Bigg boss 5: యూజ్‌ అండ్‌ త్రో బ్యాచ్‌ ఉన్నారిక్కడ.. అదరగొట్టిన సన్నీ, కాజల్‌, శ్రీరామ్‌

హాట్‌సీట్‌లో కూర్చొని నవ్వకుండా ఉన్నవాళ్లకు ఓటు అప్పీల్‌ చేసుకునే అవకాశం లభిస్తుందని బిగ్‌బాస్‌(Bigg boss) టాస్క్‌ ఇచ్చిన

Published : 10 Dec 2021 06:06 IST

హైదరాబాద్‌: హాట్‌సీట్‌లో కూర్చొని నవ్వకుండా ఉన్నవాళ్లకు ఓటు అప్పీల్‌ చేసుకునే అవకాశం లభిస్తుందని బిగ్‌బాస్‌(Bigg boss) టాస్క్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌లో మానస్‌, శ్రీరామ్‌ విజేతలుగా నిలిచారు. ఈ క్రమంలో హౌస్‌కాల్‌ తీసుకోవాల్సి ఉండగా, ‘శ్రీరామ్‌కు ఇప్పటికే ఫినాలే టికెట్‌ లభించింది. మానస్‌కు అవకాశం ఇస్తే బాగుంటుంది’ అని ఇంటి సభ్యులు అభిప్రాయపడ్డారు. మానస్‌కు ఎందుకు అవకాశం ఇవ్వాలో చెప్పాలని శ్రీరామ్ అడిగాడు. ఈ క్రమంలో హౌస్‌కాల్‌ తీసుకుందామంటూ కాజల్‌ ప్రతిపాదించడం వాగ్వాదానికి దారి తీసింది. దీనిపై శ్రీరామ్‌, కాజల్‌ గొడపడ్డారు. చివరకు మానస్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకూ తనకు ఓటు వేసిన ప్రేక్షకులకు మానస్‌ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే గ్రాండ్‌ ఫినాలేకు తీసుకెళ్లాలని, అందుకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశాడు. తనతో పాటు తన స్నేహితులైన సన్నీ, కాజల్‌కు కూడా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశాడు.

ఆ తర్వాత శ్రీరామ్‌, కాజల్‌ మధ్య గొడవ ఇంకొంతసేపు జరిగింది. ఈ క్రమంలో ‘నువ్వు అలా చెప్పొద్దు బ్రదర్‌’ అని కాజల్‌ పిలవడంతో ‘ఎవరు నీకు బ్రదర్‌ లైట్‌ తీసుకో’ అని అనడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. ‘నువ్వు అనవసరంగా మాట్లాడావు. కొంచెం సేపు మాట్లాడకుండా ఉండు’ అని మానస్‌, సన్నీలు కాజల్‌కు సలహా ఇచ్చారు. ఆ తర్వాత కిచెన్‌లో భోజనం చేస్తున్న శ్రీరామ్‌ దగ్గరకు వెళ్లిన సన్నీ ‘కాజల్‌తో మాట్లాడవచ్చు కదా. మానస్‌కు ఫేవర్‌ చేద్దామని అలా అన్నది. అంతేతప్ప ఆమెకు వేరే ఉద్దేశం లేదు’ అని శ్రీరామ్‌కు సన్నీ సలహా ఇచ్చాడు. అయినా కూడా కాజల్‌తో మాట్లాడేందుకు శ్రీరామ్‌ అంగీకరించలేదు.

నేనూ సిరి టాప్‌-5లో ఉంటా: షణ్ముఖ్‌

టాప్‌-5లో ఎవరు ఉంటారు? అని గార్డెన్‌ ఏరియాలో కూర్చొన్న షణ్ముఖ్‌ను శ్రీరామ్‌ అడగ్గా, ‘వేరే వాళ్ల సంగతి నాకు తెలియదు. నేను, సిరి ఉంటాం’ అని సమాధానం ఇచ్చాడు. ఫ్రెండ్స్‌కు ఇవ్వకుండా ఓటు అడిగే అవకాశం మానస్‌ తనకు ఎలా ఇచ్చాడా? అని శ్రీరామ్‌తో షణ్ముఖ్‌ అన్నాడు. ప్రియాంక వెళ్లిపోయిన తర్వాత అతను అందరితో కలుస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ‘అనాల్సినవన్నీ అనేసి ఆ తర్వాత ఏదైనా అంటే కాజల్‌ ఏడుస్తుంది’ అని శ్రీరామ్‌ చెప్పుకొచ్చాడు. మరోవైపు కిచెన్‌లో కూర్చొన్న సన్నీ, మానస్‌ మాట్లాడుకుంటూ ‘టాప్‌-6 ర్యాంకులు ఇచ్చినప్పుడు చెప్పిన కారణాలు నాకు నచ్చలేదు’ అని మానస్‌ అనగా, ‘గెలిచిన, ఓడినా వీళ్లు నిజాయతీగా ఆడారన్న పేరు వస్తే చాలు. వీళ్ల గురించి ఆలోచించకు’ సన్నీ అన్నాడు. కాళ్లకు గాయాలు అయి, ఇబ్బంది పడిన శ్రీరామ్‌కు వేళకు మందులు ఇచ్చి సపర్యలు చేసిన కృతజ్ఞత కూడా లేకుండా శ్రీరామ్‌ ప్రవర్తించాడని, హౌస్‌లో యూజ్‌ అండ్‌ త్రో బ్యాచ్‌ ఎక్కువగా ఉంది అంటూ మానస్‌ అభిప్రాయపడ్డాడు.

అదరగొట్టిన సన్నీ, కాజల్, శ్రీరామ్‌

తర్వాతి టాస్క్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌కు సినిమా స్టార్స్‌ క్యారెక్టర్స్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. సమయానుసారంగా ఆయా స్టార్‌ పాట వచ్చినప్పుడు గార్డెన్‌ ఏరియాలో ఉన్న స్టేజ్‌పై డ్యాన్స్‌ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ సూచించాడు. ఈ క్రమంలో బాలకృష్ణగా సన్నీ, చిరంజీవిగా శ్రీరామ్‌, శ్రీదేవిగా కాజల్, సూర్యగా షణ్ముఖ్‌, పవన్‌కల్యాణ్‌గా మానస్‌, జెనీలియా పాత్రను సిరికి ఇచ్చాడు. దీంతో ఆయా స్టార్‌ల పాటలు వచ్చినప్పుడు హౌస్‌మేట్స్ అందరూ తమదైన శైలిలో డ్యాన్స్‌ చేసి అదరగొట్టారు. ఇక ఖాళీ సమయంలో స్టార్స్‌వాయిస్‌తో మాట్లాడుకుంటూ అలరించారు. బాలకృష్ణగా సన్నీ, శ్రీదేవిగా కాజల్, చిరంజీవిగా శ్రీరామ్‌ ఎక్కువసేపు వారి పాత్రల్లో మాట్లాడుతూ నవ్వులు పంచారు.

మళ్లీ సిరి, షణ్ముఖ్‌ గిల్లికజ్జాలు

ఇక ఈ టాస్క్‌ రెండో లెవల్‌లో భాగంగా ఇంటి సభ్యులు మీ పాత్రలు పోషిస్తూ ఒక స్కిట్‌ చేయాల్సి ఉంటుందని బిగ్‌ బాస్‌ ఆదేశించాడు. ‘నాకు స్కిట్స్‌ రావు. మీరంతా ఒక బ్యాచ్‌ బ్రో’ అంటూ షణ్ముఖ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో సిరి అతడిని బతిమలాడేందుకు ప్రయత్నించింది. ‘నాతో కూర్చొని ఉంటే మూడ్ ఆఫ్‌లో ఉంటావు. అందుకనే అక్కడకు వెళ్లు. చాలా సంతోషంగా ఉంటావు’ అంటూ సిరిని సతాయించడం మొదలు పెట్టాడు. ‘నీతో కలవలేకపోతున్నాను. అక్కడ నువ్వు బెటర్‌ పర్సన్‌’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత స్కిట్‌ చేసేందుకు షణ్ముఖ్‌ ఒప్పుకొన్నా, సిరి కోపంతో అక్కడి నుంచి వెళ్లి బాత్రూమ్‌లో కూర్చొని ఏడ్వటం మొదలు పెట్టింది. అక్కడకు వెళ్లిన షణ్ముఖ్‌ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. చివరికు ఇద్దరూ నవ్వుకుంటూ గేమ్‌ ఆడటానికి వచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని