Bimbisara: ‘బింబిసార 2’లో ఎన్టీఆర్‌?.. కల్యాణ్‌ రామ్‌ స్పష్టత

‘బింబిసార’ ప్రెస్‌మీట్‌. కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

Published : 01 Aug 2022 01:36 IST

తిరుపతి: కల్యాణ్‌ రామ్‌ (Nandamuri KalyanRam) హీరోగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’ (Bimbisara). కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. నూతన దర్శకుడు వశిష్ఠ (Vassishta) తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్‌ రామ్‌, వశిష్ఠ్‌, సినిమాటోగ్రాఫర్‌ చోటా కె. నాయుడు, నటుడు శ్రీనివాస్‌ రెడ్డి తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం, స్థానిక మీడియాతో సినీ విశేషాలు పంచుకున్నారు.

థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది: కల్యాణ్‌ రామ్‌

‘‘అందరిలానే నేనూ చందమామ కథలు వింటూ, చదువుతూ పెరిగా. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమాలు చూసి ఆనందించేవాడిని. సోషియో ఫాంటసీ చిత్రాల్లో నటించే అవకాశం నాకూ వస్తే బాగుంటుందనుకునేవాడిని. అలా నా కలను నిజం చేసిన దర్శకుడు వశిష్ఠకు కృతజ్ఞతలు. ఈ సినిమా నిర్మాణ విషయంలో నిర్మాత హరి ఎక్కడా తగ్గలేదు. విజువల్స్‌ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను ఓ స్థాయిలో రూపొందించారు. ఎం. ఎం. కీరవాణి (సంగీతం), చోటా కె. నాయుడు (ఛాయాగ్రహణం).. ఇలా అద్భుతమైన టెక్నిషియన్లు ఈ సినిమాకు పనిచేశారు. ప్రకాశ్‌రాజ్‌, సంయుక్త మేనన్‌, కేథరిన్‌, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు తమ తమ పాత్రలతో మిమ్మల్ని ఆకట్టుకుంటారు. ఇది థియేటర్లలో చూసి అనుభూతి పొందాల్సిన సినిమా’’ అని కల్యాణ్‌ రామ్‌ తెలిపారు. అనంతరం, మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

* ‘బింబిసార 2’లో మీ సోదరుడు తారక్‌ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు?

కల్యాణ్‌ రామ్‌: ‘బింబిసార 2’లో తారక్‌ (ఎన్టీఆర్) నటిస్తాడన్నది అవాస్తం (NTR). దాని గురించి నేనెక్కడా ప్రస్తావించలేదు. ఇది ఊహాగానం మాత్రమే. ఈ కథను రెండు భాగాల్లో చెప్పాలని ముందుగానే నిర్ణయించుకున్నాం. దానికి తగ్గట్టు స్క్రిప్టు సిద్ధం చేశాం. ప్రస్తుతానికి బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని పార్ట్‌ 1ని రూపొందించాం. ఇది ప్రేక్షకులకు నచ్చితే.. పార్ట్‌ 2 ఎప్పుడొస్తుందనే ఆసక్తి మొదలవుతుంది. అప్పుడే మేం ‘బింబిసార 2’ను మరింత అద్భుతంగా తెరకెక్కించగలం. అంతేకాదు ఈ చిత్రానికి ఒకటి కాదు మరిన్ని సీక్వెల్స్‌ చేయాలనుకుంటున్నాం.

*  టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సాగే కథ అంటున్నారు. ఈ చిత్రం ‘ఆదిత్య 369’లా ఉంటుందా?

కల్యాణ్‌ రామ్‌: ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే మీ ముందుకొస్తుంది. అప్పుడు దానికి సమాధానం మీరే చెప్తారు. టీజర్‌ విడుదలైన సమయంలో ఈ సినిమాని కొందరు ‘మగధీర’తో, మరికొందరు ‘బాహుబలి’తో పోల్చారు. ఇలాంటి గొప్ప సినిమాలతో మా చిత్రాన్ని పోల్చడం సంతోషం.

* థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది కదా. దీనిపై మీరేమంటారు?

కల్యాణ్‌ రామ్‌: ఈ విషయాన్ని నేను నమ్మను. గత నెలలో విడుదలైన ‘మేజర్‌’ (Major), ‘విక్రమ్‌’ (Vikram) సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకెళ్లారు? దీనికి సమాధానం మీరే చెప్పాలి. కంటెంట్‌ నచ్చితే వారు తప్పకుండా థియేటర్లకు వచ్చి, సినిమాలు చూస్తారు. తెలుగు వారికి ఉన్న ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమానే.

* మీ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఓ అభిమాని చనిపోయాడు కదా..!

కల్యాణ్‌ రామ్‌: ఇలా జరగడం చాలా బాధాకరం. ఆ అభిమాని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. నేనూ బాబాయ్‌ (బాలకృష్ణ), తమ్ముడు (ఎన్టీఆర్‌) అభిమానులకు ఎప్పుడూ అండగా ఉంటాం. ఇకపై అభిమానుల సమక్షంలో జరిగే వేడుకల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటాం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని