Bimbisara review: రివ్యూ: బింబిసార

Bimbisara movie review: కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన ‘బింబిసార’ ఎలా ఉందంటే?

Updated : 05 Aug 2022 14:40 IST

Bimbisara movie review: చిత్రం: బింబిసార‌; న‌టీన‌టులు: నంద‌మూరి క‌ల్యాణ్ రామ్, కేథ‌రిన్‌, సంయుక్తా మేన‌న్‌, వివాన్ భ‌టేనా, ప్ర‌కాష్ రాజ్, త‌నికెళ్ల భ‌ర‌ణి, అయ్య‌ప్ప శ‌ర్మ‌, శ్రీనివాస్ రెడ్డి, వ‌రీనా హుస్సేన్ త‌దిత‌రులు; సంగీతం: చిరంత‌న్ భ‌ట్‌, ఎం.ఎం.కీర‌వాణి; మాట‌లు: వాసుదేవ మునేప్పగారి; ఛాయాగ్ర‌హ‌ణం:  ఛోటా కె.నాయుడు; ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వ‌శిష్ఠ‌; నిర్మాణ సంస్థ‌: ఎన్టీఆర్ ఆర్ట్స్‌; విడుద‌ల తేదీ: 05-08-2022

జ‌యాప‌జ‌యాల‌ను ప‌ట్టించుకోకుండా కొత్త క‌థ‌ల్ని భుజానికెత్తుకుంటూ.. కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిస్తూ సినీ కెరీర్‌ను వైవిధ్య‌భ‌రితంగా ముందుకు తీసుకెళ్తున్నారు క‌థానాయ‌కుడు క‌ల్యాణ్ రామ్‌. ఈ క్ర‌మంలోనే ఇప్పుడాయ‌న‌ ‘బింబిసార’గా  ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు. కొత్త ద‌ర్శ‌కుడు వశిష్ఠ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో సాగే సోషియో ఫాంట‌సీ సినిమా కావ‌డం..  ఇందుకు త‌గ్గ‌ట్లుగానే ప్ర‌చార చిత్రాలు చ‌క్క‌టి గ్రాఫిక్స్ హంగుల‌తో ఆస‌క్తిరేకెత్తించేలా ఉండటంతో అంద‌రి దృష్టి దీనిపై ప‌డింది.  మ‌రి ఈ బింబిసారుడి క‌థేంటి? ఆయ‌న చేసిన కాల ప్ర‌యాణం ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతిని అందించింది?

క‌థేంటంటే:  క్రీస్తు పూర్వం 500 సంవత్స‌రానికి చెందిన‌ త్రిగ‌ర్త‌ల సామ్రాజ్యాధినేత బింబిసారుడు (క‌ల్యాణ్ రామ్‌). క్రూర‌త్వానికి ప్ర‌తీక ఆయ‌న‌. రాక్ష‌సులు ఎరుగ‌ని రావ‌ణ రూప‌మ‌ది. ఆయ‌న‌ క‌న్ను ప‌డ్డ ఏ రాజ్య‌మైనా.. త్రిగ‌ర్త‌ల సామ్రాజ్యంలో భాగ‌మ‌వ్వాల్సిందే. ఎదురు తిరిగిన వాడు ఎంత‌టి వాడైనా త‌న క‌త్తి వేటుకు మ‌ట్టి క‌ర‌వాల్సిందే. ఆ క‌త్తికి రాజ్య కాంక్ష‌.. అధికార దాహం త‌ప్ప త‌ర‌త‌మ భేదాలు లేవు. క‌నిక‌రం అస్స‌లు తెలియ‌దు. అధికారానికి అడ్డు వ‌స్తాడేమోన‌న్న ఉద్దేశంతో త‌న‌ క‌వ‌ల సోద‌రుడు దేవ‌ద‌త్తుడిని చంపాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు.  అయితే అత‌డి నుంచి త‌ప్పించుకున్న దేవ‌ద‌త్తుడు (క‌ల్యాణ్ రామ్‌)కి.. ఓ మాయదర్పణం సాయంతో బింబిసారుడిని ప్రస్తుతానికి వెళ్లేలా చేస్తాడు. మరి వర్తమానంలోకి వచ్చిన బింబిసారుడికి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? విధి అత‌నికి ఎలాంటి పాఠాలు నేర్పింది?ఆ కాలంలో ఆయ‌న దాచిన నిధి త‌లుపులు తెర‌వ‌డం కోసం ఈ కాలంలో సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి (వివాన్ భ‌టేనా) ఎందుకు ప్ర‌య‌త్నిస్తుంటాడు? అత‌నికీ బింబిసారుడుకు ఉన్న శ‌త్రుత్వం ఏంటి? బింబి త‌న కాలానికి ఎలా తిరిగి వెళ్లాడు?  అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే:  టైమ్ ట్రావెల్ చిత్రాలు తెలుగు తెర‌కు కొత్తేమీ కాదు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఈ త‌ర‌హా సినిమాల్లో హీరో ప్ర‌స్తుతం నుంచి చ‌రిత్ర‌లోకి లేదంటే భ‌విష్య‌త్తులోకి వెళ్ల‌డం చూశాం. ఇందులో మాత్రం చ‌రిత్ర‌లో ఉన్న ఓ రాజు వ‌ర్త‌మానంలోకి రావ‌డం చూస్తాం. అలా ఎందుకు రావాల్సి వ‌చ్చింది.. ఈ క్ర‌మంలో అత‌నికెదురైన స‌వాళ్లేంటి.. గ‌తానికి స‌మాంత‌రంగా న‌డిచే వ‌ర్త‌మానలో అత‌ను చేసిన సాహ‌సాలేంటి? అన్న‌వి క‌థ‌లో ఆస‌క్తిరేకెత్తించే అంశాలు. వీట‌న్నింటినీ చ‌క్క‌గా ముడిపెడుతూ.. ప్రేక్ష‌కులు మెచ్చేలా ద‌ర్శ‌కుడు క‌థ రాసుకున్న విధానం మెప్పిస్తుంది. అయితే ఈ త‌ర‌హా పీరియాడిక్ ట‌చ్ ఉన్న చిత్రాల‌కు గ్రాఫిక్స్‌, ఆర్ట్ వ‌ర్క్ ఎంత అద్భుతంగా కుదిరితే.. సినిమా అంత అద్భుతంగా ప్రేక్ష‌కుల్ని రంజింపజేస్తుంది. బడ్జెట్‌ పరిమితుల నేపథ్యంలో ఆ రెండూ కుద‌ర‌లేద‌నిపిస్తుంది. ‘మ‌గ‌ధీర’, ‘బాహుబ‌లి’ చిత్రాలు చూసిన క‌ళ్ల‌కు ‘బింబిసార‌’లోని గ్రాఫిక్స్ హంగులు అంత ఇంపుగా అనిపించ‌క‌పోవ‌చ్చు. సాధార‌ణంగా టైమ్ ట్రావెల్ క‌థ‌ల్లో హీరో స్టోరీని వ‌ర్త‌మానం నుంచి మొద‌లు పెట్టి.. గ‌తంలోకి తీసుకెళ్లి తిరిగి వ‌ర్త‌మానంలోకి తీసుకొస్తుంటారు. అయితే  ఈ చిత్రంలో క‌థ బింబిసారుడి కాలం నుంచే మొద‌ల‌వుతుంది.

సినిమా ఆరంభ స‌న్నివేశాలు ఆస‌క్తిరేకెత్తించేలా ఉన్నా.. బింబి పాత్ర‌ను ప‌రిచ‌యం చేసిన తీరు చాలా చ‌ప్ప‌గా ఉంటుంది. అత‌నిలోని క్రూర‌త్వాన్ని.. రాజ్య కాంక్ష‌ను తెలియ‌జేస్తూ సాగే స‌న్నివేశాల్లో బ‌ల‌మైన‌ సంఘ‌ర్ష‌ణ క‌నిపించ‌దు. ఆ వెంట‌నే వ‌చ్చే ప్ర‌త్యేక గీతం క‌థలో ఇరికించిన‌ట్లుగా ఉంటుంది. బింబిసారుడు సైనికుల‌పై ధ‌న్వంత‌రి ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌టం.. వాళ్ల‌కు బుద్ధి చెప్పేందుకు బింబి స్వ‌యంగా రంగంలోకి దిగ‌డం.. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఓ ఎమోష‌న‌ల్ ఎపిసోడ్‌తో క‌థలో కాస్త వేగం పెరుగుతుంది. వ‌ర్త‌మానంలోకి వ‌చ్చాక బింబికి ఎదుర‌య్యే ప‌రిస్థితులు అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పూయిస్తాయి. మ‌ధ్య‌లో కొన్ని స‌న్నివేశాలు మ‌రీ అతిగా అనిపించినా.. విరామానికి ముందొచ్చే ఫైట్ ఎపిసోడ్ ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది. ద్వితీయార్ధంలో గ‌తాన్ని.. వ‌ర్త‌మానాన్ని స‌మాంత‌రంగా న‌డిపిస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లిన విధానం మెప్పిస్తుంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ప్ర‌తి ఎపిసోడ్ ప్రేక్ష‌కుల్ని రంజింప‌జేస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఆక‌ట్టుకుంటాయి.  సినిమాని ముగించిన తీరు సంతృప్తిక‌రంగా ఉంటుంది.

ఎవ‌రెలా చేశారంటే:  బింబిసారుడుగా.. దేవ‌ద‌త్తుడిగా రెండు పాత్రల్లో క‌ల్యాణ్ రామ్ అద‌ర‌గొట్టాడు.  వ‌న్ మ్యాన్ ఆర్మీలా క‌థ‌ను పూర్తిగా త‌న భుజాల‌పై మోశారు. వ‌ర్త‌మానంలో సాగే క‌థ‌లో ఆయ‌న పాత్ర చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తుంది. ఆయ‌న ప‌రిచ‌య స‌న్నివేశాల‌పై మ‌రింత శ్ర‌ద్ధ పెట్టి ఉంటే బాగుండేద‌నిపిస్తుంది. కేథ‌రిన్‌, సంయుక్తా పాత్ర‌లు రెండు మూడు స‌న్నివేశాల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. త‌నికెళ్ల భ‌ర‌ణి, ప్ర‌కాష్ రాజ్‌, శ్రీనివాస్ రెడ్డి పాత్ర‌లు ప‌రిధి మేర ఆక‌ట్టుకుంటాయి. వ‌శిష్ఠ రాసుకున్న క‌థ‌.. దాన్ని ఆక‌ట్టుకునేలా చెప్పిన విధానం బాగుంది. అయితే ప్ర‌ధ‌మార్ధాన్ని మ‌రింత ఆసక్తిక‌రంగా తీర్చిదిద్దుకుని ఉంటే సినిమా మ‌రో స్థాయిలో ఉండేది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, ఆర్ట్ వ‌ర్క్ పై మ‌రింత శ్ర‌ద్ధ పెట్టాల్సింది.  కీర‌వాణి నేప‌థ్య సంగీతం చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. యాక్ష‌న్‌, ఎమోష‌న‌ల్ ఎపిసోడ్స్‌లో ఆయ‌న మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.  వాసుదేవ్ సంభాష‌ణ‌లు ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి. ఛోటా.కె నాయుడు ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా నిర్మాణ విలువలున్నాయి.

బ‌లాలు

+ క‌థా నేప‌థ్యం

+ క‌ల్యాణ్ రామ్ న‌ట‌న‌

+ ఫైట్స్, నేప‌థ్య సంగీతం

బ‌ల‌హీన‌త‌లు

- ప్ర‌ధ‌మార్ధం

- నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం

చివ‌రిగా:  బింబిసారుడి ప్ర‌యాణం మెప్పిస్తుంది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని