Rakshana: మరో హీరోయిన్‌కు పేరు మార్చిన స్టార్‌ డైరెక్టర్‌..

త్వరలో సినిమాల్లోకి రానున్న ఓ నటికి ప్రముఖ దర్శకుడు భారతిరాజా (Bharathiraja) పేరు మార్చారు. గతంలో కొందరు హీరోయిన్స్‌కు మార్చినట్లు ‘ఆర్‌’ అనే అక్షరంతో మొదలయ్యేలా ‘రక్షణ’ అని పెట్టారు.

Published : 19 May 2023 16:59 IST

హైదరాబాద్‌: నటీనటుల నుంచి సహజమైన నటనను తీయగల దర్శకుల్లో భారతీరాజా (Bharathiraja) ఒకరు. అద్భుతమైన సినిమాలను అందించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. సినిమాల్లోకి వచ్చిన ఎంతో మంది హీరోయిన్స్‌కు ఆయన పేరు మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ పరిశ్రమకు పరిచయం కానున్న ఒక నటికి పేరు మార్చారు. గతంలోనూ కొందరు కొత్త నటీమణులకు ఆయన ‘ఆర్‌’ అనే అక్షరంతో వచ్చేలా పేర్లు పెట్టారు. రాధిక ( Radhika), రాధ, రేవతి, రేఖ.. ఇలా భారతీరాజా పేరు పెట్టిన తారలందరూ స్టార్‌ హీరోయిన్స్‌గా కొనసాగారు.

తాజాగా తమిళ ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమవుతోన్న ఒక నటికి ఆయన ‘రక్షణ’ (Rakshana) అని పేరు పెట్టారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘‘మరగజీ దింగల్‌’ (Maragazi Dingal) అనే సినిమాతో నా కుమారుడు మనోజ్‌ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌ కోసం ఎంతో మందిని ఆడిషన్స్‌ చేశారు. చివరిగా ఈ అమ్మాయి ఎంపికైంది. నేను గతంలో ‘ఆర్‌’ అక్షరంతో పేరు పెట్టిన వారంత ఎన్నో ఏళ్ల పాటు టాప్‌ హీరోయిన్స్‌గా కొనసాగారు. ఈ అమ్మాయి భవిష్యత్తు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఈమెకు కూడా ఆ అక్షరంతో వచ్చేలా ‘రక్షణ’ అని పేరు పెట్టాను’’ అని అన్నారు.

ఇక సినిమాల్లోకి వచ్చాక చాలా మంది తారలు వాళ్ల పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. జయసుధ, జయప్రద, సౌందర్య, రంభ, రోజ, అనుష్క.. ఇలా ఎంతోమంది నటీమణులు వాళ్ల అసలు పేర్లను మార్చుకుని స్క్రీన్‌ నేమ్‌ తోనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని