krishnam raju: వంద సినిమాలు చేసిన హీరోయిన్‌తో కృష్ణంరాజు తొలి సినిమా

ఏ నటుడికైనా తొలి చిత్రమంటే జీవితంలో మర్చిపోలేనిది. ఆ చిత్రం విజయం సాధిస్తే, అది తీపి

Updated : 11 Sep 2022 15:52 IST

ఇంటర్నెట్‌డెస్క: ఏ నటుడికైనా తొలి చిత్రమంటే జీవితంలో మర్చిపోలేనిది. ఆ చిత్రం విజయం సాధిస్తే, అది తీపి జ్ఞాపకమవుతుంది. అదే పరాజయం పాలైతే అది వెంటాడుతూనే ఉంటుంది. ప్రఖ్యాత దర్శకుడు ప్రత్యగాత్మ నిర్మాతగా కూడా మారి నిర్మించిన చిత్రమే ‘చిలకా గోరింకా’. ఈ చిత్రంతోనే కృష్ణంరాజు నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. అసలు కృష్ణంరాజుకు ఈ చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది? ‘చిలకా గోరింకా’ సినిమా విశేషాలేంటి?

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సంపన్న కుటుంబంలో పుట్టిన కృష్ణంరాజు హైదరాబాద్‌ బద్రుకా కళాశాలలో కామర్స్‌ పట్టభద్రుడు. అప్పటికే శాసనసభ్యునిగా ఉన్న చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు కృష్ణంరాజు పినతండ్రి. ఆయన ఆరంభించిన ‘ఆంధ్రరత్న’ పత్రిక నిర్వహణ బాధ్యతలో బాటు ఆయన సినీ సౌండ్‌ స్టూడియో నిర్వహణ కూడా కృష్ణంరాజు చూస్తుండేవారు. ‘బావమరదళ్లు’ సినిమా నిర్మించిన పద్మనాభరావు ప్రోత్సాహంతో 1963లో కృష్ణంరాజు మద్రాసు చేరుకున్నారు. అక్కడే ప్రత్యగాత్మ కృష్ణంరాజుకు స్క్రీన్‌ టెస్టు నిర్వహించి తాను తీయబోయే కొత్త సినిమాలో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. నాటకరంగ అనుభవం ఉంటే మంచిదని ఈలోగా నాటకాలలో నటిస్తూ ఉండమని సలహా ఇవ్వడంతో, ‘నాగమల్లి’, ‘పరివర్తన’ వంటి నాటకాల్లో నటించి అనుభవం గడించారు. ‘మంచి మనిషి’ సినిమా షూటింగులకు హాజరవుతూ నటనలోని మెళకువలు గ్రహించారు. 1965 ఆగస్టు 6న ప్రత్యగాత్మ సొంత చిత్రం ‘చిలకా గోరింకా’ సినిమా షూటింగు మొదలైంది. అందులో సీనియర్‌ నటి కృష్ణకుమారి సరసన కృష్ణంరాజును ప్రత్యగాత్మ హీరోగా పరిచయం చేశారు.

ఇదీ కథ: అరవై ఏళ్లు నిండిన సంజీవరావు (ఎస్‌.వి.రంగారావు), శాంత (అంజలీదేవి) చిలకా గోరింకల్లా అన్యోన్యమైన దంపతులు. ముప్పై ఏళ్ల దాంపత్య జీవితాన్ని సంజీవరావుకు స్మృతిగా మిగిల్చి, ఒక పాపకు జన్మనిచ్చి, శాంత శాశ్వతంగా నిష్క్రమించింది. లోకం దృష్టిలో శాంత మరణించిందేమోకాని, సంజీవరావుకు మాత్రం ఆమె తన హృదయంలో పదిలంగానే ఉంది. పాపారావు (రమణారెడ్డి) అనే బాగా డబ్బున్న షావుకారు కొడుకు రాజా (కృష్ణంరాజు). శశి (రమాప్రభ) అతని కూతురు. సాగరయ్య (పినిసెట్టి) కొడుకు భద్రం (పద్మనాభం) ఆమెను ప్రేమిస్తాడు. మరోవైపు రాజా, ఉష (కృష్ణకుమారి)ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. తండ్రి మాత్రం డబ్బుతోనే లోకాన్ని చూసే వ్యక్తి. ఎలాగైనా తండ్రిని అంగీకరింపజేసి ఉషను తనదాన్ని చేసుకోవాలని రాజా కలలు కంటాడు. ఉష అందమైన నడత ఉన్న పిల్ల. తల్లికి ఆలంబనగా ఉండాలనేది ఆమె ఆశయం. ఆమె రాజాను మనస్ఫూర్తిగా ప్రేమించింది. కానీ విధి ఎదురుతిరిగి ఆమెను అవిటిదాన్ని చేసింది. నడకలేని తానిక రాజాకు కనిపించకూడదనే ఉద్దేశంతో ఉష దూరంగా వెళ్లి తనకు తానుగా అజ్ఞాతంలో ఉంటుంది. సంజీవరావు దగ్గర ఆశ్రయం పొంది అతనికి, అతని కూతరుకి తనే సర్వస్వమై సేవలు చేసేందుకు సిద్ధపడింది. సంజీవరావు దగ్గర చేరిన ఉషను రాజా అపార్ధం చేసుకొంటాడు. డబ్బుకోసమే ఉష సంజీరావు నివాసంలో చేరిందని భ్రమించాడు. ఆ సమయం లోనే రాజా జీవితంలోకి సరస (వాసంతి) ప్రవేశించాలని ప్రయత్నిస్తుంది. కానీ రాజా ఉషని తప్ప వేరెవరినీ ప్రేమించలేడు. అతని నిస్వార్థ ప్రేమ ముందు సరస నిలువలేకపోయింది. మంచి మనసుతో సరస, రాజాకు ఉష మీదవున్న దురభిప్రాయాన్ని తుడిచివేయగలిగింది. ఆమె సహకారంతో నిజం తెలుసుకున్న రాజా, అవిటిదైనా ఉషను స్వీకరించేందుకు ముందుకొచ్చాడు. చివరికి సినిమా సుఖాంతం.

సినిమా విశిష్టతలు

* ఈ సినిమా కథ వయసు మళ్ళిన పాత్రల మీద నడుస్తుంది. అది కొత్తదనం అని  భావించారు. కథతోబాటు సంగీతానికి మంచి మార్కులే వచ్చాయి. కానీ విజయవంతం కాలేదు. సినిమాను కళాత్మకంగా అయినా తీయాలి, లేకుంటే వ్యాపార ధోరణిలోనైనా తీయలి. కానీ రెంటిని మేళవించి, రెండూ సాధించాలనుకోకూడదు. అక్కడే నేను దెబ్బతిన్నాను’ అని ప్రత్యగాత్మ వివరించారు. ‘ఈ సినిమా ఏ ఒక్క పాత్ర మీద కూడా కేంద్రీకృతమై లేదు. దీని వలన నిండుదనం రాలేదు. అందుకే ఆర్ధిక విజయం అందుకోలేకపోయింది’ అనేది సినీ పండితుల విశ్లేషణ.

* చిలకా గోరింకా సినిమా ఆర్ధిక విజయం సాధించక పోయినా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది బహుమతిని సాధించింది.

* పదకొండు నిమిషాల పాటు సాగే  పాటను రంగుల్లో చిత్రీకరించడం విశేషం. టి.ఆర్‌.జయదేవ్‌, నూతన్‌, సుశీల ఆలపించిన ఈ పాటను కృష్ణంరాజు, కృష్ణకుమారి, వాసంతిలపై చిత్రీకరించారు.

* ‘చిలకా గోరింకా’ చిత్ర నిర్మాణ సమయంలో ప్రత్యగాత్మ హిందీలో తొలిసారి ‘చోటా భాయి’ (1966) సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో వచ్చిన ‘మా వదిన’ సినిమా దీనికి మూలం. హిందీలో రజతోత్సవం జరుపుకొంది. అందులో ప్రధానపాత్ర పోషించిన నటి నూతన్‌ చేత ‘చిలకా గోరింకా’ సినిమాలో ‘నేనే రాయంచనై, చేరి నీ చెంతనే ఆడాలి’ అనే పాటను పాడించారు. నూతన్‌ గళాన్ని కృష్ణకుమారికి వాడుకున్నారు.

* చిత్ర కథానాయిక కృష్ణకుమారి అప్పటికే వంద సినిమాలు పూర్తిచేసిన సీనియర్‌ నటి. నూతన నటుడు కృష్ణంరాజు సరసన ఆమె నటించడానికి కారణం అంతకు ముందు ప్రత్యగాత్మ దర్శకత్వం నిర్వహించిన భార్యభర్తలు, కులగోత్రాలు సినిమాలలో హీరోయిన్‌గా నటించి ఉండడమే.

* రచయిత పినిసెట్టి శ్రీరామమూర్తి ఇందులో సాగరయ్య పాత్రను ధరించడం విశేషం.

* కొన్ని అవుట్‌ డోర్‌ దృశ్యాలను హైదరాబాద్‌కు చేరువలో వున్న భువనగిరిలో చిత్రీకరించారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన భువనగిరికోటను, దాని పరిసర రమణీయ ప్రాంతాలను ఈ సినిమా అవుట్‌ డోర్‌ పాటలను హైదరాబాద్‌ శాసనసభకు సమీపంలో ఉండే నౌబత్‌ పహాడ్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌ల వద్ద చిత్రీకరించారు.

* హాస్యనటి రమాప్రభ కూడా ఈ చిత్రంతోనే తెరంగ్రేటం చేసింది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని