Bloody Daddy Review: రివ్యూ: బ్లడీ డాడీ.. షాహిద్‌ కపూర్‌ సినిమా ఎలా ఉందంటే?

షాహిద్‌ కపూర్‌ సినిమా ఎలా ఉందంటే?

Updated : 25 Jun 2024 16:15 IST

Bloody Daddy Review.. చిత్రం: బ్లడీ డాడీ; తారాగణం: షాహిద్‌ కపూర్‌, సర్తాజ్‌ కక్కర్‌, రోనిత్‌ రాయ్‌, సంజయ్‌ కపూర్‌, డయానా పెంటీ తదితరులు; సంగీతం: జులియస్‌ (నేపథ్య సంగీతం), బాద్‌షా, ఆదిత్య దేవ్‌, అనుజ్‌ (పాటలు); ఎడిటింగ్‌: స్టీవెన్‌ హెచ్‌. బెర్నార్డ్‌; సినిమాటోగ్రఫీ: మార్కిన్‌; నిర్మాణ సంస్థలు: జియో స్టూడియోస్‌, ఆఫ్‌సైడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆజ్‌ ఫిల్మ్స్‌; దర్శకత్వం: అలీ అబ్బాస్‌ జాఫర్‌; విడుదల: 09-06-2023 (ఓటీటీ జియో సినిమాలో)

ఓ భాషలో హిట్‌ అయిన కొన్ని చిత్రాలు తక్కువ సమయంలోనే మరో భాషలోకి రీమేక్‌ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలకు చాలా కాలం పడుతుంది. ఈ రెండో కోవకు చెందిందే ‘బ్లడీ డాడీ’ (Bloody Daddy). 2011లో విడుదలైన ఫ్రెంచ్‌ సినిమా ‘స్లీప్‌లెస్‌ నైట్‌’ (Sleepless Night) ఆధారంగా దీనిని హిందీలో రూపొందించారు. షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor) హీరోగా అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం నేరుగా ‘జియో సినిమా’ (Jio Cinema)లో శుక్రవారం విడుదలైంది. మరి, ఆ కథేంటి? ఎలా ఉందంటే? (Bloody Daddy Review)

కథేంటంటే: సుమేర్ ఆజాద్‌ (షాహిద్ కపూర్).. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారి. కరోనా సమయంలో.. డ్రగ్స్‌ అమ్మే ముఠాపై దాడి జరిపి రూ. కోట్ల విలువైన కొకైన్‌కు స్వాధీనం చేసుకుంటాడు. కాల్పుల్లో ఆ గ్యాంగ్‌లోని ఓ సభ్యుడు చనిపోతాడు. ఈ ఘటనపై రగిలిపోయిన ఆ చీకటి సామ్రాజ్యానికి అధిపతి సికిందర్‌ (రోనిత్‌ రాయ్‌).. సుమేర్‌ కొడుకు అథర్వ్‌ (సర్తాజ్‌ కక్కర్‌)ని కిడ్నాప్‌ చేస్తాడు. డ్రగ్స్‌ బ్యాగ్‌ని ఇస్తేనే కొడును వదిలేస్తానని వార్నింగ్‌ ఇస్తాడు. మరి, డ్రగ్స్‌ బ్యాగ్‌ని తీసుకెళ్లిన సుమేర్‌ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? నార్కోటిక్స్‌ అధికారులు అదితి (డయానా పెంటీ), సమీర్‌ (రాజీవ్‌ ఖండేల్‌వాల్‌) అక్కడికి ఎందుకెళ్లారు? సుమేర్‌ తన తనయుణ్ని బయటకు తీసుకురాగలిగాడా, లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే (Bloody Daddy Review).

ఎలా ఉందంటే: చిన్న పాయింట్‌తో రూపొందిన సినిమా ఇది. దాడి, కిడ్నాప్‌, పోరాటాలు.. ఇవే చిత్రంలో ప్రధానాంశాలు. కొన్ని కథలు చెప్పేందుకు చిన్నగా ఉన్నా చక్కని స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిస్తే, మంచి విజయం అందుకుంటాయని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. ఈ సినిమా విషయంలో దర్శకుడు అలీ అబ్బాస్‌ ఆ మార్క్‌ని అందుకోలేకపోయారు. నిడివి పెంచాలనే ఉద్దేశమో ఏమోగానీ స్టోరీని సాగదీశారు. 2 గంటలున్న నిడివిని ట్రిమ్‌ చేసి ఉంటే ఈ సినిమా మరింత రేసీగా ఉండేది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ (2021 నవంబరు) ముగిసిన తర్వాత దిల్లీ, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో జరిగే కథ ఇది. కారు ఛేజింగ్, డ్రగ్స్‌ దందా నడిపే వాళ్లను హీరో పట్టుకునే తదితర సన్నివేశాలతో ఆరంభం ఆసక్తి రేకెత్తిస్తుంది. కొడుకును రక్షించుకునేందుకు ఏ దారీలేని హీరో.. చివరకు కొకైన్‌ బ్యాగ్‌ని విలన్‌ ఉన్న హోటల్‌కు తీసుకెళ్లడం, సీసీ కెమెరాలు ఎక్కడెక్కడున్నాయో పరిశీలించడం, తదనుగుణంగా తన ప్రణాళిక అమలు చేయడం.. వావ్‌ అనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది (Bloody Daddy Review).

‘ఆ డబ్బు ఇవ్వు. మీ బాబును వదిలేస్తా’, ‘ముందు ఆ బంగారం ఇవ్వు. తర్వాత మీ అమ్మాయిని తీస్కో’.. కిడ్నాపర్లు- బాధిత కుటుంబాల మధ్య చోటుచేసుకున్న ఇలాంటి సంభాషణలు ఇప్పటికే ఎన్నో సినిమాలు చూశాం. ఇందులోనూ ఇదే తరహా డ్రామా. ‘ముందు నువ్వు అంటే.. నువ్వు ఇవ్వు’ అంటూ విలన్‌, హీరో మధ్య పోరాటం సాగుతూనే ఉంటుంది. అయితే, హీరోయిజం, యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఆ ఎపిసోడ్‌ని తగ్గించి.. హీరో వ్యక్తిగత జీవితాన్ని చూపించి ఉంటే ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యేందుకు అవకాశం ఉండేది. తండ్రి, కొడుకుల మధ్య అనుబంధాన్నీ పెద్దగా ఆవిష్కరించలేదు. హీరో విడాకులు ఎందుకు తీసుకున్నాడు? కొడుకుతో అనుబంధం ఎలా ఉంది? అనే విషయాన్ని లోతుగా ప్రస్తావిస్తే బాగుండేది. ప్రస్తుతానికి ఈ చిత్రం హిందీ ఆడియోతో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్‌ కావొచ్చు. అదే ‘స్లీప్‌లెస్‌ నైట్‌’ రీమేక్‌గా 2015లో తమిళ్‌ చిత్రం ‘చీకటి రాజ్యం’ (కమల్‌హాసన్‌ హీరో)  తెరకెక్కింది (Bloody Daddy Review).

ఎవరెలా చేశారంటే: ఎన్‌.సి.బి. అధికారి సుమైర్‌ ఆజాద్‌గా షాహిద్‌ కపూర్‌ చక్కగా నటించారు. నటనతో ‘వన్‌మ్యాన్‌ షో’ అనిపించారు. ఈయన కొడుకుగా నటించిన సర్తాజ్‌ కక్కర్‌ మెప్పిస్తాడు. విలన్‌ గ్యాంగ్‌ పాత్రల మేరకు నటించారు. డయానా పెంటీ, రాజీవ్‌ ఖండేల్‌వాల్‌ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎడిటింగ్‌ మినహా సాంకేతికంగా అన్ని విభాగాల వారి పనితీరు ఓకే. గతంలో.. ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’ వంటి సినిమాలను తెరకెక్కించిన అలీ అబ్బాస్‌ ఇందులో యాక్షన్‌కే పెద్దపీట వేశారు (Bloody Daddy Review). 

బలాలు

+ షాహిద్‌ కపూర్‌ నటన

+ పోరాటాలు

బలహీనతలు

- కథ, కథనం

- సాగదీత సన్నివేశాలు

చివరిగా: ‘బ్లడీ డాడీ’.. యాక్షన్‌ లవర్స్‌ కోసం (Bloody Daddy Review)!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని