింది. కొసరాజు రాసిన ‘జంబైలే జోరు జంబరు హైలేసా’ పాట చంద్రమోహన్, మంజుల, జయంతి బృందంపై రోడ్డు రోలర్‌తో మన్యంలో బాట వేసే సందర్బంగా చిత్రీకరించారు. ‘ఏ దేవుడైన దిగివచ్చి ఆదుకోడా... ఈ దిక్కులేని వాళ్ల ఎతలు తీర్చిపోడా’ అనే చరణంలో సీతారామరాజు కాషాయ వస్త్రంలో ప్రత్యక్షం కావడం ఈ పాటకు హైలైట్. మరో కొసరాజు పాట ‘కొండదేవత నిన్ను కొలిచేమమ్మా కోటి కోటి దండాలు ఓలమ్మా’ను చింతపల్లి అడవుల్లో వేసిన గుహ సెట్‌లో చిత్రీకరించారు. అవుట్ డోర్‌లో చిత్రీకరించిన మొదటి పాట ఇదే. అంతేకాదు. సినిమాస్కోప్ లెన్స్ పనిచేస్తున్న తీరు పరీక్షించేందుకు ప్రయోగం ఈ పాట మీదే చేశారు. మన్యం ప్రజలు కొండదేవతను కొలిచే సందర్భంగా ఈ పాట వస్తుంది. ఇక జాతీయ బహుమతిని తెచ్చిపెట్టిన శ్రీశ్రీ గీతం తెలుగు వీర లేవరా.. అంటూ సీతారామరాజు మన్యం ప్రజల్ని ఉత్తేజపరుస్తూ తెల్లదొరలపై తిరుగుబాటు చేసేందుకు సమాయత్తపరిచే పాట వందేమాతరం నినాదంతో ముగుస్తుంది. ఘంటసాల అస్వస్థతకు గురైన సమయంలో కూడా.. ఉద్రేకంగా ఆలపించిన అద్భుత గీతం ఈ పాట. ఇక ఆఖరి పాట సంగీత దర్శకులు ఆదినారాయణరావు స్వయంగా రాసి స్వరపరచిన ‘హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ లెటజ్ స్వింగ్ అండ్ స్వే’ పాటను ఆల్ ఇండియా రేడియో పాపులర్ సింగర్ రీటా తన బృందంతో పాడగా, ప్రముఖ బెంగాలీ నటీ నందితా బోస్, జగ్గయ్య, రాజనాల తదితర నటీనటులతో మన్యంలో చిత్రీకరించారు.
కాంతారావు, పేకేటి, రావుగోపాలరావు, చంద్రమోహన్, త్యాగరాజు, అల్లురామలింగయ్య, కె.వి. చలం, విజయనిర్మల, మంజుల, పండరీబాయి వంటి హేమాహేమీలు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగు చలనచిత్ర మాలికలో ఒక మణిపూస.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం