Bhala Thandanana: ఉత్కంఠభరితమైన.. ‘భళా తందనాన’

శ్రీవిష్ణు, కేథరీన్‌ జంటగా చైతన్య దంతులూరి తెరకెక్కించిన చిత్రం ‘భళా తందనాన’. సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక

Updated : 04 May 2022 13:56 IST

శ్రీవిష్ణు, కేథరీన్‌ జంటగా చైతన్య దంతులూరి తెరకెక్కించిన చిత్రం ‘భళా తందనాన’. సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు.  దర్శకుడు రాజమౌళి, శేఖర్‌ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంయుక్తంగా బిగ్‌ టికెట్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘తను చిన్న సినిమా చేసినా సరే.. పెద్ద చిత్రం చేస్తున్నాను అన్న ఫీల్‌ కనిపించేలా చేస్తారు చైతన్య. ‘బాణం’లో ఆ యాటిట్యూడ్‌ చూశాను. ఇప్పుడు ‘భళా తందనాన’లోనూ ఆ ఫీల్‌ కనిపిస్తోంది. దీన్నెక్కడా ఆయన ఓ చిన్న చిత్రంలా డీల్‌ చేయలేదు. ప్రతి మూమెంట్‌లోనూ నెక్స్ట్‌ ఏం జరుగుతుంది? అన్న ఉత్కంఠ రేకెత్తించేలా చేశారు. శ్రీవిష్ణు పక్కింటి   కుర్రాడిలా కనిపిస్తాడు. కానీ, చేప నీళ్లలోకి ఎంత ఈజీగా వెళ్లిపోతుందో.. తనంత ఈజీగా మాస్‌ పాత్రలోకి దూరిపోతాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. కేథరీన్‌కు మంచి పాత్ర రాశారు. కచ్చితంగా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘చైతన్య ‘బాణం’ నాకు చాలా ఇష్టమైన చిత్రం. తన నుంచి అలాంటి మంచి సినిమాలు చాలా రావాలి. ట్రైలర్‌ బాగుంది’’ అన్నారు శేఖర్‌ కమ్ముల. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమా ఇంత అద్భుతంగా ఉంటుందని ప్రపంచానికి తెలియజేసింది    రాజమౌళినే. అందుకే ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. నాలాంటి కొత్త వాళ్లని ప్రోత్సహిస్తుంటారు శేఖర్‌ కమ్ముల. మీకు థ్యాంక్స్‌ సర్‌. సినిమాలో ప్రతి ఒక్కరిదీ విభిన్నమైన పాత్రే. ఇంతకు ముందు చేయని విభిన్నమైన పాత్రలు మేమిందులో పోషించాం. చాలా మంచి సినిమా ఇచ్చామని గట్టిగా నమ్ముతున్నామ’’న్నారు. ‘‘ఈ సినిమాకి విత్తనం శ్రీకాంత్‌ విస్సా. ఆయన వల్లే ఈ చిత్రం కార్యరూపం దాల్చింది. శ్రీవిష్ణు అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తాడు. ప్రేక్షకులకు సినిమా చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు దర్శకుడు చైతన్య. కేథరీన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇందులో నా శశిరేఖ పాత్రను  దర్శకుడు చైతన్య ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఇది నా కెరీర్‌లో ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రమా రాజమౌళి, రవివర్మ, రామచంద్రరాజు, సురేష్, శ్రీకాంత్‌ విస్సా తదితరులు పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని