Updated : 22 Feb 2021 14:25 IST

బిగ్‌బాస్‌ 14 విజేత రుబీనా.. ఈ విషయాలు తెలుసా?

బిగ్‌బాస్‌ 14 (హిందీ) విజేత ఎవరా? అనే ఉత్కంఠకు తెరపడింది. బిగ్‌ బాస్‌ ఇచ్చిన టాస్కులు పూర్తిచేసి, తనదైన శైలితో ఎంతోమంది హృదయాల్ని గెలుచుకున్న రుబీనా దిలాయిక్‌ విన్నర్‌గా నిలిచారు.  తన భర్త, కో కంటెస్టంట్‌ అభినవ్‌ ముందు రుబీనా ట్రోఫీ అందుకోవడం విశేషం. 2020 అక్టోబరు 3న ప్రారంభమైన ఈ కార్యక్రమం 2021 ఫిబ్రవరి 21న ముగిసింది. ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ఫినాలే ఆదివారం ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. రాహుల్‌ వైద్య రన్నరప్‌గా నిలిచారు. తన హావభావాలతో అలరించి కొన్ని కోట్ల మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న రుబీనా గురించి తెలుసుకుందాం

మిస్‌ సిమ్లా...

1987 ఆగస్టు 26న సిమ్లాలో జన్మించారు. విద్యాభ్యాసం అక్కడే పూర్తిచేశారు. టీనేజ్‌లో ఉన్నప్పుడు స్థానికంగా నిర్వహించే అందాల పోటీల్లో పాల్గొనేవారు. అదే ఉత్సాహంతో 2006 మిస్‌ సిమ్లా కిరీటం అందుకున్నారు. 2008లో చండీగఢ్‌లో నిర్వహించిన మిస్‌ నార్త్‌ ఇండియా పోటీల్లో అవార్డు అందుకున్నారు. చదువులోనూ చురుకుగా ఉండేవారు రుబీనా. పాఠశాల రోజుల్లో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ డిబేట్‌లో విజేతగా నిలిచారు. 2016లో ఈస్ట్రన్‌ ఐ- 50 సెక్సియస్ట్‌ ఏషియన్‌ ఉమెన్‌ జాబితాలో 11వ స్థానంలో నిలిచారు.

నటిగా..

* జీ టీవీలో(2008) ప్రసారమైన ‘చోటి బహు’ ధారావాహికతో నటిగా తెరంగ్రేటం చేశారామె.

* తొలి పరిచయంలోనే తన సహజమైన నటనతో బుల్లితెర వీక్షకుల్ని ఆకట్టుకున్నారు. అలా ఆ సీరియల్‌ సెకండ్‌ సీజన్‌లోనూ అవకాశం దక్కించుకున్నారు.

* పాత్ర ఏదైనా ప్రతిభ చూపుతూ ఇతర టెలివిజన్లు ప్రసారం చేసే  ధారావాహికల్లో నటించారు రుబీనా.

* ప్రస్తుతం కలర్స్‌ టీవీలో ప్రసారమవుతోన్న ‘శక్తి’లో నటిస్తున్నారు. ‘బరేలే కీ బేటీ’ అనే లఘు చిత్రంలోనూ సందడి చేశారు.

* ‘శక్తి’లో ఆమె పోషించిన ‘సౌమ్య’ పాత్ర రుబీనాకు ఎంతో పేరు తెచ్చింది.

* ఆ పాత్రతోనే ‘బిగ్‌బాస్‌’ 10, 11, 12, 13 సీజన్‌లలో ముఖ్య అతిథిగా షోలో అలరించింది.

* బిగ్‌బాస్‌ సీజన్‌-14లో కంటెస్టెంట్‌గా వెళ్లి, విజయం సాధించింది.

* ‘శక్తి’లో నటనకు గానూ ఉత్తమ నటి(జ్యూరీ)గా ఇండియన్‌ టెలివిజన్‌ అకాడమీ అవార్డు అందుకుంది.

* మోస్ట్‌ ఫిట్‌ యాక్టరెస్‌గా 2017 గోల్డ్‌ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

2018లో మోడల్‌, నటుడు అభినవ్‌ శుక్లతో రుబీనా వివాహం జరిగింది. బిగ్‌బాస్‌ 14లో అభినవ్‌ కూడా మెరిశారు. కొన్ని రోజుల తర్వాత షో నుంచి బయటకు వచ్చేశారు. 2009లో మిస్టర్‌ పంజాబ్‌గా నిలిచారు.

‘ఈ క్షణం ఎంతో ఆనందంగా ఉంది. విజేతగా ఇక్కడ నిలబడాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. నా కల నెరవేరింది. ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఈ జర్నీలో నన్ను నేను కనుగొన్నాను. అనుకున్నది సాధించినందుకు గర్వంగా ఉంది. నా భర్త సహకారం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’ అని విజేతగా నిలిచిన తర్వాత రుబీనా మనసులో మాటలివి. సామాజిక మాధ్యమాల వేదికగా బాలీవుడ్‌ సినీ ప్రముఖులు రుబీనాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

అభిమానగణం

ఇన్‌స్టాగ్రామ్‌లో రుబీనాను అనుసరిస్తున్న వారు: 3.6మిలియన్‌కి పైగానే. ట్విటర్‌ ఫాలోవర్స్‌: 2,35,518 (ఫిబ్రవరి 22 నాటికి).

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts