Kamal Haasan: అంతర్జాతీయ అవసరం.. భారతీయుడు 2: కమల్‌హాసన్‌

‘‘సేనాపతి చూపిస్తున్న రెండు వేళ్లల్లో ఒకటి ఓటు వేయడానికైతే... మరొకటి మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి! కేవలం వినోదాన్ని పంచడం  కాదు... సమాజం గురించి ఆలోచింపజేసే ఓ గొప్ప బాధ్యత ఆ పాత్ర, ఈ సినిమా వెనక ఉంది’’ అన్నారు కమల్‌హాసన్‌.

Updated : 09 Jul 2024 04:09 IST

‘‘సేనాపతి చూపిస్తున్న రెండు వేళ్లల్లో ఒకటి ఓటు వేయడానికైతే... మరొకటి మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి! కేవలం వినోదాన్ని పంచడం  కాదు... సమాజం గురించి ఆలోచింపజేసే ఓ గొప్ప బాధ్యత ఆ పాత్ర, ఈ సినిమా వెనక ఉంది’’ అన్నారు కమల్‌హాసన్‌. ఆయన కథానాయకుడిగా, శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు2’. 28 ఏళ్ల కింద ఈ ఇద్దరూ కలిసి చేసిన ‘భారతీయుడు’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందింది. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌ సింగ్, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకర్లతో సమావేశమైంది. అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు.

‘‘నాకు నలభయ్యేళ్ల వయసున్నప్పుడు ‘భారతీయుడు’ చేశా. ఆ చిత్రం బాధ్యత కలిగిన ఓ మనిషిగా ఎదిగేందుకు మానసికంగా ఎంతో దోహదం చేసింది. ఆ వయసులో నేను  అంత పెద్ద మనిషిగా నటించేందుకు ముందుకొచ్చానంటే దర్శకుడి ఆలోచన, చిత్రబృందం అందించిన సహకారమే కారణం. నువ్వు నటుడివనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఎంతో సౌకర్యంగా నటించేలా చేశారు. అందులో చెప్పిన అంశాలు నేటి సమాజాన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఆ సంభాషణలు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఫైట్స్‌ ఉన్నాయా? పాటలు ఉన్నాయా? అని వ్యాపార కోణంలో ఇప్పటికీ  అడుగుతుంటారు పంపిణీదారులు. ఇందులో  అవన్నీ ఉంటాయి. వాటితోపాటు, ప్రతి ఒక్కరూ ఓ ప్రత్యేకమైన ఆలోచనతో బయటికొచ్చే అంశాలూ ఉంటాయి’’.

  • ‘‘సాంకేతికతతో ఎక్కువగా నేర్చుకున్నామే కానీ,  నిజాయతీగా ఉండటాన్ని తక్కువగా నేర్చుకున్నాం. తప్పంతా మీదే అంటూ రాజకీయ యంత్రాంగంపై మనం నింద వేయొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా ఇంకెవరైనా మనం చేసినవాళ్లే  కదా. అవినీతి జరిగిందంటే మనం అవకాశం ఇవ్వడంతోనే. దానికి బాధ్యత కూడా మనదే. మన దగ్గరే కాదు, అంతర్జాతీయంగానూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. జనాభా తరహాలోనే అవినీతి కూడా పెరిగింది. అది తగ్గేందుకు మనవంతుగా మనం ఏమీ చేయలేదు. అందుకే ఈ సినిమా ఓ అంతర్జాతీయ అవసరం అంటాను. ప్రకృతి అందరి అవసరాల్నీ తీరుస్తుంది కానీ, ఒక మనిషి దురాశని నెరవేర్చలేదని గాంధీజీ చెప్పిన అంశం ఈ సందర్భంగా నాకు గుర్తుకొస్తోంది. ఇలాంటి ఎన్నో విషయాల్ని చర్చించే చిత్రమిది.  ఇందులోని సందేశం సమాజానికి చేరువ కావాలి’’.
  • ‘‘నా దర్శకులందరూ  పంచిన ప్రొటీన్స్‌తో నటుడిగా ఇప్పుడు నేను కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నా. చెట్లు  పట్టుకుని ఆడిపాడుతూ, చివర్లో ఏడిపిస్తూ సాగే సినిమాలతో కాకుండా, మరింత బలమైన పాత్రల్ని  ఇస్తున్నారు. నాకు  స్టార్‌డమ్‌ తెలుగు నుంచే వచ్చింది. అప్పటికీ చాలా సినిమాలు చేశా కానీ, సరైన బ్రేక్‌ రాలేదు. ‘మరో చరిత్ర’ నాకు స్టార్‌డమ్‌ని  తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆకలిరాజ్యం, ఇంద్రుడు చంద్రుడు... ఇలా నా తెలుగు రికార్డ్‌ తిరుగులేకుండా సాగింది.  సరైన వ్యక్తుల్ని కలవడంతోనే అలా జరిగింది తప్ప, నేను  అలా ప్లాన్‌ చేశానని చెబితే నా గర్వమే అవుతుంది. చాలా మంది గురువులు నన్ను ఇలా తయారు చేశారు. నాకు డబ్బు ఇచ్చి మరీ నేర్పించారు. నన్ను తన గురువులా భావిస్తుంటాడు సిద్ధార్థ్‌. నేను సభా మర్యాద కోసం చెప్పడం లేదు, తను ఏకలవ్య శిష్యుడే, నేనూ ఏకలవ్య శిష్యుడినే. కానీ తన గురువుకు ఓ పేరు కావాలని కమల్‌ అంటున్నాడంతే’’.

పొగరుతో చెబుతున్న మాట కాదిది..

‘‘ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న సమాజం మనది. అది గుర్తు పెట్టుకుని సినిమాలు చేస్తే అత్యుత్తమ ఫలితాలొస్తాయి. అలా చేస్తున్నామా అంటే లేదనే చెప్పాలి. కానీ మనం చేయగలం. అప్పుడు ఆస్కార్‌ వాళ్లు కూడా వచ్చి పురస్కారాలు ఎలా ఇవ్వాలో మన దగ్గర సలహాలు అడుగుతారు. ఇది నేను  పొగరుతో చెబుతున్న మాట కాదు. నేనొక సినిమాలో ఎంత సేపు కనిపిస్తాననేది సమస్యేకాదు. దాని గురించి ఎప్పుడూ ఆలోచించను.  దర్శకుడిగా చేసినా, నటుడిగానైనా మొత్తం సినిమా గురించే ఆలోచిస్తాను తప్ప, ఒక పాత్ర గురించి కాదు. ‘భారతీయుడు 2’ చేస్తున్నప్పుడు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారా అని ఆలోచించాను తప్ప, నాకు మిగతా సవాళ్లేమీ ఎదురు కాలేదు’’.

అన్ని రాష్ట్రాలతో ముడిపడిన కథ

‘‘ఇప్పటికీ పత్రికలు తిరగేస్తుంటే అవినీతి వార్తలు కనిపిస్తుంటాయి. మళ్లీ భారతీయుడు రావాలి అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. అప్పుడే ‘భారతీయుడు 2’ ఆలోచన వచ్చింది. కానీ మాకు కథాలోచనే రాలేదు. ‘రోబో 2.ఓ’ తీస్తున్నప్పుడు వచ్చిన ఆలోచనతోనే ఈ సినిమా ప్రయాణం మొదలైంది. అవినీతిపై తొలి భాగంలోనే చెప్పాల్సిందంతా చెప్పాం.ఇందులో కొత్తగా ఏం చేయొచ్చో ఆలోచించి చేశాం. ఇది మరో కోణంలో ఉంటుంది. ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలతో ముడిపడిన కథ. మొదట ‘భారతీయుడు 3’ తీయాలనే ఆలోచన లేదు. ఎడిటింగ్‌ చేస్తున్నప్పుడు ప్రతిదీ విలువైనదిగా అనిపించింది. అదే సమయంలో సినిమాకి తగ్గట్టుగా మంచి ఆరంభం, ముగింపు ఈ కథకు కుదిరాయి. అలా ‘భారతీయుడు 3’ కూడా మొదలైంది. ఒకేసారి ‘భారతీయుడు 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’ తీయడం వల్ల నాణ్యత  తగ్గిందేమో అనే అనుమానాలు అవసరం లేదు. పక్కా ప్రణాళికతో రెండు సినిమాల్నీ ఎంతో నాణ్యంగా తెరపైకి తీసుకొచ్చాం. ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదలపై ఫైనల్‌ ఎడిట్‌ పూర్తయిన వెంటనే నిర్ణయం తీసుకుంటాం’’. 

శంకర్‌ (దర్శకుడు)


‘‘భారతీయుడు సినిమా కొనసాగింపులో నేను నటిస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి పాత్ర ఇచ్చిన శంకర్‌కి కృతజ్ఞతలు. కమల్‌హాసన్‌తో పనిచేయడం ఓ కల. అది   నెరవేరడం, సిద్ధార్థ్‌తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది’’.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌


రాబోయే 20 ఏళ్లు ‘భారతీయుడు 2’తోనే! 

‘‘దర్శకుడు శంకర్‌ నన్ను కనిపెట్టి తెరకు పరిచయం చేశారు. అలా ‘బాయ్స్‌’ సినిమాతో తొలి 20 ఏళ్లు గడిపేశా. రాబోయే ఇరవయ్యేళ్లు ‘భారతీయుడు 2’తో గడిపేస్తా. ఈ సినిమా ఓ యాంటీ వైరస్‌లాంటిది. సమాజంలోని అవినీతి వైరస్‌ని తీసేసేందుకు శంకర్‌  అప్డేటెడ్‌ యాంటీ వైరస్‌లా ఈ సినిమాని తీశారు. యువతరం సమాజం కోసం ఏం చేయాలో చెప్పే చిత్రమవుతుంది’’

సిద్ధార్థ్‌


‘‘సామాజిక సందేశం, వినోదం మేళవింపుగా రూపొందే శంకర్‌ సినిమాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ‘జెంటిల్‌మెన్‌’ ప్రభావం ఇప్పటికీ ఉంది. కొన్నేళ్లుగా నేను విద్యాసంస్థలు నడుపుతున్నా. నిబంధనల ప్రకారం, నిజాయతీగా పనులు చేస్తే వచ్చే సంతోషమే వేరు. ఈ సినిమా ట్రైలర్‌ చూసిన వెంటనే శంకర్‌ నంబర్‌ కనుక్కుని సందేశం పెట్టా. కమల్‌ హాసన్‌ సరిహద్దుల్ని చెరిపేస్తూ ముందుకెళుతున్న నటుడు. ఈ సినిమా మాకు కావాలనే మేం ముందుకొచ్చి విడుదల చేస్తున్నాం’’.

డి.సురేశ్‌బాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు