Kamal Haasan: ఈతరం సినిమా ‘భారతీయుడు 2’

భారతీయుడు 2’తో సినీప్రియుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు కమల్‌హాసన్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్‌ ఇండియా సినిమాని శంకర్‌ తెరకెక్కించారు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు ఇది కొనసాగింపు.

Updated : 08 Jul 2024 04:59 IST

భారతీయుడు 2’తో సినీప్రియుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు కమల్‌హాసన్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్‌ ఇండియా సినిమాని శంకర్‌ తెరకెక్కించారు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు ఇది కొనసాగింపు. లైకా ప్రొడక్షన్స్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సిద్ధార్థ్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, బాబీ సింహా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో నన్ను స్టార్‌ని చేసింది తెలుగు చిత్రసీమే. ఇక్కడే ‘మరో చరిత్ర’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’ వంటి విజయాలు దక్కాయి. ‘భారతీయుడు’ విడుదలైనప్పుడు ‘ఇంత ఖరీదైన చిత్రం ఆ స్థాయి వసూళ్లు రాబడుతుందా’ అని విమర్శలు వినిపించేవి. కానీ, అది మేము ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని అందుకొని మెప్పించింది. ‘భారతీయుడు 2’ మనందరి సినిమా. ఇప్పటి తరానికి సరిపోయేలా ఉంటుంది. ఆరేళ్లు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని దీన్ని రెండు భాగాలుగా తీసుకొచ్చాం. ‘భారతీయుడు 2’ని పెద్ద హిట్‌ చేయండి.. ఆ వెంటనే వీలైనంత త్వరగా ‘భారతీయుడు 3’ తీసుకొస్తాం. ప్రస్తుతం దానికి సంబంధించిన నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి’’ అన్నారు.

28ఏళ్ల తర్వాత అదే అనుభూతి

శంకర్‌ మాట్లాడుతూ.. ‘‘భారతీయుడు’ సినిమా విడుదలయ్యాక లంచం తీసుకున్నారన్న వార్తలు చూసినప్పుడల్లా సేనాపతే గుర్తొచ్చేవాడు. ఆ టైమ్‌లో భారతీయుడు మళ్లీ వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వస్తుండేది. ‘రోబో 2.ఓ’ చేసే టైమ్‌లో ఈ ‘భారతీయుడు 2’ కథ తట్టడం.. వెంటనే కమల్‌హాసన్‌తో పంచుకోవడం.. సినిమా పట్టాలెక్కించడం జరిగాయి. ‘భారతీయుడు’ చిత్రీకరణ టైమ్‌లో మేము సేనాపతి పాత్ర లుక్‌ను కమల్‌ తండ్రి, సోదరుల ఫొటొల్ని చూసి సిద్ధం చేశాం. ఆ లుక్‌లో తొలిసారి తనని చూసినప్పుడు నాకైతే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మళ్లీ 28ఏళ్ల తర్వాత ‘భారతీయుడు 2’ కోసం కమల్‌ సర్‌ సేనాపతి లుక్‌తో సెట్‌లోకి వచ్చినప్పుడు అదే అనుభూతి కలిగింది. ఇందులో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌ సింగ్, ఎస్‌.జె.సూర్య, బాబీ, సముద్రఖని, బ్రహ్మానందం తదితరులంతా అద్భుతమైన నటన కనబరిచారు. ఇక నా ‘గేమ్‌ ఛేంజర్‌’ విషయానికొస్తే.. ఇప్పటికే రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన మొత్తం చిత్రీకరణ పూర్తయింది. మరో పది రోజులు చిత్రీకరణ జరిపితే సినిమా సిద్ధమైపోతుంది. త్వరలో దాన్ని పూర్తి చేసి విడుదల తేదీపై స్పష్టత ఇస్తాం’’ అన్నారు. 

‘‘నటుడిగా 20ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నానంటే దానికి కారణం.. నాపై నమ్మకం పెట్టి ‘బాయ్స్‌’తో నన్ను హీరోని చేసిన శంకర్‌ సర్‌. నా అభిమాన హీరో కమల్‌హాసన్‌తో కలిసి నటించాలి.. ఆయనతో ఒకే వేదిక పంచుకోవాలని చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఊహించుకున్నా. ఆ ఊహ ఇప్పుడీ ‘భారతీయుడు 2’తో నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో చర్చించబోయే అంశాలు రేపటి తరానికి గొప్ప పాఠాలుగా మారతాయి’’ అన్నారు సిద్ధార్థ్‌. ‘‘భారతీయుడు 2’లో నటిస్తానని కలలో కూడా ఊహించలేదు. అలాంటిది ఇందులో ఓ చక్కటి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు శంకర్‌కు కృతజ్ఞతలు. కమల్‌ సర్‌తో కలిసి పని చేయాలన్న నా చిన్ననాటి కల ఈ చిత్రంతో నెరవేరింది’’ అంది నటి రకుల్‌ప్రీత్‌. నటుడు బ్రహ్మానందం ఈ వేడుకలో కమల్‌హాసన్‌ గాత్రాన్ని మిమిక్రీ చేసి అందర్నీ అలరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, సునీల్‌ నారంగ్, సుద్దాల అశోక్‌ తేజ, జాహ్నవి, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని