Tammareddy Bharadwaja: అవార్డులు ఇవ్వట్లేదు.. మినీ థియేటర్లకు ప్రోత్సాహం లేదు

కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వటం ఆపేశాయని ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఆయన స్పందించారు.

Updated : 09 Feb 2022 17:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వటం ఆపేశాయని ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఆయన స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భారీ, తక్కువ బడ్జెట్‌ చిత్రాల వసూళ్ల గురించి మాట్లాడిన అనంతరం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదన్నారు.

‘‘చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి,  తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కి చెప్పాం. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని కోరాం. ఆ పద్ధతి ద్వారానే నిర్మాతలకు లాభాలు వస్తాయి. ‘పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్‌ ధరలు పెంచాలి’ అని చాలామంది అన్నారు. రేట్లు పెంచటం వల్ల ‘అర్జున ఫల్గుణ’ సినిమాకి నష్టం వచ్చింది. ‘బంగార్రాజు’ సినిమా ఏపీలో ఎక్కువ వసూళ్లు రాబట్టింది. తెలంగాణలో పెద్దగా కలెక్ట్‌ చేయలేకపోయింది. సినిమా ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగింది. ఒక్క ఏపీలో టికెట్‌ ధరలు తగ్గించటం వల్ల రెవెన్యూకి లోటు ఉండదు. నిర్మాణానికి సంబంధించి చిత్ర పరిశ్రమలోనూ కొన్ని తప్పులు జరిగాయి. ప్రొడక్షన్స్‌ కాస్ట్‌ కంట్రోల్‌ విషయంలో కాస్త కాంప్రమైజ్‌ అవ్వాలి. అంటే రెమ్యూనరేషన్‌ తగ్గించుకోమని కాదు విలాసానికి అయ్యే ఖర్చు తగ్గించుకోవాలి. చిరంజీవి ఇటీవల ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. మరోసారి ఆయనతో చర్చించబోతున్నారు. ఆయన్ను ఆహ్వానించినపుడు ఆయనే వెళ్తారు కానీ నేనూ వస్తా అని చెప్పలేం కదా. అందరితో కలిసి వెళ్లినా ఆయన ఒక్కరే వెళ్లినా అది ఇండస్ట్రీ కోసమే. గతంలో.. టికెట్‌ ధరల్ని ఇష్టమొచ్చినట్టు పెంచి పన్ను కట్టలేదు. అందుకే ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది’’ అని అన్నారు.

‘‘ఆంధ్రాలో ‘పుష్ప’, ‘అఖండ’ చిత్రాలు మంచి వసూళ్లు రాబట్టాయి. ప్రొడక్షన్‌ ఖర్చుని బట్టి ఆయా సినిమాల్ని ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శిస్తుంటారు. ఇలా చేయటం వల్ల వసూళ్లు పెరుగుతాయి. అందుకే ‘పుష్ప’కంటే ‘అఖండ’ పెద్ద హిట్‌ అయినా తక్కువ కలెక్ట్‌ చేసింది. చాలామంది ‘మా సినిమా రూ. 300 కోట్లు, రూ.400 కోట్లు కలెక్ట్‌ చేసింది’ అని చెప్తున్నారు. వచ్చిన లాభంలో ప్రభుత్వానికి సంబంధిత ట్యాక్స్‌ కడితే వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటుంది. మనమంతా నర్మగర్భంగా కాకుండా ప్రభుత్వంతో సానుకూలంగా చర్చించి సమస్యల్ని పరిష్కరించుకోవాలి. పెద్ద సినిమాలతోపాటు ఎప్పుడూ 5వ షోలో చిన్న సినిమాలని ప్రదర్శిస్తే వాటికి మనుగడ ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డారు.

* గతంలో.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు కమిటీలను ఏర్పాటు చేసి నంది అవార్డులు ఇస్తామని చెప్పాయి కానీ ఇప్పటి వరకూ ప్రకటించలేదు.

* చిన్న సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలి.

* మినీ థియేటర్లను ప్రోత్సహించాలి. అప్పట్లో.. ఏపీలో నాలుగు థియేటర్లని ప్రారంభించారు కానీ అధిక సంఖ్యలో తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. అవి ఉన్నట్లైతే ఇప్పుడు థియేటర్ల కొరత పోయేది. చిన్న, పెద్ద సినిమా అని తేడా లేకుండా రెవెన్యూ పెరిగే అవకాశం ఉండేది. తెలంగాణలోనూ చిన్న థియేటర్లను మొదలుపెట్టాలనుకున్నారు కానీ కార్యరూపం దాల్చలేదు.

* సినీ కార్మికులకి పెద్దగా రెవెన్యూ లేదు. అయినా బిల్లింగ్‌ పేరు చెప్పి జీఎస్టీ కోతలు వేస్తున్నారు. దానికి బదులుగా ఇఎస్‌ఐ, పీఎఫ్‌ వచ్చేలా చేస్తే బాగుంటుంది.

* థియేటర్ల విద్యుత్తు వినియోగాన్ని కమర్షియల్‌ కిందకు రాకుండా చూడాలి. లాక్‌డౌన్‌ సమయంలో థియేటర్లు మూతపడినా మినిమమ్‌ ఛార్జీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కమర్షియల్‌ కేటగిరిలో వాటిని చెల్లించాలంటే చాలా కష్టం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని