Bichagadu 2: నా వల్లే ప్రమాదం జరిగింది.. ఆమె రక్షించింది: విజయ్‌ ఆంటోనీ

తాను చేసిన పొరపాటు వల్లే ‘బిచ్చగాడు 2’ చిత్రీకరణలో ప్రమాదం చోటుచేసుకుందని హీరో విజయ్‌ ఆంటోనీ అన్నారు. ఆ ప్రమాదం నుంచి హీరోయిన్‌ రక్షించిందని తెలిపారు.

Published : 17 May 2023 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2). ఈ సినిమాకి తానే దర్శకత్వం వహించారు. కావ్యా థాపర్‌ కథానాయిక. అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మే 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. యంగ్‌ హీరోలు అడివి శేష్‌ (adivi sesh), ఆకాశ్‌ పూరీ (akash puri) ముఖ్య అతిథులుగా హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకనుద్దేశించి విజయ్‌ మాట్లాడుతూ.. ‘‘అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుందోనని తల్లిదండ్రులు ఎలా మథనపడతారో.. డిస్ట్రిబ్యూటర్లకు సినిమాని ఇచ్చేటప్పుడు దర్శక, నిర్మాతలు అలానే ఫీలవుతారు. ఈ చిత్రం విషయంలో నాకు అలాంటి బాధే లేదు. సరైన వ్యక్తుల్లో ఈ సినిమాని పెట్టాం. ఎడిటింగ్‌, మ్యూజిక్‌, డైరెక్షన్‌.. ఇలా టెక్నికల్‌ వర్క్‌లో బిజీగా ఉండడం వల్ల తెలుగు నేర్చులేకపోయా. భవిష్యత్తులో తప్పకుండా తెలుగులో మాట్లాడతా. ఈ సినిమాకి సంబంధించిన పనులన్నింటినీ గేయ రచయిత భాష్యశ్రీ చూసుకునేవారు. హీరోయిన్‌ కావ్యా థాపర్ ప్రమాదం నుంచి నన్ను రక్షించింది. నేను చేసిన పొరపాటు వల్లే చిత్రీకరణలో ప్రమాదం జరిగింది. ‘బిచ్చగాడు’ చూసిన మిమ్మల్ని పార్ట్‌ 2 నిరాశపరచదు’’ అని విజయ్‌ ఆంటోనీ ప్రేక్షకులకు హామీ ఇచ్చారు. అడివి శేష్‌ నటించిన ‘గూఢచారి’ సినిమాని తాను చూశానని, అలాంటి సినిమాలో నటించడమేకాకుండా కథను స్వయంగా రాయడం కష్టమన్నారు. ఆకాశ్‌ పూరీ నటించిన సినిమా చూశానని, అది బాగా ఆకట్టుకుందన్నారు.

బోటు ప్రమాదం.. దవడ భాగంలో తొమ్మిది ప్లేట్లు వేశారు

‘‘నా సినిమా కథలను నేనే రాసుకుంటున్నాననే గర్వంగా ఫీలయ్యేవాణ్ని. కానీ, విజయ్‌ ఆంటోనీగారు దర్శకత్వం, ఎడిటింగ్‌, సంగీతం.. ఇలా సినిమాకి సంబంధించి చాలా బాధ్యతలు నిర్వహిస్తారు. ఆయన్ను చూసి చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. ‘బిచ్చగాడు’ సినిమాలోని పుదుచ్చేరి కారు సన్నివేశం నాకు బాగా ఇష్టం. ‘బిచ్చగాడు 2’లో విమానాల గురించి చర్చించారేమో’’ అని అడివి శేష్‌ పేర్కొన్నారు. ‘‘బిచ్చగాడు’ సినిమా విడుదలైన సమయంలో ఆ టైటిల్‌ చూసి ఆశ్చర్యపోయా. చిన్న సినిమాల బృందాలకు ఆ చిత్రం ధైర్యాన్నిచ్చింది. విజయ్‌ ఆంటోనీ సర్‌ అంటే నాకు గౌవరం. ‘బిచ్చగాడు 2’ విజయ్‌గారి కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని ఆకాశ్‌ పూరీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని