Enjoy Enjaami: 2 నెలలు 200 మిలియన్స్‌ వ్యూస్‌

Enjoy Enjaami మార్చి 7, 2021న యూట్యూబ్‌ వేదికగా విడుదలైన ఈ మ్యూజిక్‌ వీడియో కేవలం రెండు నెలల్లోనే 200 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Updated : 15 May 2021 18:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు ‘వై దిస్‌ కొలవెరి’కి ప్రపంచం వెర్రెత్తిపోయింది.. గంగ్నమ్‌ డ్యాన్స్‌కు గంతులేసింది.. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కన్ను కొడితే యువకుల హృదయాలు కుదేలైపోయాయి. ఇలా ప్రతి సందర్భంలోనూ ఏదో ఒకటి సామాజిక మాధ్యమాల వేదికగా సందడి చేస్తూనే ఉంది. ఇప్పుడు ట్రెండ్‌ ‘ఎంజాయ్‌ ఎంజామీ’ది. మార్చి 7, 2021న యూట్యూబ్‌ వేదికగా విడుదలైన ఈ మ్యూజిక్‌ వీడియో కేవలం రెండు నెలల్లోనే 200 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. గతంలో ఏ తమిళ సింగిల్‌ సాధించని రికార్డు సృష్టించింది.

అరివు సాహిత్యం అందించిన ఈ పాటను గాయని దీ(దీక్షితా వెంకటేశన్‌) ఆలపించారు. అమిత్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహించారు. సంతోష్‌ నారాయణ్‌ నిర్మించారు. విడుదలైన అతి తక్కువ సమయంలోనే అన్ని వేదికల్లోనూ ‘ఎంజాయ్‌ ఎంజామీ’కి విశేష స్పందన లభించింది. తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ ఈ పాటపై ప్రశంసల జల్లు కురిపించారు. ధనుశ్‌, సాయి పల్లవి, సిద్ధార్థ్‌, విఘ్నేశ్‌ శివన్‌, దుల్కర్‌ సల్మాన్‌, లోకేశ్‌ కనకరాజ్‌, పా.రంజిత్‌, క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇలా ఎంతోమంది మెచ్చుకున్నారు. ఇక సామాజిక మాధ్యమాల వేదికగా ఈ పాటకు వందలాది కవర్‌ సాంగ్స్‌ వచ్చాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ ఈ పాటకు తమదైన శైలిలో స్టెప్‌లు వేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ఇక కేరళ, తమిళనాడు పోలీసులు కూడా ఈ పాటతోనే కరోనా వైరస్‌, మాస్క్‌ ధరించడంపై అవగాహన కల్పిస్తున్నారు.

ఇంతకీ ఏంటీ ‘ఎంజాయ్‌ ఎంజామీ’

ఈ పాటకు సాహిత్యం అందించిన వ్యక్తి తమిళ పాటల రచయిత అరివు. గతంలో ‘కాలా’, ‘మాస్టర్‌’ సహా పలు తమిళ చిత్రాలకు పాటలు రాశారు. అరివు బామ్మ వల్లిఅమ్మాళ్‌ ఎప్పుడూ తనని ‘ఎంజామీ(మై డియర్‌, నా దేవుడు) అంటూ పిలుస్తూ ఉండేదట. శ్రీలంకలోని టీఎస్టేట్‌లలో ఆమె నిర్బంధ కార్మికురాలిగా పని చేశారు. అక్కడి ఆమె ఎదుర్కొన్న సంఘటనలు, జీవన పరిస్థితుల నుంచే ఈ పాటకు ప్రాణం పోశారు అరివు. బ్రిటిషు పాలకులు తేయాకు తోటల్లో పనిచేసేందుకు భారత్‌ నుంచి అతి తక్కువ వేతనాలకు కూలీలను శ్రీలంకకు తరలించేవారు. తేయాకు తోటల్లో కొన్నాళ్లు పనిచేసిన అనంతరం కొందరిని యజమానులు నిలిపివేసేవారు. దీంతో వారు గత్యంతరం లేక  భవన నిర్మాణ కూలీలుగా ఇతర ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేసి జీవనం కొనసాగించేవారు. ఆ నాటి దుర్భర పరిస్థితులకు కళ్లకు కడుతూ ఈ పాటను రచించారు అరివు. మానవత్వం, భూమితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గురించి వర్ణిస్తూ ఈ పాటను ఆవిష్కరించారు. ఈ వీడియో చివర్లో వల్లి అమ్మాళ్‌ కనపడతారు. ఎన్‌సామి అంటే తమిళంలో నా దేవుడా అని అర్థం ఆ పదాన్నే శ్రీలంకలో ఎంజామీగా పలుకుతారు.

ఎక్కడెక్కడ వినవచ్చు

ఎంజాయ్‌ ఎంజామీ పాటను మాజా లేబుల్‌పై ఏఆర్‌ రెహమాన్‌ విడుదల చేశారు. యూట్యూబ్‌తో పాటు, స్ఫూటిఫై, జియో సావన్‌, గానా, యాపిల్‌ మ్యూజిక్‌, ఐట్యూన్స్‌, అమెజాన్‌ మ్యూజిక్‌, హంగామా, రాగా.కామ్‌ వేదికల ద్వారా కూడా ఈ సాంగ్ వినవచ్చు. విడుదలైన రెండు వారాల్లోనే స్ఫూటిఫైలో ఈ పాట 2 మిలియన్‌ స్ట్రీమింగ్స్‌ దాటింది. మార్చి 10న వీడియో అందుబాటులోకి రాగా రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే 200 మిలియన్‌ వ్యూస్‌ దాటేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని