నాకూ ఇలాంటి భార్య రావాలి!

‘నాకూ శ్రుతిలాంటి భార్య రావాలి...’ అంటూ సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకోవడం నేను చూశా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్‌.

Updated : 05 Apr 2021 11:41 IST

‘నాకూ శ్రుతిలాంటి భార్య రావాలి...’ అంటూ సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకోవడం నేను చూశా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్‌. ‘క్రాక్‌’ చిత్రంలో ఆమె పోషించిన గృహిణి పాత్ర ప్రేక్షకులకి అంత బాగా నచ్చింది మరి. ‘మజిలీ’ చిత్రంలో సమంతని చూసి అలానే అనుకున్నారు సినీ ప్రియులు. ఇలా ఈ మధ్యకాలంలో ప్రేక్షకులపై ప్రభావం చూపిన గృహిణి పాత్రలు, వాటిని పోషించిన నాయికల వివరాలు చూద్దాం..

‘క్రాక్‌’ కల్యాణి..

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘క్రాక్‌’. ఇందులో రవితేజ పోలీసు అధికారి వీరశంకర్‌గా కనిపిస్తే ఆయన భార్య కల్యాణిగా దర్శనమిచ్చింది శ్రుతి హాసన్‌. ఈ పాత్ర సగటు గృహిణికి ప్రతినిధిలా కనిపిస్తుంది. ఒక అమ్మాయికి పెళ్లయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా లక్ష్యాల్ని ఎలా సాధించాలో చాటి చెబుతుంది. అంత అద్భుతంగా ఆమె పాత్రను తీర్చిదిద్దారు దర్శకుడు గోపీ. పవర్‌ఫుల్‌ పోలీసుకు తగ్గ భార్యగా శ్రుతి నటన ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. నాకూ శ్రుతిలాంటి భార్య రావాలని యువకులు కోరుకునేలా చేసింది.

శ్రావణి ‘మజిలీ’..

నాగ చైతన్య కథానాయకుడిగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘మజిలీ’. మనసుని హత్తుకునే ప్రేమకథ ఇది. ఈ సినిమాలో చైతూకి భార్యగా శ్రావణి పాత్రలో ఒదిగిపోయింది సమంత. ఓ అమ్మాయిని ప్రేమించి, ఆమె దూరమైందన్న బాధలో మద్యానికి బానిసవుతాడు హీరో. తప్పని పరిస్థితుల్లో శ్రావణిని పెళ్లి చేసుకుంటాడు. అలాంటి భర్తని అర్థం చేసుకుని, ఎప్పటికైనా మారతాడనే నమ్మకంతో ఉండే భార్యగా సమంత చూపిన అభినయం ప్రశంసలు కురిపించింది. నా జీవితంలోకి శ్రావణిలాంటి అమ్మాయి వస్తే బాగుండు అని చాలామంది బ్యాచ్‌లర్లతో అనిపించింది.

సారా ‘జెర్సీ’..

నాని- గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో సారా అనే గృహిణి పాత్ర పోషించింది శ్రద్ధా శ్రీనాథ్‌. ఉద్యోగం పోగొట్టుకున్న హీరో ఖాళీగా ఉంటూ జీవితాన్ని నెట్టుకొస్తుంటాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయినా సరే అతని ఆర్థిక అవసరాలు తీర్చే భార్యగా నటించి ఆకట్టుకుంది శ్రద్ధా. ఏడేళ్ల అబ్బాయికి తల్లిగా కనిపించి ఔరా అనిపించింది.

సుందరి ‘ఆకాశం’..

సుధా కొంగర- సూర్య కాంబినేషనల్‌ వచ్చిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. డెక్కన్‌ ఎయిర్‌ వేస్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా తెరకెక్కింది. ఇందులో గోపీనాథ్‌ భార్య పాత్రను పోషించింది అపర్ణ బాలమురళి. సామాన్యుడు సైతం విమాన ప్రయాణం చేయాలనే సంకల్పం ఉన్న అతనికి ప్రోత్సాహం అందించి, అతడి గెలుపునకు కారణమవుతుందా పాత్ర. భర్త ఎంత సంపాదించినా.. తన కాళ్లపై తాను నిలబడాలనుకునే వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా నటించి ఆకట్టుకుంది అపర్ణ.

ఇలా అమ్మ, గృహిణి అయినంత మాత్రానో, లేదంటే తెరపై ఆ పాత్రల్లో కనిపించినంత మాత్రానో కెరీర్‌కి వచ్చే ముప్పేమీ లేదని నిరూపించారు. మరికొందరు నాయికలకు స్ఫూర్తినిచ్చారు ఈ నాయికలు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని