Published : 22 May 2022 02:04 IST

Bindu Madhavi: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విజేత.. బిందు మాధవి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ (Bigg boss non stop) విజేతగా నటి బిందు మాధవి (Bindu Madhavi) నిలిచారు. చివరి వరకూ నటుడు, వ్యాఖ్యాత అఖిల్‌ సార్థక్‌ తీవ్ర పోటీ ఇచ్చినా, బిందు మాధవి విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు, ప్రైజ్‌మనీ రూ.40లక్షలు సొంతం చేసుకున్నారు. అంతేకాదు, ఇప్పటివరకూ ప్రసారమైన ‘బిగ్‌బాస్‌’ తెలుగు సీజన్‌లలో ఒక్కసారి కూడా ఉమెన్‌ కంటెస్టెంట్‌ విజేతగా నిలవలేకపోయారు. కానీ, బిందు మాధవి తనదైన ఆటతీరుతో నెటిజన్ల మనసు గెలుచుకుని, ఆ రికార్డును బద్దలు కొట్టి మహిళా విజేతగా నిలిచారు.

మొదటి నుంచి దూకుడుగా..

‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’(Bigg boss non stop)లో మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకొన్నారు బిందు మాధవి(Bindu Madhavi). ఎక్కువగా శివ అండ్‌ -కోతో కనిపించిన ఆమె, ఆట కోసం కొన్నిసార్లు అదిరిపోయే ట్విస్టులు ఇచ్చేవారు. తనని నామినేట్‌ చేసిన వారికి కాస్త గట్టిగానే సమాధానం చెప్పేవారు. ఇక అటు ఫిజికల్‌ గేమ్స్‌, ఇటు మైండ్‌ గేమ్స్‌లోనూ తన స్ట్రాటజీని ఉపయోగిస్తూ తోటి కంటెస్టెంట్‌లను ఇరుకున పెట్టేవారు. ఒకానొక దశలో నటరాజ్‌ మాస్టర్‌-బిందుమాధవిల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అప్పుడు కూడా సహనం కోల్పోకుండా బిందు మాధవి వ్యవహరించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ అఖిల్‌, అరియానా, శివ, మిత్రశర్మలతో కలిసి టాప్‌-5లో నిలిచారు. ఈ ఐదుగురిలో బిందు మాధవికి అఖిల్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఎందుకంటే అఖిల్‌ గతంలో బిగ్‌బాస్‌ రన్నర్‌గా నిలవడం, ఆ తర్వాత వివిధ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యారు. మరోవైపు బిందు మాధవి గత కొంతకాలంగా తెలుగు సినిమాలు చేసింది లేదు. దీంతో అఖిల్‌కే ఎడ్జ్‌ ఎక్కువగా ఉంటుందని అందరూ భావించారు. చివరి వారం ఇరువురి మధ్యా నువ్వా-నేనా అన్నట్లు  ఓట్లు పోలయ్యాయి. తెలుగుతో పాటు, తమిళంలో అధికంగా బిందు మాధవికి గుర్తింపు ఉండటంతో అక్కడి ప్రేక్షకుల ఓట్లు కూడా కలిసొచ్చాయి. అలా ఈ సీజన్‌ విజేతగా బిందు మాధవి నిలిచారు.

ఫినాలే సందర్భంగా ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’నకు ఎందుకు వచ్చావు? అని నాగార్జున బిందు మాధవిని ప్రశ్నించగా, ‘తమిళ బిగ్‌బాస్‌, సినిమాలు అక్కడి ప్రేక్షకులకు దగ్గర చేశాయి. అక్కడ వరుస అవకాశాలు రావడంతో తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యా. ఎలాగైనా ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరవ్వాలని, తెలుగు సినిమాల్లో మళ్లీ నటించాలనుకుంటున్నా. అందుకే ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ ఒప్పుకొన్నా’’ అని సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి, నటుడు సునీల్‌ డబ్బుతో తెచ్చిన సూట్‌ కేసును బిందు మాధవి తిరస్కరించారు. మాధవి కోసం తన తర్వాతి చిత్రంలో ఓ పాత్రను సిద్ధం చేస్తానని అనిల్‌ రావిపూడి హామీ ఇచ్చారు. బాలకృష్ణ సినిమాలో ఆ పాత్ర ఉండేలా ప్రయత్నిస్తానని చెప్పారు.

ట్రోఫీ అందుకున్న అనంతరం బిందు మాధవి మాట్లాడుతూ.. ‘‘లేట్‌ బ్లూమర్స్‌కు ఈ ట్రోఫీ అంకితం చేస్తున్నా. ఎందుకంటే నేను కూడా ఆ కోవకు చెందినదాన్నే. నా జీవితంలో అన్నీ చాలా ఆలస్యంగా అందుకునేదాన్ని. సక్సెస్‌ను కూడా చాలా ఆలస్యంగా రుచి చూశా. ఎన్నో ఏళ్లు కష్టపడ్డా కొందరికి విజయం రాదు.. కొంత మంది నమ్మకాన్ని వదిలేస్తారు.. కానీ కొంత మంది మాత్రమే చివరి వరకూ నమ్మకంతో పోరాడతారు. మీరు ఎంచుకున్న రంగంలో, వృత్తిలో ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లాలి. ట్రోఫీ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఆదరించి, ఓటు వేసిన  ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని భావోద్వేగానికి గురయ్యారు.

 

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌.. ఆసక్తికర విశేషాలు ఇవే..

* ప్రతి సంవత్సరం టెలివిజన్‌లో ప్రసారమయ్యే ‘బిగ్‌బాస్‌’ సీజన్‌కు భిన్నంగా కేవలం ఓటీటీ వేదికగా ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ను ప్రారంభించారు.

* 24/7 అంటూ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఫిబ్రవరి 27న ‘బిగ్‌ బాస్‌ నాన్‌స్టాప్‌’ మొదలైంది.

* ఈ సరికొత్త సీజన్‌కు కూడా అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 

* హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ సీజన్‌ 84 రోజుల పాటు నడిచింది.

* మొత్తం 18మంది కంటెస్టెంట్‌లు ఇందులో పాల్గొన్నారు. ఇందులో కొత్త వారితో పాటు, గతంలో టెలివిజన్‌లో ప్రసారమైన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వారు కూడా ఈసారి పోటీ పడ్డారు.

*అజయ్‌కుమార్‌, అఖిల్‌ సార్థక్‌, బిందు మాధవి, హమీదా, మహేశ్‌ విట్టా, ముమైత్‌ఖాన్‌, తేజస్విని మదివాడ, శ్రీ రాపాక, అరియానా, శివ, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతు, అనిల్‌ రాథోడ్‌, మిత్ర శర్మ, బాబా భాస్కర్‌, నటరాజ్‌మాస్టర్‌, అషురెడ్డి, సరయు పాల్గొన్నారు.

* బిందు మాధవి, అఖిల్ సార్థక్‌, యాంకర్ శివ, అరియానా గ్లోరి, మిత్రా శర్మలు టాప్‌-5లో నిలవగా..  అభిమానుల మనసు గెలుచుకున్న బిందు మాధవి విజేతగా నిలిచింది. 

* బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఫినాలేలో దర్శకుడు అనిల్‌ రావిపూడి, సునీల్‌ డబ్బుతో నిండిన సూట్‌కేసును తీసుకొచ్చారు. డబ్బులు తీసుకునేందుకు అరియానా, శివ ముందుకు వచ్చారు. అయితే, తాను ఫ్లాట్‌ కొనుగోలు చేసుకోవడానికి డబ్బులు అవసరం అంటూ అరియానా ఒక అడుగు ముందుకేసి రూ.10లక్షలు ఉన్న సూట్‌ కేసును తీసుకున్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని