అందుకే ‘తెలుసా మనసా’ ట్యూన్‌ వద్దన్నారట!

‘తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో...’ ఈ రొమాంటిక్‌ గీతం సంగీత ప్రపంచాన్ని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు

Updated : 29 Jun 2023 17:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో...’ ఈ రొమాంటిక్‌ గీతం సంగీత ప్రపంచాన్ని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు ఓ సినిమా కోసం చేసిన ట్యూన్‌ మరో చిత్రంలో వినియోగిస్తారనే విషయం తెలిసిందే. ఆ కోవలోకే వస్తుంది తెలుసా మనసా. నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కిన ‘క్రిమినల్‌’ సినిమాలోని ఈ పాట ముందుగా జగపతిబాబు సినిమా కోసం స్వర పరిచారు స్వరమణి ఎం.ఎం. కీరవాణి.

రాఘవేంద్రరావు- కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన మ్యూజికల్‌ హిట్‌  ‘అల్లరి ప్రేమికుడు’. జగపతిబాబు కథానాయకుడు. రంభ, సౌందర్య, కాంచన్, రమ్యకృష్ణ నాయికలు. ఓ సన్నివేశంలో సౌందర్య.. ‘జగపతిబాబుని పెళ్లి చేసుకుంటాను, పెళ్లి ముహూర్తం చూడు’ అని తన బామ్మ నిర్మలకు చెబుతుంది. ఆ ఆనందాన్ని టేబుల్‌పై ఉన్న చిలక బొమ్మతోనూ పంచుకుంటుంది. చిలకలో జగపతిబాబుని ఊహించుకుని ‘ఐ లవ్‌ యు’ అని చెప్పగా.. చిలక నుంచి కూడా ‘ఐ లవ్‌ యు’ అని సమాధానం వస్తుంది. ఇక్కడ ఓ పాట కావాలని రాఘవేంద్రరావు.. కీరవాణికి సూచించారు. దాని కోసం చాలా బాణీలు సిద్ధం చేసి వినిపించారు కీరవాణి. వాటిల్లో ‘తెలుసా మనసా’ ఒకటి.

‘కలికి చిలక ముద్దు తాంబూలం ఇమ్మందని’ అంటూ సాగే సాహిత్యంతో కూడిన ట్యూన్‌ వినిపించగా.. సన్నివేశానికి సరిపోదనిపించి వద్దన్నారు రాఘవేంద్రరావు. దాంతో మిగిలిన వాటిల్లోని ‘చిలిపి చిలక ఐ లవ్‌ యు అన్న వేళలో’ అనే పాటని ఎంపిక చేసుకున్నారు. కొంతకాలం తర్వాత బాలీవుడ్‌ దర్శకుడు మహేష్‌ భట్‌.. నాగ్‌ కథానాయకుడుగా తెరకెక్కించిన ‘క్రిమినల్‌’లో ఈ బాణీని వాడుకున్నారు. అలాంటి ఈ గీతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని