Bholaa: చూపులన్నీ ‘భోలా’పైనే

‘దృశ్యం 2’ భారీ విజయంతో జోరు మీదున్నాడు అజయ్‌ దేవ్‌గణ్‌. ఆయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో నటిస్తున్న తాజా యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘భోలా’. ఇది తమిళ చిత్రం ‘ఖైదీ’కి రీమేక్‌. టబు కథానాయిక.

Updated : 03 Jan 2023 12:37 IST

‘దృశ్యం 2’ భారీ విజయంతో జోరు మీదున్నాడు అజయ్‌ దేవ్‌గణ్‌. ఆయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో నటిస్తున్న తాజా యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘భోలా’. ఇది తమిళ చిత్రం ‘ఖైదీ’కి రీమేక్‌. టబు కథానాయిక. అమలా పాల్‌, అభిషేక్‌ బచ్చన్‌ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త ఏడాది సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఈ ఏడాది అందరి చూపూ ‘భోలా’పైనే (Bholaa) ఉంటుంది’ అంటూ దానికి ఓ క్యాప్షన్‌ జోడించింది. ఇందులో తీక్షణమైన చూపులతో కనిపిస్తున్నారు అజయ్‌ దేవ్‌గణ్‌. భూషణ్‌కుమార్‌, కృష్ణకుమార్‌, ఎస్‌.ఆర్‌.ప్రభు, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్నారు. మార్చి 30న ఈ సినిమా త్రీడీ రూపంలో విడుదలవుతోంది.

పదకొండోసారి..

అజయ్‌ దేవ్‌గణ్‌, రోహిత్‌లది బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ కాంబినేషన్‌. ఈ ఇద్దరు కలిసి ఇప్పటికి పది సినిమాలు చేశారు. పదకొండో ప్రాజెక్టుగా ‘సింగం అగెయిన్‌’ పట్టాలెక్కనుంది. అజయ్‌ దేవ్‌గణ్‌ సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు రోహిత్‌తో కలిసి ఉన్న ఫొటోని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ‘సింగం’ ఫ్రాంచైజీలో భాగంగా ఈ మూడో చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిపారు. ‘కొత్త ఏడాదిని శుభప్రదంగా ప్రారంభిస్తున్నా. రోహిత్‌ శెట్టి ‘సింగం అగెయిన్‌’ కథ చెప్పారు. స్క్రిప్టు చాలా బాగుంది. ఇది మా 11వ బ్లాక్‌బస్టర్‌ చిత్రం కానుంది’ అంటూ పేర్కొన్నారు. పోలీసు కథాంశంతో ఈ ఇద్దరి కలయికలో ‘సింగం’, ‘సింగం రిటర్న్స్‌’ గతంలో వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని