Published : 03 Aug 2022 20:32 IST

ప్రేక్షకుల అంచనాలను మించి ‘బింబిసార’ ఉంటుంది : నందమూరి కల్యాణ్‌ రామ్‌

రాక్షసులెరుగని రావణరూపాన్ని, శత్రువులు గెలవలేని కురుక్షేత్రాన్ని ఆగష్టు 5న ప్రేక్షకులకు చూపించడానికి వచ్చేస్తోంది ‘బింబిసార’. గంభీరమైన హావభావాలతో, ఉత్కంఠ పెంచే డైలాగులతో. ట్రైలర్‌లోనే కళ్లు చెదిరే మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లి అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను  అమాంతం పెంచేసిన ‘బింబిసార’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రం వెనుక ఉన్న విశేషాలు, బింబిసారుడిగా మారే క్రమంలో హీరో కల్యాణ్‌ రామ్‌కు ఎదురైన అనుభవాలను మనతో పంచుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?

* ‘బింబిసార’ ప్రపంచం మీకెలా పరిచయమైంది?
కల్యాణ్‌ రామ్‌: దర్శకుడు వశిష్ఠ నాకు 2015 నుంచి తెలుసు. 2018 డిసెంబర్‌లో ఒక కథ చెప్తానని నా దగ్గరికొచ్చాడు. నేనప్పటికి ‘మహానాయకుడు’ షూటింగ్‌లో ఉన్నాను. ఈ షూటింగ్‌ పూర్తయ్యాక వింటాను అని చెప్పాను. అంతకుముందు నార్మల్‌ కథలు చెప్పిన అతను ఈ కథ చెప్పేముందు సార్‌! ఈ స్టోరీలో నన్ను లాజిక్స్‌ అడక్కండి. అన్నీ మ్యాజిక్‌లే ఉంటాయి’ అన్నాడు. సరే అన్నాను. 2019లో నాకు ‘బింబిసార’ కథ చెప్పాడు. పీరియాడికల్‌, టైంట్రావెల్‌ కాన్సెప్టులతో నిజంగా మ్యాజిక్‌లా ఉందనిపించింది. ఒకే చెప్పాను.

*ఇంతకుముందు సినిమాలో మీరు ‘అతిమంచితనం’తో కనిపించారు, ఇందులో ‘అతి క్రూరత్వం’. ఎలా అనిపించింది?
కల్యాణ్‌ రామ్‌: కొత్తగా అనిపించింది. ‘బింబిసార’ కథలో నాకు బేస్‌లైన్‌ బాగా నచ్చింది. ‘అత్యంత క్రూరంగా ఉండే ఒక రాజు ఎలా మంచివాడుగా మారాడు’ అనే ఈ ప్రయాణం, ఈ కథనం చాలా ఆసక్తిగా అనిపించింది. స్క్రిప్టుని డెవలప్‌ చేసి రాజు పాత్రని ఇంకా గంభీరంగా చూపించాము.  

*ఇంత పెద్ద సినిమా విషయంలో మీరు కొత్త డైరెక్టర్‌ని నమ్మడం వెనుక కారణమేంటి?రిస్క్‌ అనిపించలేదా?
కల్యాణ్‌ రామ్‌: నేను ‘అతనొక్కడే’ సినిమా ఒకే చేసినప్పుడు సురేంద్రరెడ్డి అప్పటికి కొత్త డైరెక్టర్‌. ఆయన చెప్పిన కథ కూడా కొత్తదే. కానీ మేము కథని నమ్మాం. విజయం సాధించాం. అలా ఏ సినిమా అయిన కథాబలాన్నే నమ్ముకుంటాం. ‘బింబిసార’ కథకు ఆ సత్తా ఉంది.

*‘బింబిసార’ విషయంలో మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు?ఈ ప్రయాణం ఎలా నడిచింది?
కల్యాణ్‌ రామ్‌: నాలో ఉన్న ‘కోపం’ అనే హావభావాన్ని ఈ సినిమా కోసం ఎక్కువగా చూపించాల్సి వచ్చింది. అలా నటించడాన్ని బాగా ఎంజాయ్‌ చేశాను. ఇంతకు ముందు సినిమాల్లో రాజంటే ఇలా ఉండాలని తాతగారు(ఎన్టీయార్‌), బాబాయి(బాలకృష్ణ) ఇటీవల ‘బాహుబలి’తో ప్రభాస్‌ ఒక పక్క మార్క్‌ని ప్రేక్షకుల్లో ఏర్పరిచారు. దానిని అందుకునేలా పూర్తిగా నా బాడీ లాంగ్వేజ్‌ మార్చుకున్నాను. బింబిసారుడిగా మారే క్రమంలో ఒక కొత్త ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించాను. 

*ఈ సినిమా విషయంలో మీరు శారీరకంగా కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది.. ఆ అనుభవాలేంటి? 
కల్యాణ్‌ రామ్‌: అవును.. దానికి పూర్తిగా నా ట్రైనర్‌ కుమార్‌ మన్నవకి కృతజ్ఞతలు తెలియజేయాలి. రోజూ పక్కా ఆహారనియమాలు పాటించాను. జిమ్‌లో ఎక్కువగా గడిపాను. నాన్‌వెజ్‌, ఫ్రైడ్‌ ఐటమ్స్‌, డిసెర్ట్స్‌ వీటన్నింటికి గుడ్‌బై చెప్పేశాను. పద్నాలుగు రోజులకోసారి ఈ అలవాట్లకు విరామం. ఆ ఒక్క రోజు నచ్చినవి తిన్నాను. ఈ విధంగా  కష్టపడి ‘బింబిసార’కు ఉండాల్సిన ఆహార్యాన్ని సంపాదించాను.

* టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్టుతో వస్తున్నారు. ఒకప్పటి కాలాన్ని, ప్రస్తుత పరిస్థితిని ఎలా ముడిపెట్టారు?
కల్యాణ్‌ రామ్‌: అతి త్వరలోనే సినిమా విడుదలవుతుంది. చూశాక మీకే తెలుస్తుంది. దాని గురించి రివ్యూల రూపంలో మీరే చెప్పాలి. బింబిసారుని కథ, సోషియోఫాంటసీకి చెందిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటాయి.

* గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఉండే మరిన్ని చిత్రాలను మీ నుంచి ఆశించొచ్చా?
కల్యాణ్‌ రామ్‌: నిజం చెప్పాంటే ‘బింబిసార’లాంటి సినిమాలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. భవిష్యత్తులో జరగబోయే దాని గురించి నేను అప్పుడే నిర్ణయం తీసుకోలేను. కథ వెతుక్కుంటూ వస్తే తప్పకుండా చేస్తా.

* భారీ హంగులు, గ్రాండియర్‌ లుక్‌ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే ఆలోచనతోనే ఈ సినిమా చేశారా?
కల్యాణ్‌ రామ్‌: అదేం లేదండి. కొవిడ్‌కి ముందే మేం ఈ చిత్రాన్ని ప్రారంభించాం. అయినా గ్రాఫిక్స్‌, భారీ హంగులు ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనడంలో నిజం లేదు. ఇటీవల ‘మేజర్‌’, ‘విక్రమ్‌’ సినిమాల్లో అవేవీ కనిపించవు. కేవలం కంటెంట్‌ వాటికి విజయాన్ని అందించింది.  

*ఈ సినిమాలో మీ తాతగారి నేపథ్యాన్ని టచ్‌ చేశారా? భవిష్యత్‌లో ఆయన సినిమాలేమైనా రీమేక్‌ చేసే ఆలోచన ఉందా?
కల్యాణ్‌ రామ్‌: నాకస్సలు ఆ ఆలోచనే లేదు. ఆయనొక లెజెండ్‌. ఆయన సినిమాలను రీమేక్‌ చేయడమంటే సాహసమనే చెప్పాలి. ఈ సినిమాలో అటువంటి సాహసాలు చేయలేదు. కాని ‘పాతాళభైరవి’ని గుర్తుకు తెచ్చేలా బాబాయి ఎలా ‘భైరవద్వీపం’తో విజయం సాధించారో ‘బింబిసార’ అలాంటి విజయాన్ని సాధిస్తుంది. ఆ రోజులనాటి ఫాంటసీ సీన్లను గుర్తు చేస్తుంది. దర్శకుడు వసిష్ఠ్‌ తాతగారికి పెద్ద ఫ్యాన్‌. బహుశా ఆ అభిమానంతో ఈ సినిమాలో ఆనాటి గుర్తులు కనిపించొచ్చు.

*నటుడిగా, ప్రొడ్యూసర్‌గా మీ ప్రయాణం ఎలా సాగుతుంది? ప్రస్తుత ఇండస్ట్రీలో పరిస్థితులు క్లిష్టంగా అనిపిస్తున్నాయా?
కల్యాణ్‌ రామ్‌: ఈ సినిమాకి నేను నటుడిగానే పనిచేశాను. నేనే ప్రొడ్యూసర్‌ అనే ఆలోచన రాకుండా ‘బింబిసార’ పై దృష్టి పెట్టాను. రెండు పడవలపై ప్రయాణాన్ని ఇష్టపడను. నాకున్న బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి ఇష్టపడతాను. ‘బింబిసార’లో హీరోగా, ప్రొడ్యూసర్‌గా పనిచేయటం నాకు సంతృప్తినిచ్చింది. ఇక ఇండస్ట్రీ విషయానికొస్తే ప్రస్తుతం నేను ‘బింబిసార’ పనుల్లో బిజీగా ఉన్నాను. అది పూర్తయిన వెంటనే సమస్యల గురించి పూర్తిగా తెలుసుకుని స్పందిస్తాను.

*ట్రైలర్‌కు భారీగా రెస్పాన్స్ రావడంతో, ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయని భయపడుతున్నారా?
కల్యాణ్‌ రామ్‌: ముందుగా ట్రైలర్‌ హిట్‌ చేసినందుకు ప్రేక్షకులు, అభిమానులందరికి కృతజ్ఞతలు. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఒక కొత్తరకం ప్రపంచంలోకి అడుగుపెట్టిన ‘థ్రిల్‌’ ని ప్రేక్షకులు ‘బింబిసార’ చూసి పొందుతారు. వారి అంచనాలకు మించి సినిమా ఉంటుంది.

*‘బింబిసార’ని ఇతర భాషల్లో విడుదల చేసే ఆలోచన ఉందా?
కల్యాణ్‌ రామ్‌: ఆలోచన ఉంది. కానీ ముందు మన తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే మా కోరిక. ఎందుకంటే నా మొదటి ప్రాధాన్యం తెలుగు ప్రేక్షకులు, అభిమానులే.

*నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీస్టారర్‌ ఎప్పుడొస్తుంది?ప్రకటించే అవకాశం ఉందా?
కల్యాణ్‌ రామ్‌: ఈ రోజుల్లో మల్టీస్టారర్‌ అంటే చాలా అంచనాలు ఉంటున్నాయి. రాజమౌళి లాంటి దర్శకుడికే చాలా సమయం పట్టింది. నేను, తారక్‌ లేదా మాలో ఎవరైనా బాబాయితో చేయాలన్నా దానికి తగిన కథ కావాలి.అందుకు చాలా టైం పడుతుంది.

*ఈ సినిమా సీక్వెల్‌ ఉంటుందని, దానిలో జూనియర్‌ ఎన్టీయార్‌ హీరో అని ప్రచారం సాగుతోంది..అదెంతవరకు నిజం?
కల్యాణ్‌ రామ్‌: (నవ్వుతూ) నేను సీక్వెల్‌ ఉంటుందనే చెప్పాను. ఇప్పుడూ అదే చెప్తున్నాను. ‘బింబిసార’కు కచ్చితంగా సీక్వెల్‌ అయితే ఉంటుంది. అందులో హీరో ఎవరనేది భవిష్యత్‌లో తెలుస్తుంది. 

*మీ ప్రతి సినిమా ప్రీమియర్‌ షోని హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో చూస్తారట? ఆ రహస్యమేంటి?
కల్యాణ్‌ రామ్‌: అవును..కూకట్‌పల్లిలోని ‘భ్రమరాంబ థియేటర్‌’. అక్కడే ప్రీమియర్‌ షో చూస్తాను. అది నాకు సెంటిమెంటు. ‘బింబిసార’ ప్రీమియర్‌ షో ని అక్కడే చూస్తాను.

*ఎన్టీయార్ ‌30’  సినిమా ఎలా ఉంటుంది? ప్రొడ్యూసర్‌గా మీరు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు?
కల్యాణ్‌ రామ్‌: కచ్చితంగా పాన్‌ ఇండియా సినిమా అది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తుంది. భవిష్యత్‌లో దానికి సంబంధించిన కార్యాచరణ, ప్రణాళికల గురించి మాట్లాడతాను.

 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని