SwathiMuthyam Review: రివ్యూ: స్వాతిముత్యం

బెల్లంకొండ గణేశ్‌, వర్ష బొల్లమ్మ నటించిన సరికొత్త చిత్రం ‘స్వాతిముత్యం’ ఎలా ఉందంటే..?

Updated : 05 Oct 2022 09:05 IST

SwathiMuthyam Review చిత్రం: స్వాతిముత్యం; న‌టీన‌టులు: గణేష్, వర్ష బొల్లమ్మ, నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్షవర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద, త‌దితరులు; సంగీతం: మహతి స్వర సాగర్‌; చాయాగ్రహ‌ణం: సూర్య; కూర్పు: నవీన్ నూలి; క‌ళ‌: అవినాష్ కొల్ల; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్; నిర్మాత: సూర్యదేవర నాగవంశీ; రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కె.కృష్ణ; సంస్థ:  సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌; విడుద‌ల‌ తేదీ: 05-10-2022

పండ‌గ సీజ‌న్ అంటే పెద్ద సినిమాల‌కి తోడుగా ఓ చిన్న సినిమా సంద‌డి కూడా చేస్తుంటుంది. ఈ ద‌స‌రాకి కూడా ‘గాడ్‌ఫాద‌ర్‌’, ‘ది ఘోస్ట్‌’ సినిమాల‌కి తోడుగా ఓ చిన్న సినిమా ‘స్వాతిముత్యం’  ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ నుంచి వ‌స్తోన్న ఆ సినిమాతో నిర్మాత బెల్లంకొండ సురేశ్ త‌న‌యుడు బెల్లంకొండ గ‌ణేశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ప్రచార చిత్రాలు ఆక‌ట్టుకోవ‌డంతో ప్రేక్షకుల్లో సినిమా చూడాలనే ఉత్సుక‌త‌ పెరిగింది. మ‌రి ఈ చిత్రం అందుకు త‌గ్గట్టే ఉందో లేదో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..

క‌థేంటంటే: బాలమురళీకృష్ణ అలియాస్ బాల (బెల్లంకొండ గ‌ణేశ్‌) విద్యుత్‌శాఖలో ఉద్యోగి. నిజాయ‌తీకి తోడుగా, కొంచెం అమాయ‌కత్వం ఉన్న కుర్రాడు. పెళ్లి ప్రయ‌త్నాల్లో ఉంటాడు. తల్లిదండ్రుల చాదస్తం కారణంగా పెళ్లి సంబంధం కుదరక ఇబ్బంది పడుతుంటాడు. స్కూల్ టీచర్ అయిన భాగ్యలక్ష్మి (వర్ష బొల్లమ్మ)ని పెళ్లి చూపుల్లో చూడ‌గానే ప్రేమలో పడతాడు. రకరకాల సమస్యలను దాటుకొని వారి ప్రేమ.. పెళ్లీ పీటల వరకు వస్తుంది. మ‌రికొన్ని గంటల్లో పెళ్లి అన‌గా శైలజ (దివ్య శ్రీపాద) అనే యువతి ఓ తొమ్మిది నెలల బిడ్డను తీసుకొచ్చి నీ బాబే అంటూ బాల చేతిలో పెడుతుంది. బాల కూడా త‌న బిడ్డే అని ఒప్పుకుంటాడు. అనూహ్యమైన ఆ ప‌రిణామంతో పెళ్లింట్లో క‌ల‌క‌లం మొద‌ల‌వుతుంది. ఇంత‌కీ ఆ శైలజ ఎవరు?ఆ చిన్నారి నిజంగా బాలాకు పుట్టిన బిడ్డేనా? స్వాతిముత్యంలాంటి బాలా పెళ్లికి ముందే బిడ్డని ఎలా క‌న్నాడు? బాల, భాగ్యలక్ష్మి పెళ్లి జ‌రిగిందా? లేదా? అనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: అమాయ‌కుడైన ఓ యువ‌కుడి పెళ్లి కష్టాల చుట్టూ సాగే హాస్యభ‌రిత‌మైన కుటుంబ క‌థ ఇది. సున్నిత‌మైన స‌రోగ‌సీ అంశాన్ని స్పృశిస్తూ, ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు న‌వ్వించ‌డ‌మే ల‌క్ష్యంగా క‌థ క‌థ‌నాల్ని అల్లుకున్నారు ద‌ర్శకుడు. ఇది తెలిసిన క‌థే. చాలా సినిమాల్లో చూశాం. దాన్నే కొత్తగా చెప్పే ప్రయ‌త్నం చేశారు. అనుభ‌వం ఉన్న తారాగ‌ణం తోడుగా తొలి సినిమాతోనే ద‌ర్శకుడు, క‌థానాయ‌కుడు ప్రేక్షకులు, ప‌రిశ్రమ దృష్టిని ఆక‌ర్షించారు. జీవితంలో తొంద‌ర‌గానే ఉద్యోగం సంపాదించిన బాలమురళీకృష్ణ  పెళ్లి కోసం చేసే ప్రయ‌త్నాల‌తో క‌థ మొద‌ల‌వుతుంది. త‌ల్లిదండ్రుల చాద‌స్తం, హీరో అమాయ‌క‌త్వం, అత‌ని ఆఫీస్‌లో హంగామాతో ప్రథ‌మార్థంలో స‌ర‌దా స‌ర‌దాగా స‌న్నివేశాలు సాగిపోతాయి. పాత్రల ప‌రిచ‌యం వ‌ల్ల తొలి అర‌గంట కాస్త నిదానంగానే సాగుతున్నట్టు అనిపించినా బాలా, భాగ్యలక్ష్మి ప్రేమ క‌థ షురూ అయ్యాక క‌థ వేగం అందుకుంటుంది. ఆ ఇద్దరి మ‌ధ్య స‌న్నివేశాలు కొత్తగా ఉంటాయి. ఇక పెళ్లే అనుకుంటుండ‌గా క‌థ‌లో చోటు చేసుకున్న మ‌లుపు సినిమాని మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చేస్తుంది.  ద్వితీయార్థం సన్నివేశాల్లో  మ‌రింత వేగం క‌నిపిస్తుంది.  చెప్పడానికి క‌థేమీ లేక‌పోయినా, క‌థానాయ‌కుడు పడే పాట్లు, అత‌న్ని కుటుంబ స‌భ్యులు చూసే తీరు మ‌రిన్ని న‌వ్వులు పంచుతుంది. సీనియ‌ర్ న‌టీన‌టుల బ‌లం ఈ సినిమాపై బ‌ల‌మైన ప్రభావం చూపిస్తుంది. ద్వితీయార్థంలో భావోద్వేగాలు కూడా పండాయి. ప‌తాక స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. సాధార‌ణ‌మైన క‌థ‌కి చ‌క్కటి హాస్యం మేళ‌వించి ప్రేక్షకుల్ని  మెప్పించే ప్రయ‌త్నం చేశాడు ద‌ర్శకుడు. స‌రోగ‌సీ చుట్టూ సాగే ఈ సున్నిత‌మైన అంశాన్ని ఇంటిల్లిపాదికీ న‌చ్చేలా తీర్చిదిద్దడం ఈ సినిమాకి బ‌లం.

ఎవ‌రెలా చేశారంటే: బెల్లంకొండ గ‌ణేశ్‌కి తొలి సినిమానే అయినా పాత్రకి తగ్గట్టుగా ఎక్కడా త‌డ‌బాటు లేకుండా న‌టించాడు. పాత్రకి త‌గ్గట్టుగా ఆయ‌న మొహంలో అమాయ‌క‌త్వం బాగా పండింది. కొన్ని స‌న్నివేశాల్లో భావోద్వేగాల్ని కూడా పండించి ప‌రిణ‌తిని ప్రద‌ర్శించారు. క‌థానాయిక వర్ష బొల్లమ్మ  అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో చాలా స‌న్నివేశాలు ఆమె చుట్టూనే న‌డుస్తాయి. పెద్ద మ‌నిషిగా క‌నిపించే గోపరాజు రమణ పాత్ర సినిమాకు హైలెట్‌. ఆయ‌న పాత్ర చుట్టూ అల్లిన హాస్యం బాగా పండింది. ఆ పాత్రతో అంతే బ‌లంగా ప్రభావం చూపించారాయ‌న‌. రావు ర‌మేష్ మేన‌రిజ‌మ్స్ ఆయ‌న పంచిన హాస్యం ఈ సినిమాకి మ‌రో ఆక‌ర్షణ‌. నరేష్‌, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హర్షవర్ధన్, ప్రగ‌తి, సురేఖ‌వాణి త‌దిత‌ర సీనియ‌ర్ న‌టులు సినిమాని మ‌రోస్థాయికి తీసుకెళ్లారు. ప్రతి పాత్రనీ ప‌క్కాగా డిజైన్ చేశారు ద‌ర్శకుడు. సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులే ప‌డ‌తాయి. పాట‌ల కంటే కూడా నేప‌థ్య సంగీతంతో క‌ట్టిప‌డేశారు మహతి స్వర సాగర్. గుర్తు పెట్టుకుని పాడుకునేలా ఒక్క పాట కూడా లేక‌పోవ‌డం సినిమాకి మైన‌స్. సూర్య కెమెరా ప‌నిత‌నం, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ క‌ళా ప్రతిభ సినిమాకి కీల‌కంగా మారింది. ద‌ర్శకుడు ల‌క్ష్మణ్ కె.కృష్ణ చాలా స్పష్టత‌తో సినిమాని తీర్చిదిద్దారు. క‌థ‌ని న‌డిపిన విధానంలో ప‌రిణ‌తి క‌నిపిస్తుంది. నిర్మాణం బాగుంది. ఇలాంటి క‌థ‌ల వెన‌క సితార లాంటి పెద్ద నిర్మాణ సంస్థలు ఉంటే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది.

బ‌లాలు
హాస్యభ‌రిత‌మైన క‌థ‌, మ‌లుపు
న‌టీన‌టులు
ద్వితీయార్ధం

బ‌ల‌హీన‌త‌లు
-  
ప్రథమార్ధంలో కొన్ని స‌న్నివేశాలు

చివ‌రిగా: న‌వ్వులు పంచే.. ‘స్వాతిముత్యం’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని