BhanuChander: ఆ విషయంలో రాజమౌళిని తలదన్నేవారు లేరు: భాను చందర్‌

దర్శకధీరుడు రాజమౌళిపై నటుడు భానుచందర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ‘నిరీక్షణ’, ‘ముక్కుపుడక’, ‘కొంటె కోడలు’ వంటి చిత్రాలతో ఆనాడు హీరోగా ప్రేక్షకుల్ని అలరించిన...

Published : 29 May 2022 11:55 IST

హైదరాబాద్‌: దర్శకధీరుడు రాజమౌళిపై నటుడు భానుచందర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ‘నిరీక్షణ’, ‘ముక్కుపుడక’, ‘కొంటె కోడలు’ వంటి చిత్రాలతో గతంలో హీరోగా ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ప్రస్తుతం సహాయనటుడిగా పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముంబయిలో ఉన్న రోజుల్లో నైట్‌ క్లబ్స్‌లో మ్యూజిషియన్‌గా పనిచేశానని, ఆ సమయంలోనే తనకి డ్రగ్స్‌ అలవాటయ్యాయని.. మార్షల్ ఆర్ట్స్‌ వల్లే తాను మాదకద్రవ్యాలకు దూరమయ్యానని తెలిపారు. ఒక మనిషి మానసిక, శారీరక వికాసానికి మార్షల్‌ ఆర్ట్స్‌ ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.

అనంతరం తన సినీ కెరీర్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మా నాన్న సంగీత దర్శకుడు. కెరీర్‌ పరంగా ఆయనకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. దాంతో నేను నటుడు కావాలని మా అమ్మ ఎన్నో కలలు కంది. అలా నేను ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి శిక్షణ తీసుకున్నా. రజనీకాంత్‌ మా సీనియర్‌. ఆనాటి నటీనటులందరికీ ఆయనే స్ఫూర్తి. చిరంజీవి నా జూనియర్‌. మేమిద్దరం ఆరోజుల్లో రూమ్‌ షేర్‌ చేసుకున్నాం. నాకు బైక్‌ నడపడం నేర్పింది కూడా చిరునే’’

‘‘సింహాద్రి’ సినిమా డబ్బింగ్‌ చెబుతున్నప్పుడే నాకర్థమైంది ఆ సినిమా సూపర్‌ హిట్‌ అని. అదే విషయాన్ని రాజమౌళితోనూ చెప్పి.. ‘‘నువ్వు తప్పకుండా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ అవుతావ్‌’’ అన్నాను. ఆయన ఇప్పుడు దేశంలోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమా ప్రమోట్‌ చేయడంలో రాజమౌళి కింగ్‌. ఏ సినిమాని ఎలా ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లాలి అనేది ఆయనకు బాగా తెలిసిన విషయం. సినిమా మార్కెటింగ్‌ విషయంలో ఇక్కడే కాదు.. ఉత్తరాదిలోనూ రాజమౌళిని తలదన్నేవారు లేరు. అందరూ ఆయన నుంచి టెక్నిక్స్‌ నేర్చుకోవాలి’’ అని భానుచందర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని