Amitabh Bachchan: హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో అమితాబ్‌.. నెట్టింట ఫొటో చక్కర్లు

తన తదుపరి చిత్రం షూట్‌లో భాగంగా అగ్ర కథానాయకుడు, బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లోనే (Hyderabad) ఉంటోన్న సంగతి తెలిసిందే. ఇందులో....

Published : 30 Jun 2022 10:51 IST

హైదరాబాద్‌: తన తదుపరి చిత్రం షూట్‌లో భాగంగా అగ్ర కథానాయకుడు, బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లోనే (Hyderabad) ఉంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం ఆయన రాయదుర్గం మెట్రోస్టేషన్‌లో సందడి చేశారు. ట్రైన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ కోసం స్టేషన్‌కు వెళ్లిన ఆయన్ను చూసేందుకు పలువురు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో షేర్‌ చేసిన ఓ నెటిజన్‌.. సాధారణంగా రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో మెట్రో స్టేషన్‌ మొత్తం ఖాళీగా, కేవలం కెమెరామెన్స్, ఇతర చిత్రబృందంతోనే కనిపించిందని రాసుకొచ్చారు.

అమితాబ్‌ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) కోసం వర్క్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నాగ్‌అశ్విన్‌(Nag Ashwin) దర్శకుడు. వైజయంతి మూవీస్‌ పతాకంపై ఈ సినిమా సిద్ధమవుతోంది. దీపికా పదుకొణె(Deepika Padukone) కథానాయిక. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా షూట్‌ హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

అమితాబ్‌-ప్రభాస్‌@ఆఫీస్‌ ఓపెనింగ్‌

‘వైజయంతి మూవీస్‌’ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవం ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన సంగతి తెలిసిందే. కార్యాలయ ప్రారంభోత్సవంలో రాఘవేంద్రరావు, అమితాబ్‌ బచ్చన్‌, ప్రశాంత్‌నీల్‌, ప్రభాస్‌, నాని, దుల్కర్‌ సల్మాన్‌ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో కొన్నిరోజుల క్రితం నెట్టింట చక్కర్లు కొట్టగా.. తాజాగా ఓ వీడియోని వైజయంతి మూవీస్‌ షేర్‌ చేసింది. అమితాబ్‌, ప్రభాస్‌.. రిబ్బన్‌ కట్‌ చేసి కార్యాలయాన్ని ప్రారంభించడం.. ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ఆనాటి ఫొటోలను అమితాబ్‌ ఆసక్తిగా తిలకించడం.. యువ నటులు, దర్శకులతో బిగ్‌బి సరదాగా ముచ్చటించడం.. ఇలాంటి ఎన్నో విశేషాలతో ఈ వీడియో రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని