Bharateeudu 2: అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్‌ రెండు భాగాలు: శంకర్‌

‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో టీమ్‌ పాల్గొని, సందడి చేసింది.

Updated : 08 Jul 2024 19:07 IST

హైదరాబాద్‌: కమల్‌ హాసన్‌ (Kamal Haasan)- శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో 1996లో వచ్చిన హిట్‌ మూవీ ‘భారతీయుడు’ (Bharateeyudu). దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శంకర్‌, కమల్‌ హాసన్‌, సిద్ధార్థ్‌ (Siddharth), రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), బాబీ సింహా, నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ పాల్గొన్నారు. ప్రెస్‌మీట్‌లోని ముఖ్యాంశాలివీ..

* 1996లో ‘భారతీయుడు’ వచ్చింది. అవినీతి విషయంలో సమాజంలో ఏమైనా మార్పు కనిపించిందా?

కమల్ హాసన్‌: మార్పు వచ్చి ఉంటే ఈ సీక్వెల్‌ తీసే అవసరం లేదు కదా.

* ‘కల్కి 2898 ఏడీ’లో మీ పాత్ర నిడివి తక్కువ. ‘భారతీయుడు 3’లో కంటే ‘భారతీయుడు 2’లో మీ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ తక్కువని తెలుస్తోంది. మీరేమంటారు?

కమల్ హాసన్‌: పాత్ర నిడివిని నేను పట్టించుకోను. శంకర్‌ మాట్లాడుతూ.. పార్ట్‌ 2లో ఆయన క్యారెక్టర్‌ నిడివి తక్కువ అనేది నిజం కాదు. కొన్ని సన్నివేశాల్లో సేనాపతి కళ్లముందు కనిపించకపోయినా ఆయన గురించే చర్చ సాగుతుంది.

* ‘ఆస్కార్‌’పై ఇప్పుడు మీ అభిప్రాయం ఏమైనా మారిందా?

కమల్ హాసన్‌: ఆస్కార్‌ గురించి అభిప్రాయం ఏం లేదు. భారతీయ నటుడిగా ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనేది నా డ్రీమ్‌. ఇది పొగరుతో చెబుతున్న మాట కాదు.

* ‘భారతీయుడు’లో అవినీతి అధికారులను సేనాపతి అంతమొందించాడు. పార్ట్‌ 2లోనూ అలానే వ్యవహరిస్తాడా?

శంకర్‌: ఎక్కడ అన్యాయం జరిగినా భారతీయుడు రావాలనేంతగా ఆ క్యారెక్టర్‌ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. సమాజాన్ని పట్టిపీడించే అవినీతిపై పోరాటం గురించి పార్ట్‌ 1లోనే నేను చెప్పాలనుకుంది చెప్పా. పార్ట్‌ 2ని భిన్నంగా తెరకెక్కించాలనుకున్నా. అందుకే కథ రాసేందుకు చాలా సమయం పట్టింది.

* ‘భారతీయుడు’ సీక్వెల్‌, ‘గేమ్‌ ఛేంజర్‌’ రెండూ ఒకేసారి తెరకెక్కించారు. అది క్వాలిటీపై ప్రభావం చూపుతుందనేది కొందరి అభిప్రాయం. మీరేమంటారు?

శంకర్‌: రెండూ ఒకేసారి తెరకెక్కించినా క్వాలిటీ తగ్గలేదు. లాక్‌డౌన్‌లోనే ‘భారతీయుడు 2’కి సంబంధించి ప్లానింగ్‌ పూర్తయింది. లొకేషన్లు, కాస్ట్యూమ్స్‌.. ఇలా అన్నింటిలోనూ పర్‌ఫెక్ట్‌గా ఉండడంతో చిత్రీకరణ సులువుగా అయిపోయింది. అందుకే సమాంతరంగా ‘గేమ్‌ ఛేంజర్‌’ని తెరకెక్కించగలిగా. ఒక్కో సినిమాని రూపొందించేటప్పుడు ఎలా కష్టపడతానో.. రెండు చిత్రాలు కావడంతో దానికి రెట్టింపు కష్టపడ్డా. దీనిపై కమల్‌ స్పందిస్తూ.. ఒకే సమయంలో దాసరి నారాయణరావు నాలుగైదు కథలు రాసే వారన్న అంశాన్ని గుర్తుచేశారు.

* ‘భారతీయుడు’ పార్ట్‌ 3ని ఎందుకు తీయాలనుకున్నారు?

శంకర్‌: ‘భారతీయుడు’ కథ ఒక రాష్ట్రానికే పరిమితం. సీక్వెల్‌ స్టోరీ ఇండియాలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించింది. పెద్ద కథ అయినప్పటికీ ఎడిటింగ్‌లో మేనేజ్‌ చేసి, ఒకే పార్ట్‌గా తీసుకొచ్చేయొచ్చు అనుకున్నా. కానీ, ఏ సన్నివేశాన్ని తొలగించినా కథకు నష్టం జరిగేలా ఉంది. అందుకే మరో పార్ట్‌ తీసుకొస్తున్నా. కథ డిమాండ్‌ మేరకే తప్ప కావాలని రెండు పార్ట్‌లు చేయలేదు.

* ఒకేసారి రెండు పెద్ద ప్రాజెక్టులు తెరకెక్కిస్తూ ఇంత కూల్‌గా ఎలా ఉండగలుతున్నారు?

శంకర్‌: నదిలో దిగాక ఈదుకుంటూ వెళ్లిపోవడమే (నవ్వుతూ). కమల్‌ స్పందిస్తూ.. ఆయన లోపల ఏసీ ఉందంటూ నవ్వులు పూయించారు.

* సినిమా టికెట్‌ ధరల పెంపునకు అనుమతి  కావాలంటే ఆయా చిత్రాల నటులు డ్రగ్స్‌ కట్టడిపై అవగాహన కల్పించే వీడియో చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌ సూచించారు. నటులుగా మీకు సామాజిక బాధ్యత ఉందా?

సిద్ధార్థ్‌: నేను 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకు తెలుసు. సురక్షిత శృంగారం గురించి నేను అవగాహన కల్పించే ప్రయత్నం చేశా. సంబంధిత హోర్డింగ్స్‌ 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్‌లో కనిపించేవి. అది నా బాధ్యత. ప్రతి నటుడూ సామాజిక బాధ్యత కలిగి ఉంటాడు.

* కమల్‌ హాసన్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?

రకుల్‌ప్రీత్‌ సింగ్‌: శంకర్‌ దర్శకత్వంలో నటించాలని, కమల్‌ హాసన్‌తో కలిసి నటించాలనే నా డ్రీమ్స్‌ ఈ సినిమాతో నెరవేరాయి.

సిద్ధార్థ్‌: ఓ విద్యార్థిగా సేనాపతి (కమల్‌ పోషించిన పాత్ర) నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు