bhairava dweepam: బాలకృష్ణను అలా చూసి షాకైపోయారు!

పనే దైవంగా భావించి అంకిత భావంతో పనిచేసే అతికొద్ది మంది నటుల్లో అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ఒకరు

Published : 24 Jun 2021 20:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పనే దైవంగా భావించి అంకిత భావంతో పనిచేసే అతికొద్ది మంది నటుల్లో అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ఒకరు. క్రమశిక్షణ, చేస్తున్న పనిపట్ల నిబద్ధతను తండ్రి ఎన్టీఆర్‌ నుంచి పుణికిపుచ్చుకున్న ఆయన.. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతారు. అంతేకాదు, ప్రయోగాలకు ఆయన సై అంటారు. మాస్‌ కథానాయకుడిగా రాణిస్తున్న సమయంలో ‘భైరవద్వీపం’లాంటి జానపద చిత్రాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అద్భుత విజయాన్ని అందుకుని బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.

మాస్‌ హీరోగా, గ్లామరస్‌ కథానాయకుడిగా రాణిస్తున్న సమయంలో బాలకృష్ణ ‘భైరవద్వీపం’ చేయడం ఒక ఎత్తయితే, అందులో కురూపిగా నటించడానికి ఒప్పుకోవడం సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అప్పటికే ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’, ‘నిప్పురవ్వ’, ‘బంగారు బుల్లోడు’ వంటి మాస్‌ కథా చిత్రాలతో దూకుడుమీదున్నారు బాలయ్య. ఈ సమయంలో సింగీతం ‘భైరవద్వీపం’ కథతో బాలకృష్ణ వద్దకు వస్తే, మరో ఆలోచన లేకుండా ఒకే చెప్పేశారు. అంతేకాదు, కథలో భాగంగా కురూపిగా నటించడానికి సరేనన్నారు.

‘‘బాలకృష్ణ కురూపిగా నటించడం నిజంగా సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అప్పటికే బాలకృష్ణకు గ్లామర్‌ హీరో అన్న ఇమేజ్‌ ఉంది. మరో హీరో అయితే, ఒకటి రెండు సార్లు ఆలోచించేవాడేమో. అంతేకాదు, పక్కనున్న వాళ్లు కూడా అలాంటి పాత్రలు చేయొద్దని చెబుతుంటారు. కానీ, బాలకృష్ణ అలా కాదు. దర్శకుడు, కథపై ఆయనకు నమ్మకం ఎక్కువ. కురూపిగా కనిపించే సన్నివేశాలు తీయాల్సి వచ్చినప్పుడు ఆయనకు మేకప్‌ వేయడానికి దాదాపు 2గంటల సమయం పట్టేది. ఒకసారి మేకప్‌ వేసిన తర్వాత సాయంత్రం దాకా తీయడానికి వీల్లేదు. భోజనం చేయాలంటే మేకప్‌ తీయాలి, తీస్తే మళ్లీ రెండు గంటలు వేస్ట్‌. సమయం వృథా కాకూడదని బాలకృష్ణ దాదాపు పదిరోజుల పాటు కేవలం జ్యూస్‌లు మాత్రమే తాగేవారు. ఆ తర్వాత ఆ కురూపి శాపాన్ని కథానాయకుడి తల్లి తీసుకుంటుంది. ఈ విషయాన్ని కేఆర్‌ విజయను అడగ్గా, ఆమె ‘హీరోనే కురూపిగా కనిపిస్తుంటే నాకు వేయడానికి ఏం అభ్యంతరం చెప్పండి’ అని ఆమె కూడా ఆ వేషం వేయడానికి ఒప్పుకొన్నారు. తన శాపం తన తల్లి తీసుకుంటుందని తెలియగానే హీరో పాత్ర కొండలు, రాళ్లు, రప్పలు దాటుకుంటూ రావాలి. అలా బాలకృష్ణ పరిగెత్తుకుంటూ వస్తుంటే నీళ్లలో ఉన్న ముళ్లు కాలిలో దిగబడిపోయాయి. రాళ్లు గుచ్చుకుపోయాయి. అయినా, బాలకృష్ణ అవేవీ లెక్కచేయలేదు. బాలకృష్ణ కురూపిగా కనిపిస్తారని థియేటర్‌లో సినిమా చూసే వరకూ ఎవరికీ తెలియదు. అభిమానులు ఒక్కసారిగా షాకైపోయారు. సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది’’ అని ‘భైరవద్వీపం’ గురించి దర్శకుడు సింగీతం చెబుతుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని