Updated : 31 Oct 2021 09:40 IST

Bigg Boss 5: రవి.. వెళ్తానంటే వెళ్లిపో! సన్నీ.. ఇది కరెక్ట్‌ కాదు..! హౌస్‌లో పాములు వీళ్లే!

ఇంటర్నెట్‌డెస్క్‌: రోజూ టాస్క్‌లతో, ఇంటి సభ్యుల వాగ్వాదంతో హాట్‌హాట్‌గా నడిచే ‘బిగ్‌బాస్‌’(Bigg boss) షో వారంతంలో నాగార్జున(Nagarjuna) పెట్టే పంచాయతీలు, ఇచ్చే తీర్పులతో మరింత ఉత్కంఠగా సాగుతుంది. గత వారం టాస్క్‌ల సందర్భంగా జరిగిన రచ్చకు శనివారం నాగార్జున చర్చ పెట్టారు. అంతకు ముందు వరెస్ట్‌ పెర్ఫార్మర్‌గా ఎంపికైన సన్నీ(sunny) జైలుకు వెళ్లాడు. కెప్టెన్సీ టాస్క్‌ సందర్భంగా సంచాలక్‌ వివాదంపై సన్నీ, మానస్‌(manas) మాట్లాడుకున్నారు. హౌస్‌లోని వాళ్లందరూ చాలా బాగా నటిస్తున్నారని అనుకున్నారు. ‘సంచాలక్‌ తప్పు నిర్ణయం తీసుకుంటే నువ్వెందుకు మాట్లాడలేదు’ అంటూ రవి(ravi)ని మానస్‌ అడిగాడు. తాను కెప్టెన్‌ అవ్వడం ఎవరికీ నచ్చలేదని రవి దగ్గర షణ్ముఖ్(shanmukh) వాపోయాడు. తన కెప్టెన్సీలో ఎవరినీ హర్ట్‌ చేయనని చెప్పుకొచ్చాడు.

పూరి పొంగలేదు.. మాటల బాంబు పేలింది..

ఉదయం ఇంటి సభ్యులు నిద్రలేవగానే బిగ్‌బాస్‌ పూరి టాస్క్‌ ఇచ్చాడు. ఎవరైతే సరిగ్గా 50 పూరీలు చేస్తారో వారు విజయం సాధించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో కాజల్‌(kajal), సిరి, మానస్‌ గ్రూప్‌ 50 పూరీలు త్వరగా చేసినా అందులో కొన్ని నూనెలో సరిగా వేగలేదు. అదే సమయంలో అనీ, శ్రీరామ్‌(sriram), విశ్వ, లోబోల, రవి టీమ్‌ 50 పూరీలను సిద్ధం చేయగా, ఈ టీమ్‌ గెలిచినట్లు కెప్టెన్‌ షణ్ముఖ్‌ ప్రకటించాడు. ఈ గేమ్‌తో సంబంధం లేకుండా జైలులో ఉన్న సన్నీ ‘వాళ్లు కష్టపడి చేశారు. ఒకసారి రూల్‌బుక్‌ చదివి నిర్ణయం చెబితే బాగుండు’ అనేసరికి అనీ మాస్టార్‌(anee master) వెక్కిరింతగా మాట్లాడుతూ... ‘సన్నీ మాట్లాడటానికి బుద్ధి ఉండాలి’ అని అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత హౌస్‌ మొత్తం గ్రూప్‌లుగా విడిపోయి ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. పూరీ కోసం ఇలా కూడా గొడవ పడతారా? అన్నంత రచ్చ చేశారు.

రవి ఇంటి నుంచి వెళ్లిపోతావా?

నాగార్జున వచ్చి లెటర్స్‌ వదులుకున్న ఇంటి సభ్యులను అభినందించారు. ‘ఇంట్లో వాళ్ల గురించి నాకు ఏమీ తెలియడం లేదు. ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా. నన్ను బయటకు పంపండి’ అని రవి అన్న మాటల వీడియోను ప్లే చేసిన నాగార్జున ‘ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతావా’ అని అడిగారు. తాను కావాలని అలా అనలేదని, ఆ సమయంలో అలా అనిపించిందని రవి వివరణ ఇచ్చుకున్నాడు. ‘ఇది బిగ్‌బాస్‌సీజన్‌-5. ఇప్పటివరకూ అన్నీ చూసి ఉంటావు. నీకోసం రూల్స్‌ మార్చరు కదా’ అంటూ నాగార్జున చురకలు అంటించారు. టైమ్‌ దొరికినప్పుడు ఇంట్లో వాళ్లు తనకు అన్యాయం చేస్తున్నారని మానస్‌.. నాగార్జున ఎదుట వాపోయాడు. కెప్టెన్సీ టాస్క్‌ సందర్భంగా చివరి వరకూ ఆడకుండా ఎందుకు వచ్చేశారని అనీ మాస్టర్‌ను నాగార్జున ప్రశ్నించారు. గ్రూప్స్‌గా ఆడుతున్నారని, దాన్ని తాను తీసుకోలేకపోయానని అనీ మాస్టార్‌ వాపోయింది. సంచాలక్‌గా తికమక పడుతున్న జెస్సీ(jaswanth)కి సైతం నాగార్జున క్లాస్‌ తీసుకున్నారు.

సన్నీ నీ పద్ధతి మార్చుకో..!

టాస్క్‌ల సందర్భంగా ఆగ్రహానికి గురై, ఇంటి సభ్యుల మీద అరుస్తున్న సన్నీ(sunny)కి ఓ రేంజ్‌లో క్లాస్‌ తీసుకున్నారు నాగార్జున(nagarjuna). అరవటం, తనవాదన వినిపించుకోవటం తప్పు కాదని, అదే సమయంలో వేలు చూపిస్తూ, హౌస్‌మేట్స్‌ మీదకు వెళ్లడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. పూరి టాస్క్‌ సందర్భంగా నార్త్‌ ఇండియన్‌ పదాన్ని ఎందుకు వాడావని మండిపడ్డారు. ఎవరినైనా అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని పేర్కొన్నారు. సంచాలక్‌ పట్టుకున్న సంచిని ఎందుకు తన్నావ్‌? అని ప్రశ్నించారు. తన వ్యవహారశైలి పట్ల సన్నీ క్షమాపణ కోరాడు. భవిష్యత్‌లో అలా జరగకుండా చూసుకుంటానని అన్నాడు. సన్నీనే తనని దూరం పెట్టాడని అనీ మాస్టార్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

హౌస్‌లో నిచ్చెనలు.. పాములు వీళ్లే!

వైకుంఠ పాళీ ఆటలో ఉండే నిచ్చెనలు, పాములతో ఏ ఇంటి సభ్యుడు ఎవరిని పోలుస్తారు? అని నాగార్జున ప్రశ్నించగా, తొలుత కాజల్ సమాధానం ఇచ్చింది. మానస్‌ నిచ్చెన అని, శ్రీరామ్‌ పాము అని చెప్పింది. రవి.. షణ్ముఖ్‌(నిచ్చెన), కాజల్‌(పాము), జెస్సీ.. విశ్వ(నిచ్చెన), సన్నీ(పాము), ప్రియాంక(Priyanka).. మానస్‌(నిచ్చెన), లోబో(పాము), సన్నీ.. మానస్‌(నిచ్చెన), షణ్ముఖ్‌(పాము), విశ్వ(viswa).. లోబో(నిచ్చెన), కాజల్‌(పాము), లోబో(Lobo).. రవి(నిచ్చెన), సన్నీ(పాము), శ్రీరామ్‌.. అనీ మాస్టర్‌(నిచ్చెన), కాజల్‌(పాము), అనీ మాస్టర్‌.. రవి(నిచ్చెన), కాజల్‌(పాము), మానస్‌.. సన్నీ(నిచ్చెన), రవి(పాము), షణ్ముఖ్‌.. సిరి(నిచ్చెన), రవి(పాము), సిరి.. షణ్ముఖ్‌(నిచ్చెన), సన్నీ(పాము)లను ఎంపిక చేసుకుని, అందుకు తగిన కారణాలు చెప్పారు. అత్యధిక మంది కాజల్‌ను పాము అన్నారు.

మెడలో మోత.. సరిపోయే సామెత..

హౌస్‌మేట్స్‌కు సరిపోయే సామెతెలు ఏంటో చెప్పాలని నాగార్జున సూచించారు. దీంతో ఒక్కో హౌస్‌మేట్‌ ఒక్కో సామెత ఉన్న బోర్డును తీసుకుని ఇంటి  సభ్యుల మెడలో వేశారు. సన్నీ ‘కుక్కతోక వంకర’ సామెతను జెస్సీకి ఇచ్చాడు.  ‘అబద్ధం ఆడినా అతికినట్టు ఉంటుంది’ సామెతను రవికి ఇచ్చాడు మానస్‌. ఇక కాజల్‌(kajal) ‘ఏమీ లేని ఆకు ఎగిరెగెరి పడుతుంది’ అంటూ శ్రీరామ్‌ మెడలో బోర్డు వేసింది. మొదట్లో సరిగా ఆడిందని, రెండు వారాల నుంచి ఆడటం లేదని అనీ మాస్టర్‌ ‘రాను రాను రాజు గుర్రం గాడిద అయింది’ సామెను కాజల్‌కు ఇచ్చింది. ‘కందకు లేని దురద కత్తి ఎందుకు’ సామెతను సిరి(siri) మెడలో వేసింది ప్రియాంక. ‘అంతంత కోడికి అర్ధశేరు మసాలా’ సామెత బోర్డును కాజల్‌ మెడలో శ్రీరామ్‌(sriram) వేశాడు. ‘దున్నపోతు మీద వర్షం కురిసినట్టు’ సామెతను లోబో మెడలో వేశాడు విశ్వ(Viswa). ఇక ‘పైన పటారం లోన లొటారం’ బోర్డును సన్నీకి ఇచ్చాడు జెస్సీ. సిరి ‘అందని ద్రాక్షపళ్లు పుల్లన’ సామెతను షణ్ముక్‌(shanmukh)కు ఇచ్చింది. ‘ఏకులా వచ్చి మేకులా తగులుకున్నాడు’ అనే సామెతను రవికి ఇచ్చాడు షణ్ముఖ్‌. ‘ఓడ ఎక్కేవరకూ ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న’ సామెతను మానస్‌(Manas)కు ఇచ్చాడు రవి. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం’ సామెతను అనీ మాస్టర్‌కు ఇచ్చాడు లోబో(Lobo). ఇక ఈ వారం హౌస్‌ నుంచి ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? ఎవరు సేవ్‌ అవుతారో చూడాలి. అంతేకాదు, బిగ్‌బాస్‌ హౌస్‌లో దీపావళి ముందే స్టార్ట్‌ అయింది. ప్రత్యేక కార్యక్రమాలను సిద్ధం చేశారు. ఆదివారం హౌస్‌లో వినోదాల పటాకులు పేలనున్నాయి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని