
Cinema news: పవన్, మహేశ్ సినిమాల విషయంలో జరిగేది అదేనా?
హైదరాబాద్: సినిమా షూటింగ్ మొదలైన రోజే విడుదల తేదీని ప్రకటించి ఆసక్తిని రేకెత్తించాయి పలు భారీ తెలుగు సినిమా ప్రాజెక్టులు. అయితే, అదంతా కరోనాకు ముందు మాట. కరోనా వైరస్ వ్యాప్తితో సమీకరణాలన్నీ మారిపోయాయి. విడుదల చేయటం మాట దేవుడెరుగు.. అసలు షూటింగ్‌లు, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తకావడం లేదు. దీనికి తోడు వీటికన్నా ముందు మొదలైన సినిమాలు షూటింగ్‌లు పూర్తి చేసుకుని, ‘మేము రెడీ’ అంటూ సిద్ధమవుతున్నాయి. దీంతో ఒకదాని తర్వాత ఒకటి వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇటీవల ఒకట్రెండు సినిమాలు సంక్రాంతికి వస్తామని ప్రకటించినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘రాధేశ్యామ్’వంటి పాన్ ఇండియా సినిమాలు వస్తుండటంతో అవి పక్కకు వెళ్లడం దాదాపు ఖాయమని టాలీవుడ్ టాక్.
పవన్‌కల్యాణ్, రానా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్‌గా ఇది రాబోతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే, ఇది ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జనవరిలో పోటీ ఉన్న దృష్ట్యా ‘భీమ్లా నాయక్’ను మార్చిలో సినిమాను విడుదల చేస్తే ఎలా ఉంటుంది? అని చిత్ర బృందం యోచిస్తోందట. అయితే, ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సాగర్ కె.చంద్ర దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇక మహేశ్‌బాబు కథానాయకుడి పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తి సురేశ్ కథానాయిక. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.